ఆమరణ నిరాహార దీక్షకు అనుమతించండి.. | Sakshi
Sakshi News home page

‘ఏపీ భవన్‌లో దీక్షకు అనుమతి ఇవ్వండి’

Published Tue, Apr 3 2018 1:42 AM

YSRCP MPs Met AP Bhavan Resident Commissioner - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకపోతే ఎంపీల పదవులకు రాజీనామాలు చేసి.. వెంటనే ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్సార్‌ సీపీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ ఎంపీలు సోమవారం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ను కలిశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలిచి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతించాలని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభిప్రాయాన్ని చెబుతామని ఆర్సీ చెప్పినట్టు బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు.

ఆమరణ నిరాహార దీక్షకు దిగే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాకపోయినా దీక్ష చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇదే ఏపీ భవన్‌లో ధర్నా చేసేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిరవధికంగా వాయిదా పడతాయే తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే బాధ్యతాయుతంగా అనుమతి కోసం ఆర్సీని సంప్రదించినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం పున:సమీక్షకు వెళ్లాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాయడంపై ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. దళితుల హక్కులను కాపాడడంలో వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పార్టీ ఎంపీలు ఏపీ భవన్‌ ఆవరణలో దీక్ష చేయనున్న వేదికను పరిశీలించారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రం దిరిరాకపోతే తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement