ఎక్కడ బాపూ నీ బొమ్మ? | Sakshi
Sakshi News home page

ఎక్కడ బాపూ నీ బొమ్మ?

Published Sat, Jul 4 2015 12:34 AM

bapu where is your image

హారతి గోదావరికి ఇవ్వాల్సిందే, దానితో పాటు ఆర్థర్ కాటన్‌కి కూడా ఇచ్చుకోవడం కనీస ధర్మం అన్నారు అక్కడి పురజనులు. ప్రసిద్ధ చిత్రకారుడు బాపు పోయినప్పుడు నివాళులర్పిస్తూ, నిండుసభలో మాట ఇచ్చారు. బాపు విగ్రహం ప్రతిష్టిస్తామని చెబితే పిచ్చి తెలుగువాళ్లు కాబోలని తెగ మురిసిపోయారు.

 ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు! అవి ఎట్లాగో ఏమిటో అర్థం కాలేదు. పోల వరం ప్రాజెక్టు మీద పాట! దానికీ, దీనికీ పొంతనేమిటో తెలియరాలేదు. పట్టిసీమ పథ కంపై పల్లవి! అదిప్పుడు అవ సరమా? భక్తి, ముక్తిలకు సం బంధించిన ఈ పుష్కరవేళ ఈ సుత్తి ఎందుకని కొందరు బాహాటంగానే గుసగుసలాడుకున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గోదావరి హారతిని ప్రారంభిస్తూ శంఖా న్ని విజయ సంకేతంగా పూరించారు. అదిరిందన్నాయి పార్టీ శ్రేణులు. అది డబ్బింగు, వెనకాల ఎవరో ఊదార న్నారు గిట్టని శ్రేణులు. హారతి గోదావరికి ఇవ్వాల్సిందే, దానితో పాటు ఆర్థర్ కాటన్‌కి కూడా ఇచ్చుకోవడం కనీస ధర్మం అన్నారు అక్కడి పురజనులు. మూడు యాభైలకు మునుపే కోనసీమ పండితులు ఒక శ్లోకంలో కాటన్ దొరను స్తుతిస్తూ అర్ఘ్యం వదిలేవారట.

ఇప్పటికీ కొందరు గోదావరి తీరవాసులు పుష్కరవేళ ఆర్థర్ కాట న్‌కి కూడా తమ పెద్దలతో బాటు పిండప్రదానం చేస్తా రట. గోదావరిని ప్రసన్నం చేసుకుని ప్రజకు వరప్రదా యినిగా మలచిన మహనీయుడాయన. ఆయనకో పూదండ వేసి, హారతి ఇస్తే పుణ్యం పురుషార్థం. ఆర్థర్ కాటన్ పేరు మీద ‘గోదావరి వాటర్ యూనివర్సిటీ’ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారని కొందరు తలపోశారు. ఎం దుకో తలపుయ్యలేదు. నీటి నిర్వహణ, నీటి కాలుష్య నివారణ, జల రవాణా సదుపాయం లాంటి అంశాలపై ఆ విశ్వవిద్యాలయంలో కోర్సులుంటాయి. కావాలంటే జల విద్యుత్తు కూడా కలుపుకుందాం. ఆయన మ్యాన్ ఆఫ్ ఐడియాస్!

 వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే అదంతా తమ చల వేనని చెప్పుకునే స్థాయికి వెళ్లాయి రాజకీయ పార్టీలు. ఆ మధ్య ఒక అరబ్ షేక్ ఏడు నక్షత్రాల హోటల్‌లో బస చేశాడు. హోటల్ మేనేజర్ వచ్చి, ‘షేక్‌సాబ్! వర్షం చూస్తారా?! వర్షంలో తడుస్తారా?!’ అన్నాడు, సవిన యంగా. షేక్ గారికి వాన అపురూపం కదా! ఆయన ఎగిరి గంతేశాడు. వానలో గెంతులేశాడు. అందుకు హోటల్ వారు భారీగా బిల్లు వేశారు. వాన వెలిసింది. మళ్లీ వెళ్లి, ‘సాబ్! హరివిల్లు చూస్తారా?’ అన్నాడు. చూడ్డానికెంతో చెబితే దాన్ని బట్టి చూస్తానన్నాడు షేక్‌జీ. అలాగే ప్రజకి కూడా అనుభవం వచ్చింది. ఎగిరి గంతు లెయ్యకుండా ఆచితూచి వేస్తున్నారు.

  నాకిప్పుడు ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఇటు వంటి ప్రతిష్టాత్మక శుభవేళ ఖైదీలకు కొన్ని ‘ఇరువులు’ కల్పించాలి. వాళ్లు సంకల్పితం గానో, అసంకల్పితం గానో తప్పు చేసి ఉంటారు. దానికి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అంతమాత్రం చేత వారి పెద్దలు ఆకలి దప్పు లతో అలమటించడం న్యాయమా? వారికి శ్రాద్ధవిధులు నిర్వర్తించడానికి వెసులుబాటు కల్పించాలి. క్రతువుకీ, దానధర్మాలకీ కావాల్సిన నిధులు ప్రభుత్వమే సమ కూర్చి పుణ్యం కట్టుకోవాలి.

చంద్రబాబు ప్రభుత్వం మన సంప్రదాయాన్నీ, శాస్త్రాన్నీ త్రికరణశుద్ధిగా నమ్ము తున్నట్టయితే, ఖైదీలను వదలాలి. అదే గోదావరి మాత కు అసలైన కర్పూర హారతి. రాజమహేంద్రి గోదావరి తీరంలో నందమూరి తారకరాముణ్ణి కృష్ణుడి గెటప్‌లో నిలుపుతున్నారు. శుభప్రదం, శోభస్కరం. ప్రసిద్ధ చిత్ర కారుడు బాపు పోయినప్పుడు నివాళులర్పిస్తూ, నిండు సభలో మాట ఇచ్చారు. బాపు విగ్రహం ప్రతిష్టిస్తామని చెబితే పిచ్చి తెలుగువాళ్లు కాబోలని తెగ మురిసి పోయారు. అంతా హుళక్కే. ఎక్కడ బాపూ నీ బొమ్మ?

 

(వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు)

 
 
 

Advertisement
Advertisement