అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు | Sakshi
Sakshi News home page

అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు

Published Thu, Apr 28 2016 1:03 AM

అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు - Sakshi

♦ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలిపిన వైఎస్ జగన్
♦ కొనుగోళ్ల తీరుపై వినతి పత్రం అందజేత
♦ హామీల అమలుకు మరో వినతి పత్రం
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత  జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలియజేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో పార్టీ నేతలతో కలిసి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. ఏపీలో రూ.30 కోట్ల నగదు, పదవులు వంటి ప్రలోభాలు ఎర వేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరుపై ఒక వినతిపత్రం, ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని జైట్లీకి సమర్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి బాగోతం, కుంభకోణాలపై ప్రచురించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని అందజేశారు. ఆ పుస్తకాన్ని తిరగేసిన జైట్లీ అమరావతిలో జరిగిన భూకుంభకోణాన్ని వివరించాలని జగన్‌ను కోరారు.జగన్ చెప్తున్న విషయాలను  విని నోట్ చేసుకున్నారు. కొన్ని ప్రశ్నలు వేసి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.  అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు అవినీతిపై ఒక వినతిపత్రం, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మరో వినతి పత్రాన్ని అరుణ్‌జైట్లీకి ఇచ్చాను. ఎంపరర్ ఆఫ్ కర ప్షన్ పుస్తకాన్ని కూడా అందజేశాను’’ అని తెలిపారు. జగన్ వెంట వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి తదితరులున్నారు.
 
 జగన్‌ను పలకరించిన ధర్మేంద్ర ప్రదాన్
 కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పార్లమెంట్ లాబీలో జగన్‌ను పలకరించారు. బుధవారం మధ్యాహ్నం జగన్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పార్లమెంటులో కలిసి వస్తుండగా లాబీలో ధర్మేంద్ర ప్రదాన్ చూసి ఆత్మీయంగా పలుకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
 

అనైతిక రాజకీయాలపై అన్ని కోణాల్లో యుద్ధం: వైఎస్ జగన్

 

Advertisement

తప్పక చదవండి

Advertisement