ఢిల్లీ వీధుల్లో హోదా గర్జన! | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వీధుల్లో హోదా గర్జన!

Published Tue, Mar 6 2018 3:01 AM

Ysrcp protest for ap special status in delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రత్యేక హోదా మా హక్కు’అన్న నినాదంతో హస్తినలో దిక్కులు పిక్కటిల్లాయి. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆవేదనను ప్రతిబింబిస్తూ.. ప్రత్యేక హోదా ఆకాంక్షకు ప్రతీకగా నిలుస్తూ.. దేశరాజధానిలో సోమవారం ‘మహా ధర్నా’జరిగింది. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ ఈ మహాధర్నాను చేపట్టిన సంగతి తెల్సిందే. పార్లమెంటు బడ్జెట్‌ మలివిడత సమావేశాలు సోమవారం ప్రారంభమైన తరుణంలో చేపట్టిన ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పీఠానికి మరోసారి ఎలుగెత్తి చాటింది.

2015 ఆగస్టు 10న ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇదే స్థలంలో భారీ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా అనేక ఆందోళనల అనంతరం హోదాపై పోరు తుది దశకు చేరుకుంది. ఢిల్లీలో ధర్నా కార్యక్రమం హోదా కోసం పోరాడుతున్న ఆందోళనకారుల్లో సమరోత్సాహాన్ని నింపింది. ఈనెల 21న కేంద్రంపై వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నది. ఏప్రిల్‌ 5 వరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడనున్నారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్‌ 6న పార్టీ ఎంపీలు రాజీనామాలు సమర్పించనున్నారు.

సోమవారంనాటి మహాధర్నా కార్యక్రమం ఆంధ్రుల ఆందోళనను, ఆవేదనను ఢిల్లీకి గట్టిగా వినిపించింది. నాయకుల అరెస్టులు, కార్యకర్తల ఆందోళనలు, తోపులాటలు, స్వల్ప ఉద్రిక్తతల నడుమ మధ్యాహ్నం 2 గంటలకు ఆందోళన కార్యక్రమం ముగిసింది. వామపక్షాలు, ఆప్, ప్రజాసంఘాల నేతలు ధర్నా కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించడం, ప్రత్యేక హోదాకు మద్దతుగా ప్రసంగించడం మహాధర్నా కార్యక్రమంలో విశేషంగా నిలిచింది.

సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నాలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి సహా పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్‌ నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధర్నా సభకు అధ్యక్షత వహించారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభ సమయంలో మహా నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల అలంకరించారు.  

వామపక్షాలు, ఆప్, ప్రజాసంఘాల సంఘీభావం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఢిల్లీలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ, ఆప్‌ పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి, సంయుక్త కార్యాచరణ కమిటీ, తదితర ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. సినీ విమర్శకులు కత్తి మహేష్‌ సంఘీభావం తెలిపారు.

సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు ధర్నాకు సంఘీభావం తెలుపుతూ వేదికపై మాట్లాడారు. ఆప్‌ నేత రామారావు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, సదాశివరెడ్డి తదితరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా సంయుక్త కార్యాచరణ కమిటీ నేతలు పలువురు వైఎస్సార్‌సీపీ ఆందోళనకు సంఘీభావం తెలిపారు.

ఉదయం నుంచి ఉత్సాహంగా..
రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ చేరుకున్న పార్టీ కార్యకర్తలు, నేతలు సోమవారం ఉదయం 8 గంటల నుంచే ధర్నాస్థలికి చేరుకోవడం కనిపించింది. జంతర్‌మంతర్‌ సమీపంలోని పార్లమెంట్‌ వీధిలో గల పోలీస్‌ స్టేషన్‌ ముందు ఈ ధర్నా ఉదయం 10 గంటలకే ప్రారంభమైంది. అప్పటికే ధర్నా వేదిక కిక్కిరిసిపోయింది. పదుల సంఖ్యలో నేతలు వేదికపై ప్రసంగించారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించిన తీరు, దానికి పరిహారంగా ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం మోసగిస్తున్న వైనాన్ని నేతలు కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిన అవసరాన్ని, ఇవ్వకుండా చూపుతున్న సాకులను వివరించారు. హోదా తెచ్చేందుకు ముందు వరసలో ఉండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడంపై వక్తలు విమర్శలు కురిపించారు. కాగా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రత్యేక హోదా కోసం తాము కూడా రాజీనామా చేస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు ధర్నా వేదికపై ప్రకటించారు.

ధర్నాకు హాజరైన ముఖ్యనేతలు..
ఎంపీలు: మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వి.వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి  
ఎమ్మెల్యేలు: పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేకపాటి గౌతం రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి, మేకా ప్రతాప్‌అప్పారావు, కోనా రఘుపతి, అనిల్‌ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజన్న దొర, అంజాద్‌ బాషా, అయిజయ్య, విశ్వేశ్వర్‌ రెడ్డి, పుష్ప శ్రీవాణి, గౌరు చరిత, వి.కళావతి, కాకాని గోవర్దన్‌రెడ్డి, నారాయణస్వామి, కంబాల జోగులు, బి.ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, రక్షణనిధి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆర్‌.ప్రసాదరెడ్డి, సునిల్‌ కుమార్, రవీంద్రనాథ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, జంకె వెంకటరెడ్డి, ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, కె.సంజీవయ్య, రఘురామిరెడ్డి, గుమ్మనూరి జయరాములు, వై.సాయిప్రసాదరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి  
ఎమ్మెల్సీలు: ఉమ్మారెడ్డి , పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కోలగట్ల వీరభద్రరావు, గోపాలరెడ్డి
పార్టీ నేతలు: బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, విశ్వరూప్, అనంత వెంకటరామిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, తమ్మినేని సీతారాం, వంగవీటి రాధా, కాపు రాంచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కన్నబాబు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, ధర్మాన కృష్ణదాసు, రెడ్డి శాంతి, గౌరు వెంకటరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, రెహమాన్, ఎ.వరప్రసాదరెడ్డి, రత్నాకర్, కుంభా రవిబాబు, గుడివాడ అమర్‌నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, గోపాలరెడ్డి, కోటగిరి శ్రీధర్, మొండితోక అరుణ్, వంశీకృష్ణ, రేవతి, సింహాద్రి రమేశ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.   

నేతల అరెస్టులు.. శ్రేణుల కదనోత్సాహం..
ఢిల్లీలో ఎండలు మొదలవడంతో వాతావరణం వేడెక్కి ఉన్నా పార్టీ శ్రేణులు కదనోత్సాహాన్ని చూపాయి. ఉదయాన్నే ధర్నా స్థలికి చేరుకున్న శ్రేణులు అడుగడుగునా ‘ప్రత్యేక హోదా’కోసం నినదించాయి. వక్తల ప్రసంగాలకు, విమర్శలకు స్పందిస్తూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ‘ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు’అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కేంద్ర హోం శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు పార్లమెంటు వైపు ర్యాలీగా వెళుతుండగా పోలీసులు ఒక్కసారిగా నేతలను దిగ్బంధించారు. నేతలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అయితే ఈ సందర్భంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకున్నారు. వాహనం ముందు పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. కొందరు రోడ్డుపైనే పడుకుండిపోయారు.

దాదాపు 20 నిమిషాలు కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు అడ్డగించడంతో పోలీసులు వాహనాన్ని వెనక్కి మళ్లించి మరో దారి గుండా నేతలను పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు పోలీసు వాహనాన్ని వెంబడించగా బారికేడ్లతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్టయిన వారిలో మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు, సీనియర్‌ నేతలు ఉన్నారు.  

Advertisement
Advertisement