తెలంగాణ వంటల తాత ఇకలేరు..!

2 Nov, 2019 03:56 IST|Sakshi

సంప్రదాయ వంటల నుంచి.. చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్‌ ఫుడ్‌ వరకు అన్నింటినీ అవలీలగా వండి వార్చే యూట్యూబ్‌ వంటల తాత ఇకలేరు. ‘గ్రాండ్‌పా కిచెన్‌’ను యూట్యూబ్‌ ఫాలో అవుతున్న వాళ్లందరికీ వంటల తాతగా పరిచయమున్న నారాయణరెడ్డి(73) అక్టోబర్‌ 27న అనారోగ్యంతో హైదరాబాద్‌కు సమీపంలోని తన సొంతూరులో మరణించారు.  ఈ తెలంగాణ తాత 2017లో ప్రారంభించిన గ్రాండ్‌ పా కిచెన్‌ చానల్‌కు ఏకంగా 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆయన వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేస్తారు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతారు. అంతేకాదు యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టిన రోజు కానుకలు కొనిపెడు తుంటారు. చనిపోయే ముందు 6 రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు.  నోరూరించే వంటకాలను తయారుచేసే విధానాన్ని చూపించి, వాటిని అనాథలకు పంచిపెట్టే నారాయణరెడ్డికి విదేశాల్లోనూ అభిమానులున్నారు. 

మరిన్ని వార్తలు