ఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు | Sakshi
Sakshi News home page

ఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

Published Thu, Jan 23 2020 2:07 PM

STS Sankranthi Celebrations held in Singapore - Sakshi

సింగపూర్ : రెండు రోజులపాటు సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. మొదటిరోజు వామనగుంటలు, దాడి, పచ్ఛీసు, అష్టాచమ్మా, పరమపదసోపానం, గోళీలాట, బొంగరాలు , గాలిపటాలు మొదలగు సంప్రదాయ ఆటలు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, సంక్రాంతి లక్ష్మిపూజ, హరిదాసు, గొబ్బిళ్ళ ఆటపాటల కోలాహలంతో అచ్ఛతెలుగు సంక్రాంతి శోభ ఉట్టిపడింది. అనంతరం స్ధానిక బాలబాలికలు, యువతీ యువకులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా రాజమండ్రి నుంచి విచ్చేసిన గాయనీగాయకులు నవీన్, భవ్యలతో నిర్వహించిన సినీ గాన విభావరి అందరినీ ఉర్రూతలూగించింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సంబరాలలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు 2020 క్యాలెండెర్ను ఆవిష్కరించారు. అచ్ఛమైన సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలతో కూడిన తెలుగు సాంప్రదాయ భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది.

రెండవరోజు హైదరాబాద్ నుంచి విచ్చేసిన గాన విద్యా ప్రవీణ, ప్రముఖ శాస్త్రీయ లలిత సంగీత గాయకులు, స్వరకర్త గరికపాటి వెంకట ప్రభాకర్‌తో నిర్వహించిన వైవిధ్యభవితమైన రాగావధానం సింగపూర్ వాసులను విశేషంగా ఆకట్టుకొంది. అనేకరాగాలలో పృచ్ఛకులు అడిగిన అంశాలతో ప్రభాకర్ అద్వితీయంగా, అలవోకగా గానంతో సమాధానం ఇచ్చి ప్రేక్షకుల అభినందనలను పొందారు. దీనిలో భాగంగా అవధాని ద్వారా శిక్షణ పొందిన సింగపూర్ బాలబాలికలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అనంతరం తెలుగు సమాజం కార్యవర్గం ప్రభాకర్‌ని ఘనంగా సన్మానించారు. ఈ అవధాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతిఒక్కరికీ నిర్వాహకులు నరాల సిద్దారెడ్డి, మల్లిక్ పాలెపు కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వహణ కార్యదర్శి ప్రదీప్ సుంకర, శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి భోగి పండుగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగుపండ్ల ప్యాకె‍ట్లని ఉచితంగా పంపిణీ చేశారు. ఆహ్లాదభరితంగా జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న  వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు, కార్యవర్గానికి, కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement