Sakshi News home page

తెలుసుకోదగ్గ పుస్తకం.. దాస్ కాపిటల్

Published Fri, Aug 8 2014 11:55 PM

తెలుసుకోదగ్గ పుస్తకం.. దాస్ కాపిటల్ - Sakshi

 పేరు సరిగానే ఉంది. దీని టాగ్‌లైన్ ’'The novel of love and money market''. 2007లో అచ్చయింది. రాసింది వీకెన్ బెర్బేరియన్. సమకాలీన పెట్టుబడిదారీ స్టాక్ మార్కెట్ మాయాజాలాన్ని ఇంత నిష్కర్షగా చిత్రించిన నవల మరొకటి లేదన్నారు. ఇందులో కథా నాయకుడు వేన్. ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి ప్రతీక ఇతడు. లాభాలే లక్ష్యంగా వాల్‌స్ట్రీట్‌లో లావాదేవీలు జరిపేది ఇలాంటి వాళ్లే. మార్కెట్లు ఎప్పుడు పతనం అవుతాయో జోస్యం చెప్పగలడు వేన్. చాన్స్ దొరికితే చాలు షార్ట్ సెల్లింగ్‌లో లాభాలు మూటగట్టుకోవాలి. ట్రేడర్లందరికీ వెన్నతో పెట్టిన విద్య ఇది.
 
  పెట్టుబడి, అధికారం, శ్రమ వంటి గంభీరమైన విషయాల గురించి థ్రిల్లర్‌లాగా, సెటైర్ లాగా రచయిత ఈ నవలను నిర్వహిస్తాడు. కార్ల్ మార్క్స్ రచించిన దాస్ కాపిటల్ చదవడం కష్టమనుకుంటే అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ఈ నవలతో ఆ యిబ్బంది లేదు. ఆధునిక మార్కెట్ పరిభాష తెలిసిన వారందరూ హాయిగా చదువుకోవచ్చు. అన్నట్టు ఇందులో ప్రేమ కథ కూడా ఉంది. రచయిత వీకెన్ బెర్బేరియన్ బీరుట్‌లో ఒక ఆర్మీనియన్ కుటుంబంలో పుట్టాడు. లెబనాన్‌లోని అంతర్యుద్ధ కాలంలో లాస్ ఏంజిలిస్‌కు తరలి వచ్చింది కుటుంబం. కార్ల్ మార్క్స్‌కు ఇరవై ఒకటో శతాబ్ది రచయిత సమర్పించిన నివాళి- దాస్ కేపిటల్- ఏ నావెల్...
 - ముక్తవరం పార్థసారథి
 
 జూలూరి గౌరీశంకర్ యుద్ధవచనం
 1996లోనే ‘తెలంగాణ’ దీర్ఘ కవిత రాసిన కవి జూలూరి గౌరీశంకర్.  ఆ తర్వాత రాసిన ‘కాటు’, ‘చెకుముకిరాయి’ వంటి దీర్ఘకవితలు, విస్తృతంగా రాసిన కవిత్వం ఆయనను తెలంగాణ కవులలో బలంగా నిలబెట్టాయి. సామాజిక బాధ్యత ఉన్న కవి సామాజిక ఉద్యమాలలో కూడా దూకుతాడు. ‘తెలంగాణ రచయితల వేదిక’ తరఫున జూలూరి తెలంగాణ ఉద్యమంలో నడుం బిగించి పని చేశారు. అనేక కార్యక్రమాలు మీటింగులు పెట్టి ప్రజల్ని చైతన్య పరిచారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న కవులనూ సాహిత్యకారులనూ తెలుపుతూ అనేక వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల సంకలనమే ఈ యుద్ధ వచనం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక నిజాయితీతో నడపడంలో సరైన దిశలో నడపడంలో తెలంగాణ రచయితల, కవుల, వాగ్గేయకారుల విస్తృత పాత్రను ఆయన ఈ వ్యాసాల్లో చర్చిస్తారు. వాళ్లందరి ఫొటోలను జత చేసి ఇందులో గౌరవించుకున్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో సాహిత్య ఉద్యమకారుల కృషి తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి. ఎ.కె.ప్రభాకర్ సంపాదకత్వం ప్రశంసనీయం.
 వెల: రూ.180; ప్రతులకు- విశాలాంధ్ర
 
 మూలింటామె సమీక్షపై స్పందన
 సారీ... పుస్తకం రాసేటప్పుడు మామూలుగా నా వొళ్లు నా సోదీనంలో ఉండదు. ‘మూలింటామె’ మీద ‘సాక్షి’లో మన ఖదీరు రాసింది చదివినాక- ముందు ముందు పుస్తకమంటూ రాస్తే వొళ్లు దగ్గిర పెట్టుకుని జాగర్తగా మసులుకుంటా. ఆయా పాత్రల్ని- మాటీవీ కోటీశ్వరుల షోకు పంపో, లాటరీ టికెట్లు కొనిపించో- ఏదో ఒక వాటాన వాళ్లకు మంచి జరిగేటట్టు చల్లంగా చూస్తా. ఇంకా పుస్తకం పూర్తయిన వెంటనే పెద్దా చిన్నా లేకుండా అచ్చుకిచ్చీకుండా శ్రీయుతులు జిల్లా ఎస్.పి.గారికీ, మేజిస్ట్రేటుగారికీ పంపి వారి స్టాంపింగు కోసం నెలల తరబడి కుదురుగా ఎదురు చూసి ఎట్టకేలకు సాధిస్తా. చివరగా పుస్తకం ప్రచురించుకోవడానికి ‘అనుమతి పత్రం’ కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సాంఘిక సంక్షేమ శాఖామంత్రి చేత ముందుమాట రాయించుకొని పుస్తకాన్ని అచ్చు వేస్తా. అప్పుడు సమీక్ష కోసం పుస్తకాన్ని ఆరాంగ పంపించి దిగులూ భయమూ లేకుండా నిశ్చింతగా కన్ను మూయ వచ్చు. సెలవు.
 - నామిని
 
 గమనిక: మూలింటామె సమీక్షలో ఖదీర్ చేసిన రెండు వ్యాఖ్యలు ‘ఇరవై ఏళ్ల పిల్ల పందొసంత. చెప్పు తీసుకొని కొట్టి సరి చేయాలంటే క్షణం పట్టదు’... ‘పాత్రలను సృష్టించి వాటిని అర్ధాంతరంగా కడతేర్చే రచయితలకు భారతీయ శిక్షాస్మృతిలో ఏ శిక్షా లేకపోవడం మరో విషాదం’... ఈ రెండు వ్యాఖ్యలను ఖండిస్తూ వీటిని ప్రమాదకరమైన వ్యాఖ్యలుగా భావిస్తూ వాటి ఉపసంహరణకు 42 మంది సాహిత్యకారుల సంతకాలతో ప్రకటన వచ్చింది. అందులో ఖాదర్ మొహియుద్దీన్, వరవరరావు, చలసాని ప్రసాద్, టి.కృష్ణాబాయి, పాణి, నగ్నముని, జయప్రభ, కాత్యాయనీ విద్మహే, సురేంద్రరాజు, బండి నారాయణ స్వామి,  స్కైబాబా, యాకూబ్,  పర్‌స్పెక్టివ్స్ ఆర్కే, తుమ్మేటి, దేశరాజు, రాణి శివశంకర్, డా.మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సమీక్షకుని స్పందన ఇస్తున్నాం. ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం.
 
 ఖదీర్ స్పందన: నా రెండు వ్యాఖ్యలు తప్పు అని కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు వ్యంగ్యం, తీవ్రత ప్రమాదం అని అర్థమైంది. రచయితలు నా తప్పును ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు. ఆ వాక్యాలను వెనక్కు తీసుకుంటున్నాను.
 
 శ్రీ సీతారామాంజనేయ సంవాదము
 ఒకసారి శివుడు పార్వతిని వరం కోరుకోమంటే ఆమె- పవిత్ర మంత్రమేదైనా ఉపదేశించమని కోరిందట. అప్పుడు శివుడు నీకు తగినది శ్రీరామమంత్రమని దానిని ఉపదేశించాడట. అప్పుడు పార్వతి శ్రీరామతత్త్వాన్ని వివరించమని కోరిందట. అప్పుడు శివుడు- లంక నుంచి తిరిగి వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయునితో సీత రామ తత్త్వాన్ని ఏ విధంగా వివరించిందో ఆ సంవాదం అంతా ఆమెకు వినిపించాడట. అదే ఈ గ్రంథం. పద్యమూ దాని తాత్పర్యం ఉన్న ఈ గ్రంథంలో ఆంజనేయునికి సీత- లక్షణాలు, ఆసనాలు, పరబ్రహ్మ స్వరూపం, ఓంకారం, బ్రహ్మ జ్ఞానం, సమాధి, గురు మంత్రార్థం... ఇలా అనేకానేక అంశాల వివరణ ఇచ్చి విశదం చేస్తుంది. ఒక రకంగా ఇది నిత్య పారాయణ గ్రంథం.
 బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణ సద్గురువులు వ్యాఖ్యానం చేయగా బ్రహ్మశ్రీ చంద్రగిరి సుబ్రమణ్యం సంకలనం చేసిన ఈ గ్రంథం 1992లో వచ్చింది. ఇది ద్వితీయ ముద్రణ. విశ్వానికి ఉపాదాన నిమిత్త కారణాలేవి? జీవుడెవరు? సూక్ష్మ శరీరం ఎట్టిది? స్థూల పంచభూతాలు ఎలా పంచీకరణం పొందుతాయి? జీవేశ్వరుల ఐక్యం ఎలా సాధించాలి? ‘తత్త్వమసి’ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి విలువైన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. అవశ్య పఠనీయ గ్రంథం.
 వెల: రూ. 350/- ప్రచురణ: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్
 ప్రతులకు: 08562-274562; 9966623711
 
 ప్రసిద్ధ కవి, కవి సంగమం వ్యవస్థాపకుడు, సరిహద్దు రేఖ వంటి విశిష్ట కవితా సంపుటులతో పాఠకులను ఆకట్టుకున్న యాకూబ్ తన తాజా కవితా సంపుటి ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ను ఆవిష్కరించి దేవిప్రియకు అంకితం ఇవ్వనున్నారు. గోరటి వెంకన్న, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, కోడూరి విజయకుమార్ తదితరులు పాల్గొంటారు. ఆగస్టు 15 ఉదయం 11 గం. నుంచి. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో.

Advertisement
Advertisement