జ్ఞానసంపద | Sakshi
Sakshi News home page

జ్ఞానసంపద

Published Wed, May 21 2014 1:30 AM

జ్ఞానసంపద

మానవులు వికాసవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి, తమ జన్మను చరితా ర్ధం చేసుకోవడానికి అవసరమైన ప్రధాన సంపద జ్ఞాన సంపదే. ఈ జ్ఞానసంపద గలవారు ధన, ధాన్య, గృహ, ధైర్య, వస్తు, వస్త్ర, వాహనాది సంపదల్లో కొన్నిటిని లేదా అన్నిటినీ ప్రయత్నంతో సమకూర్చుకొనగలుగుతా రు. కానీ, ధనధాన్యాది ఇతర సంపదలు గలవారు సులభంగా జ్ఞానసంపదను చేజిక్కించుకోలేరు. ఇ తర సంపదలెన్ని ఉన్నా శ్రద్ధాసక్తులు, పట్టుదల, తగిన ప్రయత్నం లేకుండా జ్ఞానసంపద దరిచేరదు. లోకంలో ఎన్ని సంపదలున్నా అవేవీ జ్ఞానధనంతో సమానం కాలేవు. జ్ఞానధనమే ధనాలన్నిటిలోనూ ప్రధానమైనది.
 
చాలా గొప్ప నైపుణ్యం కలిగిన దొంగలు కూడా దొంగిలించలేనిది, రక్తం పంచుకుని పుట్టిన ఒకే తల్లీ పిల్లలు కూడా స్థిర చరాస్తులను భాగాలను చేసుకున్నట్టు పంచుకోవడానికి వీల్లేనిది, ఎంత విస్తృతస్థాయిలో జ్ఞానధనాన్ని సంపాదించుకున్ననూ ఎన్నటికీ భారంగా మారదు ఈ జ్ఞానసంపద. పైగా ఇతర వస్తువులను, ఇతర సంపదలను ఉపయోగిస్తున్నకొద్దీ అవి అరిగిపోతుంటాయి. జ్ఞానధనాన్ని తన కోసం లేదా ఇతరుల కోసం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తుంటే అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా, ప్రతినిత్యం వృద్ధి పొందుతుంది. అలాంటి అపూర్వ జ్ఞానసంపదయే సర్వసంపదలలోకెల్లా ప్రధానమైనదని  ‘న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ బారకారి వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానమ్’ అనే శ్లోకం తెలుపుతున్నది.
 
 ఈ జ్ఞానసంపద తల్లిలాగా రక్షించేది, తండ్రిలాగ హితాన్ని కలిగించేది. కాంతవలె దుఃఖాన్ని దూరం చేస్తూ, ప్రియాన్ని సమకూర్చేది. సకల సంపదలను పొందింపజేసేది, అలాగే దశదిశలా కీర్తిప్రతిష్టలను వ్యాపింపజేసేది, కల్పలత వంటి జ్ఞానసంపద మాత్రమే. అలాంటి జ్ఞానసంపదను కలిగివున్న వ్యక్తి సాధించలేనిది ఏదీ ఉండదని ‘మాతేవ రక్షతి పితేవ నియుంక్తే కాంతేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా’అనే సూక్తి వెల్లడిస్తున్నది.
 
  జ్ఞానులకు జ్ఞానసంపద రహస్యంగా దాచివుం చిన ధనంలా ఉపకరిస్తుంది. సమస్త భోగాలను సాధించి పెడుతుంది. గొప్ప యశస్సును, సుఖపరంపరను కలిగిస్తుంది. విదేశాలకు వెళ్లినప్పుడు దగ్గరి బంధువులా ఉపకరిస్తుంది. ఒక పరదేవతలాగ సమస్త కామనలను నెరవేరుస్తుంది. సమాజంలో గొప్ప కీర్తిప్రతిష్టలను సాధించి పెడుతుంది. ఈ జ్ఞానసంపద లేకపోతే మానవుడుని  వింత జంతువుగా చూస్తారు. ఈ జ్ఞానసంపదను చేజిక్కించుకోవడం అంత సులభం కాదని, శ్రద్ధగలవారికే జ్ఞానం అబ్బుతుందని ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అనే గీతావాక్యం బోధిస్తుంది. జ్ఞానంతో సమానమైన, పవిత్రమైన మరొక సంపద ఏదీ లేదని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’ అనే వాక్యంతో ఉపదేశించాడు. జ్ఞానం లేకపోతే ముక్తి కూడా లభించదని ‘రుతే జ్ఞానాన్న ముక్తిః’ అనే వాక్యం ఉద్బోధిస్తుంది. జ్ఞానసంపద భౌతిక సుఖాలను, వివిధ సంపదలను సాధించిపెట్టడమే కాక ఆధ్యాత్మిక ప్రగతికి కూడా కారణమవుతుంది. ఐహిక ఆముష్మిక శ్రేయస్సును సాధించిపెట్టే జ్ఞానసంపదను పొందుదాం. ఈ మానవజన్మను చరితార్ధం చేసుకుందాం.
 - సముద్రాల శఠగోపాచార్యులు

Advertisement
Advertisement