నేత హితవు సరే.. మరి అనుచరుల వైఖరి...! | Sakshi
Sakshi News home page

నేత హితవు సరే.. మరి అనుచరుల వైఖరి...!

Published Sun, Feb 22 2015 12:13 AM

నేత హితవు సరే.. మరి అనుచరుల వైఖరి...! - Sakshi

క్షేత్రస్థాయిలో అనుచరులు యథావిధిగా వ్యవహరిస్తుంటే, నేతలు మాత్రం బుజ్జగింపు మాటలు వల్లించడం వృథాప్రయాస అని చాలాకాలం క్రితం మాజీ ప్రధాని వీపీ సింగ్ స్పష్టంచేశారు. మత సహనంపై మోదీ తాజా ప్రకటన బీజేపీ, సంఘ్‌పరివార్‌లపై ప్రభావం చూపగలదా?
 
 దివంగత ప్రధాని విశ్వ నాథ్ ప్రతాప్‌సింగ్ గతంలో భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం చెప్పారు. ఆ విషయం ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాదు నేటికీ అంతే నిర్దిష్టంగా, అంతే సుస్పష్టంగా ఉండటం ఆశ్చర్యం గొలిపిస్తుంది. విషయానికి వస్తే 1980ల చివర్లో బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, అటల్ బిహారీ వాజపేయిలు రాజీవ్ గాంధీని ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాలంలో వీపీ సింగ్ కూడా వారితో చేయి కలిపారు. ఆ సమయంలోనే అయోధ్య ఉద్యమం ఊపందు కుంది. ఈ ఉద్యమం భారత్‌ను దెబ్బతీస్తుందని తర్వాత గ్రహించిన వీపీ సింగ్ ఆ ఇద్దరు నేతల భాగస్వామ్యంతో తెగదెంపులు చేసుకున్నారు.
 
 అయితే ఈ పరిణామం వీపీ సింగ్ ప్రభు త్వాన్ని కూడా కూల్చేసింది. లౌకికత్వాన్ని కాపాడ టం కోసం తన్ను తాను బలిపెట్టుకున్నట్లుగా ఆయన తర్వాత ఘనంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత తన జీవితం చివరి సంవత్సరాల్లో ఆయన.. బీజేపీని ఓడించడమే ప్రధాన రాజకీయ లక్ష్యంగా కలిగిన వివిధ బృందాలను ఏకం చేయడానికి ప్రయ త్నిస్తూ గడిపారు. ఆ సమయంలో ఒక పత్రికా రచ యిత వీపీసింగ్‌కు ఒక విషయం చెప్పారు. వాజ పేయి నిగ్రహం ప్రదర్శిస్తారనీ, ఐక్యతను, సహనభావాన్ని ఆయన బోధిస్తారు కాబట్టి బీజేపీ మొత్తం గా మతతత్వపార్టీ కాదనీ ఆ మాటల సారాంశం.
 
 అయితే వీపీ సింగ్ ఆ విలేకరికి సమాధాన మిస్తూ బీజేపీ ఎల్లవేళలా దూకుడుగా మాట్లాడా ల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఈ విషయాన్ని నిజంగా వినవలసిందీ, ఆలోచించవలసిందీ బీజేపీ మద్దతుదారులే అన్నారాయన. క్షేత్రస్థాయిలో వాళ్లు ఎలాంటి భాష వాడుతున్నారు? మీడియా ముందు సీనియర్ పార్టీ నాయకులు వల్లించే ధర్మోపదేశాల కంటే ఇదే ముఖ్యం. క్షేత్రస్థాయిలో వారు విషం కక్కుతున్నారని వీపీ సింగ్ ముక్తాయించారు.
 
 మన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం సామరస్యం, సహనభావం గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. అది విన్నాక నాకు సరిగ్గా నాటి వీపీ సింగ్ అభిప్రాయం మరోసారి గుర్తు కొచ్చింది. ఢిల్లీలో చర్చిలకు వ్యతిరేకంగా హింసా త్మక చర్యలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల మధ్యే మోదీ తన పద్ధతికి భిన్నంగా ఒక చర్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
 
 ఇటీవల ఇద్దరు భారతీయులను కేరళలో కేథలిక్ మత సంప్రదాయానుసారం మహనీయు లుగా ప్రకటించారు. వారు కురియకోస్ అలియాస్ చవర, యుప్రేసియా. వీరిలో చవర గురించి మోదీ ఇలా ప్రస్తావించారు. ‘‘విద్య చాలా తక్కువమందికే అందుబాటులో ఉన్న కాలంలో ప్రతి చర్చి కూడా ఒక పాఠశాలలా కావాలని చవర ఆనాడే నొక్కి చెప్పారు. ఆ విధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యా ద్వారాలను ఆయన తెరిచారు’’
 
 సంస్కృత భాషకు సంబంధించి తనకున్న పరిజ్ఞానం ప్రదర్శిస్తూ మోదీ ఈ సందర్భంగా సహనభావం, బాహాటత్వం గురించి బోధించారు. హిందువులు విశ్వ సామరస్యతను విశ్వసించడమే కాకుండా, అన్ని మతాలూ సత్యమేనని ఆమోదిస్తా రంటూ స్వామి వివేకానంద చేసిన ప్రవచనాన్ని కూడా ఆయన ఉటంకించారు.
 
 చాలాకాలం క్రితం నేను మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి  తీసు కెళ్లాను. సహన భావం గురించి తాను మాట్లాడద లచుకోలేదనీ, హిందూ సమ్మతి, సానుకూలత పట్లే మనం దృష్టి పెట్టాలని మోదీ స్పష్టంగా చెప్పారు. దాంతో పోలిస్తే సహనభావం అనేది ఒక మెట్టు కింద ఉంటుందన్నారు.  అయితే  ఈ వారం క్రిస్టియన్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ఆనాటి తన సూత్రీకరణ నుంచి వైదొలిగి కొన్ని అంశాలను చాలా స్పష్టంగా చెప్పారు. ఏ రకంగా చూసినా ఇవి చాలా ముఖ్య మైనవి.  
 
 ఆయనేమన్నారంటే...
 ‘‘ఒక మతాన్ని లేదా విశ్వాసాన్ని కలిగి ఉండే, కొనసాగించే, స్వీకరించే స్వేచ్ఛ పౌరుల వ్యక్తిగత అభీష్టమని మనం గుర్తిస్తాం. నా ప్రభుత్వం సంపూర్ణ మత స్వాతంత్య్రానికి కట్టుబడి ఉంటుంది. ఎలాంటి నిర్బంధం, లేదా అనుచిత ప్రభావాలకు గురి కాకుండా అతడు లేదా ఆమె తన మతాన్ని కొనసాగించడంలో, పర మతాన్ని అవలంబించే విషయంలో పరిపూర్ణ హక్కు కలిగి ఉంటారన్నదే నా భావన. మెజారిటీ కావచ్చు లేదా మైనారిటీ కావచ్చు ఏ మత బృందమైనా సరే.. ప్రచ్ఛన్నంగా లేదా బహిరంగంగా ఇతరుల పట్ల విద్వేషాన్ని ప్రేరేపించడాన్ని నా ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించదు. నాది అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే ప్రభుత్వం.’’
 
 ప్రధాని మోదీ ఎంత స్పష్టంగా ఈ విషయా లను ప్రస్తావించారన్నది ఇక్కడ కీలకం. తన పార్టీ లోని మంత్రివర్గంలోని కొందరు సభ్యులు, పార్టీలో, సంఘ్ పరివార్‌లోని మిత్రులు కొందరు మతప రంగా చేసిన వ్యాఖ్యలు తనను గాయపర్చాయని ప్రధాని తేల్చి చెప్పారు. ఇలాంటి భాషను మళ్లీ ఎవరైనా ఉపయోగిస్తే అప్పుడు మోదీ చేసిన ఉపన్యాసం ఆధారంగా మీడియా ఆయననే బాధ్యు డిని చేయవచ్చు.


చర్చి కార్యక్రమంలో చేసిన ఆ ప్రసంగం మోదీ వ్యక్తిత్వంలోని ఒక అంశాన్ని వెలికి తెచ్చింది. ఇది తరచుగా తన్ను తాను ప్రదర్శించుకోదు. ఇది ఆయన గుజరాతీ స్ఫూర్తిలో భాగం. సిద్ధాంతానికి మొండిగా కట్టుబడటం కంటే ప్రయోజనాలను సిద్ధించుకోవడం కోసం రాజీధోరణి ప్రదర్శించే స్ఫూర్తి అది. అభివృద్ధికి సంబంధించిన సమస్య లతో వ్యవహరించేటప్పుడు తనలోని ఈ పార్శ్వా న్ని మోదీ క్రమం తప్పకుండా ప్రదర్శిస్తారు. సంఘ్ పరివార్ సిద్ధాంతవేత్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రూపొందించిన ఆరెస్సెస్ ఆర్థిక సిద్ధాంతాన్ని ఆయన ఇలాంటి సందర్భాల్లో తక్కువ చేసి, పక్కనపెట్టేస్తారు కూడా. అయితే మత విశ్వాసానికి సంబంధించిన అంశాలపై మోదీ నిజంగానే చాలా తక్కువగా బయటపడతారు. అందుకే ఆయన చర్చిలో చేసిన ఈ ప్రసంగం చాలా ముఖ్యమైంది.
 
మనం చివరకు నాయకుడి అసలైన మాటలు విన్నాం. ఆయన ఎటు నిలబడుతున్నారో తెలుసు కున్నాం. తన మంత్రివర్గ సహచరుల నుంచి, సంఘ్ పరివార్‌లోని ఇతరుల నుంచి కూడా ఇదే విధమైన భాష వస్తుందని, ఇలాంటి ప్రకటనే వారి నుంచి కూడా రావాలని మనం ఎదురుచూస్తున్నాం. క్షేత్ర స్థాయిలో అనుచరులు యథావిధిగా వ్యవహరి స్తుంటే, నేతలు మాత్రం బుజ్జగింపు మాటలు వల్లిం చడం వ్యర్థప్రయాస అని చాలా సంవత్సరాల క్రితం వీపీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు మరి.
 (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)

aakar.patel@icloud.com

Advertisement
Advertisement