నాడు ఎమర్జెన్సీ.. నేడు గ్రీన్‌హంట్! | Sakshi
Sakshi News home page

నాడు ఎమర్జెన్సీ.. నేడు గ్రీన్‌హంట్!

Published Sat, Jun 25 2016 1:58 AM

నాడు ఎమర్జెన్సీ.. నేడు గ్రీన్‌హంట్!

ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ని వ్యతిరేకించడం లేదని రెండు వాక్యాలు రాసివ్వనందుకే రెండేళ్లు నన్ను జైల్లో పెట్టారు. వీల్ చైర్లో నుంచి కదలలేని నాకు ఏడుసార్లు బెయిల్ నిరాకరించారు. ఆదివాసీల తరఫున మాట్లాడ్డం ఈ దేశంలో ఇంత పెద్ద నేరమని అంతకు ముందెన్నడూ నేనెరగను.
 
అసమానతలు, ప్రజాస్వామ్యం ఒకే ఒరలో ఒదగవు. కానీ మన దేశంలో అసమానతలు రాజ్యమేలుతుంటాయి. అణచివేత అడుగడుగునా తాండ విస్తుంటుంది. వివక్ష విధ్వంసాలను సృష్టిస్తుంటుంది. అయినా మనం దేశంలో ప్రజాస్వామ్యం ఉందనే భావిస్తాం. ప్రజాస్వామ్యం లేదని ‘నమ్మడం’ ఇక్కడ నేరం. విశ్వాసాలు మూఢంగా ఉన్నా ఫరవాలేదు. కానీ అవి బలమైన భావజాలాలు కాకూడదు. పాలకులను ప్రశ్నించే ఆయు ధాలు కాకూడదు. అలా ఒక భావజాలాన్ని నమ్మినందుకే నాపైనా, నాలాంటి లక్షలాదిమందిపైనా అప్రకటిత అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తున్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సాక్షి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అత్తలూరి అరుణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అభిప్రాయాలు

ఆయన మాటల్లోనే...
ఒక్క పెన్నుపోటుతో రాజ్యాంగం ఇచ్చే అన్ని హక్కులను హరించివేసే అవకాశం ఉన్నదంటే అది ఎటువంటి ప్రజాస్వామ్యం అను కోవాలి? కచ్చితంగా ఎమర్జెన్సీ ప్రకటనని ఇలానే అర్థం చేసుకోవాలి. 1975 జూన్ 25 అర్ధరాత్రి మన దేశంలో ఎంతోమందికి ప్రజా స్వామ్యం మీదున్న భ్రమలు పటా పంచలయ్యాయి. ‘అత్యవసర పరి స్థితి’ అని ప్రకటిస్తూ ఇందిరమ్మ చేసిన ఒకే ఒక్క సంతకంతో రాజ్యాంగం కల్పించిన సర్వ పౌర హక్కులూ హరించింది రాజ్యం. అప్పటివరకు ప్రజాస్వామ్యం మీదున్న ప్రజల విశ్వాసం ఒక్కసారిగా సన్నగిల్లింది. నిజం చెప్పాలంటే ఎమర్జెన్సీ వెనుకా... ముందూ కూడా ఎమర్జెన్సీనే.

ఎందుకంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే నేడూ కొనసాగుతున్నాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి అని ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించ కుండానే దానిని అమలు చేస్తున్నారు. 1975కి ముందు కూడా అదే నిర్బంధం అమలులో ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీలో లక్షమంది రాజకీయ ఖైదీలుండగా, ఈ రోజుకీ లక్షలాది మంది రాజకీయ ఖైదీలుగా గుర్తింపు పొందకున్నప్పటికీ, చిన్నా చితకా నేరాలకి కూడా నిర్బంధాన్ని అనుభవి స్తున్నారు. జైలు జీవితం అనుభవిస్తున్న, అప్రకటిత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, ఓబీసీలు అంతా నా దృష్టిలో రాజకీయ ఖైదీలే. ఎందుకంటే వారు రాజకీయ కారణా లతోనే నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. అందుకే ఈ దేశంలో ప్రజా స్వామ్యం ఒట్టిమాట. నియంతృత్వమే అసలు మాట.

అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జాతుల ఉద్యమాలను కూడా రాజకీయ కారణాలతోనే అణచివేస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాగే జరుగుతోంది. కశ్మీర్‌లో, పంజాబ్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో, మనపక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో, జార్ఖండ్‌లో అమలు చేస్తున్న నిర్బంధం ఎవరి ప్రయోజనం కోసం? అడవిలో పుల్లలేరుకున్నందుకు, వాళ్ళ ప్రపం చంలో వాళ్ళు బతుకుతున్నందుకు ఆదివాసీలను, దళితులను, ముస్లిం లను జైళ్లలో పెట్టారు. ఇలా నిర్బంధాన్ని అనుభవిస్తున్న ఆదివాసీలు దేశవ్యాప్తంగా 10 లక్షలమంది ఉంటారని ఒక అంచనా.

ఈ దేశంలో రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజునే ఆదివాసీల హక్కులను సంపూర్ణంగా హరించివేశారని బి.డి. శర్మ అంటారు. ఆ రోజే చీకటిరోజన్న ఆయన అభిప్రాయం వాస్తవమని నా భావం. నిజానికి మనకన్నా ప్రజాస్వామ్యయుతమైన, చైతన్యమైన ప్రపంచం ఆదివాసీ లది. ప్రేమించే హక్కు, సహజీవనం చేసే హక్కు మన సమాజంలో లేదు. కానీ ఆదివాసీ సమాజంలో ఉంది. ఇద్దరూ విడిపోవాలనుకుంటే వారి ద్దరికీ శిక్ష ఉండదు. పెళ్ళికి ముందు పిల్లలు పుడితే వారి బాధ్యత సమాజం తీసుకుంటుంది. హిందూ, ముస్లింల మతపరమైన చట్టాల్ని మన లౌకిక రాజ్యాంగం ఆమోదిస్తున్నది. కానీ వారిదైన ఒక ప్రత్యేక సంస్కృతి, భూభాగం, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదివాసీలకు తమ దైన రాజ్యాంగం, చట్టం ఉన్నాయన్నది అంగీకరించదు.

భీల్ ఆదివాసీలు నివసించే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని ఆదివాసీల ప్రాంతం భీల్ కండ్. దాన్నంతా కలి పితే అది ఒక రాష్ట్రం అవుతుంది. జార్ఖండ్ జాతులకు సంబంధించిన ఆదివాసీలు నివసిస్తున్న భూభాగాన్ని కలిపితే అదీ ఒక రాష్ట్రం అవు తుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాల్లో నివసించే గోండు జాతి ఆదివాసీలు నివసించే ప్రాంతాన్ని గోండ్వానా అంటారు. వాళ్లందరినీ వారి వారి ప్రాంతాలనుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఏ పేరు పెట్టుకున్నా జరుగుతున్నది మాత్రం వారిని వారి ప్రాంతాలనుంచి తరిమి వేయడమే.

ప్రైవేటు సైన్యం అరాచకాలను ఆదివాసీలు తిప్పికొట్టడంతో గ్రీన్ హంట్‌ని ప్రయోగించారు. దీంతో పారామిలిటరీ దళాలే ఆదివాసీ ప్రాంతాలకు వచ్చాయనుకున్నారు. కానీ నిజానికి అక్కడ మిలిటరీని దింపారు. గ్రీన్‌హంట్ పేరుతో జరు గుతున్నది మావోయిస్టులను తరిమి వేసేందుకు కాదు. మావోయిస్టులను తరిమి వేసినా మైనింగ్ సాధ్యం కాదని వారికి తెలుసు. ఆదివాసీలే వారి అసలు టార్గెట్. ఆస్ట్రేలియాలో ఆదివాసీలను, అమెరికాలో రెడ్ ఇండియన్స్‌ని తుడిచిపెట్టినట్టుగానే ఇక్కడా ప్రయత్నం జరుగుతోంది.

ఆదివాసీలను తుడిచిపెట్టే మానవ హననంగా మేం ఆపరేషన్ గ్రీన్ హంట్‌ని భావించి, దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే, దానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆ ఉద్యమానికి నేను నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాను. ఢిల్లీలో నన్ను అరెస్టు చేసినప్పటి నుంచి మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే వరకు ఒకే ప్రశ్న నన్ను వెంటా డింది. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ని వ్యతిరేకించడం లేదని రెండే రెండు వాక్యాలు రాసివ్వమన్నారు. పోలీస్ ఒత్తిడిని నిరాకరించిన ఫలితంగా.. వీల్ చైర్లోనుంచి కదల్లేని నాకు 7 సార్లు బెయిల్ నిరాకరించారు. అలా నేను రాసిస్తే నేనేమంత ప్రమాదకరమైన వ్యక్తిని కాకపోదును. 2 ఏళ్ళ పాటు జైల్లో ఉండి నేనిదే ఆలోచించాను. ఆదివాసీలకోసం మాట్లాడ్డం ఈ దేశంలో ఇంత పెద్ద నేరమని అంతకు ముందు నేనెరగను.

గాంధేయవాదంలాగే మావోయిస్టు భావజాలాన్ని కలిగి ఉండడం తప్పు కాకూడదు. కానీ ఇక్కడ ఒక పౌరుడు ఏ భావజాలాన్ని కలిగి ఉండాలో రాజ్యం నిర్ణయిస్తుంది. పౌరుల ఆలోచనల్ని నియంత్రించే విధానం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. కానీ ఇప్పుడదే జరుగు తోంది. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజసంపదను కొల్లగొట్టేందుకు ఆది వాసీలను తరిమికొట్టడమే ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఏకైక లక్ష్యం. ఆదివాసీలను సమూలంగా నిర్మూలిస్తే దేశంలో మిగిలిన వారి ప్రాణా లకు మాత్రం రక్షణ ఏమిటి? ఎప్పుడో కాదు ఇప్పుడే మన దేశంలో ఫాసిజం అమలులో ఉన్నది. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ దాడులు జరుగుతాయి. ఒక కన్హయ్య, మరో రోహిత్, ఇంకో ఆదివాసీనో, మరెవ్వరో... దీన్నే అత్యవసర పరిస్థితి అంటారు. నిజానికి ఎమర్జెన్సీని మించిన యుద్ధ పరిస్థితి ఇది.
 (జూన్ 25, 1975న ఎమర్జెన్సీ ప్రకటన సందర్భంగా)

Advertisement
Advertisement