కథకుడికి కావలసిన శ్రద్ధ | Sakshi
Sakshi News home page

కథకుడికి కావలసిన శ్రద్ధ

Published Sat, May 30 2015 11:26 PM

కథకుడికి కావలసిన శ్రద్ధ

విమర్శ
 
కథకుడు ఎలా ఉండాలి? కథానికను ఎలా నడిపితే బిగువు సడలకుండా ఉంటుంది? లాంటి అంశాలను తన ‘సాహిత్య శిల్పసమీక్ష’లో వివరించారు పింగళి లక్ష్మీకాంతం (1894-1972). ఆ పుస్తకానికి 1966లో రాసుకున్న పీఠికలో ‘ఇది నేను ముప్పదియేండ్ల క్రితము ప్రచురింపవలసిన గ్రంథము’ అన్నారాయన. ఆ లెక్కన ఈ అభిప్రాయాలు వెల్లడించిన కాలం మీద ఒక అంచనాకు రావచ్చు. విశాలాంధ్ర ప్రచురించిన ఈ పుస్తకంలోని ‘కథానిక’ వ్యాసంలోంచి కొన్ని ముఖ్యాంశాలు:
 
 1. చిత్త విశ్రాంతిలేని ఈ ఆధునిక జీవితములో శ్రమాపనోదనార్థము1,2, సాహిత్య జన్యమైన మానసిక సుఖమును అనుభవించుటకు కొంచెంపాటి విరామము కలిగించుకొని, ఆ కొంచెము సేపులో ఎక్కువ శ్రమకు లోనుకాకుండ తేలికగా చదువుకొనదగిన కావ్యవిశేషముగా ఒక్క కథానికయే లభించుచున్నది.

 2. నవలలో కథా వైపుల్యము3ను బట్టి పాత్ర స్వభావమును సంపూర్ణముగా సమున్మీలితము4 చేయవచ్చును. కథానికా సంక్షిప్తతనుబట్టి ఇయ్యెడ చిత్రలేఖనమును ఏకభంగిమ చిత్రణమువలె ఏదో ఒక సంఘటనను మాత్రమే చూపబడునుగాన దానికి సంబంధించిన స్వభావలేశము మాత్రమే ఆపేక్షితమగును. అదియుగాక, కొన్ని కథానికలలో పాత్రలు నిమిత్తమాత్రములును, సంఘటనలు ప్రధానములును అయియుండును. కావున అన్నింటను పాత్ర చిత్రణమును ఆశింపరాదు. మరికొన్నింట పాత్రలకును, సంఘటనలకును లేని ప్రాధాన్యము, ఒక జీవితధర్మ నిరూపణమున కుండును. అట్టియెడ ఆ రెండును నిమిత్తమాత్రములే.

 3. కథానిక స్వల్పకాల పఠనయోగ్యము గనుక అందలి పాత్రలు మనము లోకములో యాదృచ్ఛికముగా కలిసి విడిపోయెడి వ్యక్తుల వంటివి. వీటితో మనకు చిరపరిచయము కుదరదు. ఎంత ఉత్తమ కథానికయైనను, రెండవసారి చదువబడుట చాల అరుదు. నవలను కావ్యనాటకములవలె బహుపర్యాయములు గాకున్నను రచనా సౌందర్యమునుబట్టి రెండవసారియైనను చదువుటకు బుద్ధిపుట్టును. అయినను కథానికా రచయితకు ఉండదగిన ఏకాగ్రత నవలాకారునకు ఆవశ్యకము కాదు. కథా సంక్షిప్తతను బట్టి ఎయ్యెడను నీరసత్వముగాని, పలుచదనముగాని, కుంటినడకగాని లేకుండ మనస్సును ఆకట్టెడి రక్తితో కథ నడపవలెనన్నచో కథకుడు ఏకాగ్రచిత్తుడై రచించిననే తప్ప కృతార్థుడు కాడు. అనవసరమైన వాగ్వ్యయము ఎందుకూ పనికిరాదు. కథారంగమును అలంకరించు నెపమున దీర్ఘ వర్ణనలు చేయుటయు కూడదు. ఈ నియమములు ఇంచుమించు నాటక రచనా నియమములకంటెను కఠినములైనవి. ఇట్టి నియమములకు విధేయుడై కథను స్వయం సంపూర్ణమగునట్లు చేయుటలో అతనికిగల క్లేశము నవలాకారునకు లేదు. నవలయందు ఒకప్పుడు కథలో బిగువు సడలినను, అప్రస్తుత ప్రసంగములు దొరలినను, కథావిస్తృతిలో అవి మరుగున పడిపోవును. కథానికలో అట్టి లోపములు రచనను వికృతమొనర్చును.

 1. అపనోదనము=తొలగించుట, దూరంచేయుట;
 2. శ్రమాపనోదనార్థము=శ్రమను దూరం చేసుకోవడానికి;
 3. వైపుల్యము=విపులత్వము; 4. ఉన్మీలితము = వికసించుట.
 
 పింగళి లక్ష్మీకాంతం
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement