జవాన్లకు రోజూ యోగా | Sakshi
Sakshi News home page

జవాన్లకు రోజూ యోగా

Published Tue, Jun 30 2015 1:15 AM

జవాన్లకు రోజూ యోగా

తప్పనిసరి చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో 10 లక్షల మందికి పైగా ఉన్న పారామిలటరీ జవాన్ల రోజువారీ భౌతిక వ్యాయామంలో యోగాను చేర్చాలని కేంద్ర సాయుధ పోలీసు దళాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దేశ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్నా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నా తప్పనిసరిగా యోగా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. సాధారణంగా సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి కేంద్ర సాయుధ బలగాల జవాన్లు రోజువారీ భౌతిక వ్యాయామాలు చేయడం తప్పనిసరి.

వారు క్యాంపుల్లో ఉన్నా, సరిహద్దుల వద్ద విధుల్లో ఉన్నా కూడా వ్యాయామం చేయాల్సిందే. అయితే తాజాగా భౌతిక వ్యాయామాలతో పాటు యోగా చేయడానికి కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐడీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్ తదితర బలగాలకు కేంద్ర హోంశాఖ  సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిపై క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి సూచనలు జారీచేయాలని పేర్కొంటూ ఆయా దళాల డెరైక్టర్ జనరల్స్‌ను ఆదేశించింది.

‘భారతీయ పురాతన సాంప్రదాయమైన యోగాను రోజువారీ చర్యల్లో భాగంగా చేసుకుని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భద్రతా బలగాల రోజువారీ చర్యల్లో యోగాను చేర్చడం సముచితమైనది..’ అని సర్క్యులర్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement