మోదీ.. మీరు గొప్ప విప్లవనాయకులండీ! | Sakshi
Sakshi News home page

మోదీ.. మీరు గొప్ప విప్లవనాయకులండీ!

Published Mon, Jan 15 2018 6:12 PM

You are a revolutionary leader: Netanyahu to Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆరురోజుల భారత పర్యటన కోసం సతీసమేతంగా విచ్చేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వ్యవసాయ, విద్యుత్‌, సినిమా తదితర రంగాలకు సంబంధించి మొత్తం 9 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భేటీ అనంతరం ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.

మోదీ.. విప్లవనాయకుడు : ఉమ్మడి ప్రకటన చేస్తూ భారత్‌, ఇజ్రాయెల్‌ ప్రధానులు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ‘మోదీ అసలైన అర్ధంలో గొప్ప విప్లవనాయకుడు’ అని నెతన్యాహు వ్యాఖ్యానించగా, ‘ఉదార ప్రేమకు ధన్యవాదాలు బిబి..’ అని మోదీ అన్నారు. బెంజిమెన్‌ నెతన్యాహును ఇజ్రాయెలీలు ‘బిబి’ గానూ వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌-ఇండియాల మైత్రి మునుపటికంటే బలపడుతూ, ఫలవంతంగా ముదుకు సాగుతున్నదని, ఇరుదేశాలూ ఉగ్రబాధితులే కావడంవల్ల రక్షణ రంగంలో పరస్పర సహకారం అనివార్యమైందని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ‘అవకాశం చిక్కితే మీతో కలిసి యోగా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నా’నని ఆయన చమత్కరించారు.

గతేడాది ఇజ్రాయెల్‌ పర్యటనలో నెతన్యాహు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ భారత ప్రధాని మోదీ.. ‘‘రెండు దేశాల మధ్య బంధాలకు అవరోధాలుగా నిలిచే కొన్ని అధికారిక బంధనాలను తెంచుకొని, మరింతగా బలపడదామని గతంలో మీరు అన్నారు. ఆ మాట ప్రకారం భారత్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సిద్ధం చేసిఉంచాం’’ అని అన్నారు. గాజా విషయంలో భారత్‌ నిర్ణయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకమైనదే అయినా ఇతరత్రా అంశాలపై ఆ ప్రభావం ఉండబోదని నెతన్యాహు తెలిపారు. ఇక అమెరికా సహా 128 దేశాలు చేసినట్లుగా ‘జెరుసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించే’ విషయంలోనూ భారత్‌ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం.

వావ్‌.. బాలీవుడ్‌లోకి వస్తున్నాం : సినిమా రంగానికి సంబంధించి ఇజ్రాయెల్‌-భారత్‌ల మధ్య ఒప్పందాలు కుదరడాన్ని ఉటంకిస్తూ.. ‘వావ్‌.. మేము బాలీవుడ్‌లోకి వస్తుండటం చాలా సంతోషంగా ఉంద’ని నెతన్యాహు అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహు, ఆయన సతీమణి సారా ముంబైలో బాలీవుడ్‌ తారలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అటు అందాల తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నారు. ఆదివారం ఢిల్లీలో విమానం దిగిన నెతన్యాహుకు.. ప్రోటోకాల్‌ పక్కనపెట్టిమరీ మోదీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement