దుఃఖ సముద్ర సందిగ్ధతలో న్యాయం | Sakshi
Sakshi News home page

దుఃఖ సముద్ర సందిగ్ధతలో న్యాయం

Published Wed, May 18 2016 12:39 AM

దుఃఖ సముద్ర సందిగ్ధతలో న్యాయం

అభిప్రాయం
 
దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్‌లు కొలువై ఉన్న సమావేశంలో, దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతి కంట కన్నీరొలకటం - న్యాయం కోసం ఈ దేశం ఎంతటి సంది గ్ధతలో, దుఃఖ సముద్రంలో విలవిల్లాడుతోం దనడానికి నిదర్శనం. ఆయన కన్నీళ్ళలో కోట్లాదిమంది న్యాయం అందని వాళ్ళ కన్నీళ్ళు దాగున్నాయి. చట్టంలో అన్నీ ఉన్నా న్యాయం అందించడంలో  ఉన్నవన్నీ అడ్డంకులే అని అర్థం చేయిస్తు న్నాయి. మాల్యాలకు, మనీ ల్యాండరర్స్‌కు, మల్టీ నేషనల్ కంపెనీలకు, మైనింగ్ మాఫియాలకు అందుతున్న న్యాయం పేదవారికి, బాధిత స్త్రీలకి, పిల్లలకి, బలహీనులకి అందకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఈ అన్నింటి వెనక సమర్థవంతంగా నడిచే స్వార్థ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ నిర్భీతితో చేస్తున్న నీతి బాహ్యమైన పనులు న్యాయ వ్యవస్థని ఎంతగా నిర్వీర్యం చేస్తున్నాయనే నగ్నసత్యాన్ని మాటల్లో చెప్పలేని దుర్భర పరిస్థితికి కూడా ఈ కన్నీళ్ళు అద్దంపడుతున్నాయి.
 

న్యాయవ్యవస్థ సమస్యలపై రూపొందిన అన్ని రిపోర్ట్‌లు చూసి,  చర్చల మీద చర్చలు చేసి మళ్ళీ కొత్తగా ఈ సమస్యని అర్థం చేసుకుం టున్నట్లు నటిస్తున్న ఏలినవారి పోకడలకి దుఖం పొంగిపొర్లక ఎట్లా తడారిపోతుంది? పాలనా వ్యవస్థలో ఎన్నికైన రాజకీయ నాయకుడు/ నాయకురాలు మరణిస్తే ఏర్పడే ఖాళీ సీటును భర్తీ చేయడానికి ఆగ మేఘాల మీద రూల్స్ వర్తింప చేసి మళ్ళీ కొత్త మెంబర్‌తో నింపుతారు సీటుని. మరి కోర్టుల్లో ఇన్ని వందల సంఖ్యలో జడ్జీల సీట్లు ఖాళీగా పడి ఉంటే వాటిని నింపటానికి ఇన్నేళ్ల కాలం ఎందుకు పడుతోంది?

న్యాయ వ్యవస్థని అత్యంత ఉన్నతంగా, స్వతంత్రంగా ఉంచితే కదా ఈ దేశంలో న్యాయం నాలుగు పాదాల నడిచేది! దానికి ఒక్కొక్క వేలుకి వేలు, కాలుకి కాలు విరగొట్టి పెడుతుంటే కేసులు కోట్లల్లో పెండింగులు కాక మరేం అవుతాయి? కనిపించని అసలు శత్రువు స్వార్ధ రాజకీయ వ్యవస్థ. నేర చరిత్ర గల తమ తమ రాజకీయ నాయకులని న్యాయపరమైన చిక్కుల నుండి తేలిగ్గా బయటికి తెచ్చుకోడానికి కొత్త ప్రభుత్వాలు రాగానే మార్పులు చేర్పులు చేస్తూ వారికి అనుకూలమైన వారిని న్యాయ వ్యవస్థలో చొప్పించి, ప్రయోజనం పొందుతున్నాయి.
 పైగా అనేక విషయాల్లో పాలనా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ.. న్యాయ వ్యవస్థని ఎప్పుడూ ఒక ‘ప్రతిపక్షంగానే చూస్తున్నాయి.పైగా కోర్టులో బార్ అసోసియేషన్‌ల దగ్గర నుంచి, న్యాయవాదుల వరకు నిబంధ నలు తోసిపుచ్చి అవినీతికి దాసోహం అవటం న్యాయవ్యవస్థకి మరో పెద్ద సవాలుగా పరిణమించింది. న్యాయం పక్షాన నిలవాలంటే కన్నీరు ఉబికి వస్తుంది. ఇంతటి దుఃఖం అత్యున్నత న్యాయాధిపతి కంట కన్నీ రొలికించినది అనటంలో అతిశయోక్తి లేదు కానీ...

స్త్రీలు, పిల్లలకి సంబంధించిన కేసులు, హత్యలు, అత్యాచారాల కేసులు, స్త్రీల ఆస్తి హక్కు, పిల్లల కస్టడీ మొదలైన సత్వరం పరిష్క రించాల్సిన కేసులు కూడా కొన్నేళ్లపాటు మగ్గుతున్నాయంటే కారణం ఎవ్వరని ప్రశ్నించాలి? ‘జడ్జిమెంట్ ఇంకా రాలేదని’ చెప్పులరిగేలా కోర్టుల చుట్టూ తిరిగే పేదలకి, మహిళలకి మొదటిగా కోపం వచ్చేది జడ్జి మీదనేగా. ఈ మధ్యలో మోసం చేస్తున్న రాజకీయ పరిస్థితుల మీద ధ్యాస మళ్ళదు.రోజు రోజుకి నేరాలు పెరుగుతుండగా ప్రపంచంలోనే 2వ అతి పెద్ద జనాభాగల మన దేశంలో 50 వేల మంది జడ్జీలు అవసరం ఉండగా, 18,000 మంది జడ్జీలతో మమ అనిపిస్తున్నారు. కోర్టులో 3 కోట్ల కేసులు పెండింగులు ఉండక, మరి మూడు కేసులు మాత్రమే పెండింగులో వుంటాయా? చట్టాలు సవరించడం కొత్తవి రూపకల్పన చేయడం మినహా ప్రభుత్వాలు ఉన్న చట్టాలని పకడ్బం దీగా పని చేయించలేకపోవడాన్ని ప్రశ్నించే ప్రజా చైతన్యం, సంఘటి తంగా గొంతెత్తడం కూడా కరువయింది.

ఏపీఎస్‌సీపీసీఆర్ అనే పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థను సీపీసీ ఆర్ అనే చట్ట పరిధిలో ఏర్పాటు చేసి, దానికి అతీగతీ రాకుండా చేసిన పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పోకడలను దగ్గరగా చూసిన సభ్యురాలిగా,  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గారి కంట వొలికిన కన్నీళ్ళతో నా కన్నీళ్ళు కలుపుతున్నా.

- ఎం. సుమిత్ర
 వ్యాసకర్త పిల్లల హక్కుల పరిరక్షణ కార్యకర్త  9396883703

Advertisement
Advertisement