భిన్నత్వంలో ఏకత్వానికి పట్టం | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వానికి పట్టం

Published Mon, Nov 23 2015 12:51 AM

భిన్నత్వంలో ఏకత్వానికి పట్టం - Sakshi

విశ్లేషణ
 బిహార్ ఎన్నికల విజయం అగ్రవర్ణ కుటిల రాజకీయాలపై దళితులు, మైనారిటీలు, మహిళలు, వెనుకబడిన కులాల వారి విజయంగా కూడా అభినందించదగినది. ఆహ్వానింప దగినది. భారతదేశంలోని అన్ని జాతుల ప్రజలు, అన్ని అణగారిన కులాల జనం, శ్రమజీవులందరి తరపున బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు సమర్పింపదగినది ఈ విజయం. ఈ విజయం నిజానికి ఈ దేశాన్ని ఏకశిలా సదృశ్యమైన వ్యవస్థగా చిత్రించి అఖండ భారత జాతి ఔన్నత్యం అంటూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టదలచిన శక్తులకు అపజయం.
 
 ఇటీవలి బీహార్ ఎన్నికల ఫలితాలు- భారతదేశ రాజకీయాల్లో సహజంగా నెలకొని ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితిని, తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తు న్నాయి. దీని ప్రభావంతో త్వరలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏఏ పార్టీలు, ఏఏ రాష్ట్రాల్లో ఏఏ విధంగా చేతులు కలిపితే ఏఏ ఫలితాలు రావచ్చు అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ చూస్తున్నాం. ఆ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, భారతదేశ భౌతిక వాస్తవిక పరిస్థితి క్రమేపీ ఆవిష్కృతం అవుతుండటాన్ని ఎల్లకాలమూ అటంకపర్చడం సాధ్యంకాదన్న ఆశ ఈ ఎన్నికల ఫలితాల వలన ఏర్పడుతున్నది.
 భారతదేశం చారిత్రకంగానే ఏకశిలా సదృశ్యమైనది కాదు. ప్రస్తుతం మనం భారతదేశం అని పిలుచుకుంటున్న ఈ సరిహద్దుల, పాలనా రూపుగల దేశం ఇలా ఎల్లవేళలా లేదనేందుకు ఎంత దూరమో పోనవసరం లేదు.

బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనలోనూ ఇలా లేదు. వారు వెళ్లిన వెంటనే ఉన్న భౌగోళిక చిత్రపటమూ ఇది కాదు. ఇక భాష సంగతి చెప్పనే అక్కరలేదు.   ప్రధానిగానీ, రాష్ట్రపతిగానీ, తన మాతృభాషలో మాట్లాడితే అది ఏ భాష అయినా సరే దేశ జనాభాలో సగానికిపైగా ప్రజానీకానికి అర్థం కాదు. ఇంతటి గుణాత్మకమైన వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో, మరే దేశమైనా లేదను కుంటాను. ఇంతకంటే ఎక్కువ జనాభాగల చైనాలో సైతం నూటికి 98 శాతం ఒకే జాతికి చెందినవారు, చైనా భాషనే మాతృభాషగా కలిగినవారు!


 భారత ప్రభుత్వం అని మనం పిలిచే కేంద్ర ప్రభుత్వమూ, 29 రాష్ట్ర ప్రభుత్వాలూ పాలనా అవసరాల దృష్ట్యా ఆయా రాజకీయ పరిస్థితుల క్రమంలో నేటికి ఏర్పడినాయి. ఈ మొత్తం దేశానికి (కశ్మీర్ అందుకు భిన్నం) ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని సైతం దాదాపు వంద సార్లు సవరణ చేసుకోవాల్సివచ్చింది. ఇప్పటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అమలు జరపడం సాధ్యం కావడం లేదు. ప్రజా ఉద్యమాలలో, ప్రజాచైతన్యం ఆసరాగా, ఈ దేశ స్వరూప స్వభావాలు, ఎలా మారవచ్చో నిన్నమొన్నటి ప్రత్యేక తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావం నిరూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి దఖలుపడిన కేంద్రీకృత అధికా రంతో, ప్రస్తుత భారత రాజకీయ స్వరూపం ఇలాగే కొనసాగడం అంతి మంగా అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం, దానితో వ్యవహరించే రాష్ట్ర ప్రభు త్వాలు అనే ధోరణి మనదేశ సహజ చర్రితకు భిన్నమైనది.


 అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆంధ్రజాతికి స్వభావ సిద్ధమైన  ఆవేశంతోనూ, సత్యాగ్రహంతోనూ 'ఈ కేంద్రం' ఏమిటి? ఎక్కడ? 'కేంద్ర మిథ్య' అని గర్జించి భారతదేశంలోని వివిధ జాతీయతలను గుర్తు చేయడమేకాకుండా 'ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు అవుతున్నది' అని మన తెలుగు జాతీయతను చారిత్రకంగా మరొక మారు స్ఫురింపజేశారు. దురదృష్టవశాత్తు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు పరాయి వాళ్లు భూమిని అన్యాక్రాంతంగా ఆక్రమించు కున్నట్టే ఆక్రమించుకున్నారు. ఆ తెలుగుదేశం పార్టీయే నేడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని .. తిరిగి ఢిల్లీ దర్బారు అనాగరిక పాలన పాదాలవద్ద తాకట్టు పెడుతున్నది.

 అందుకు నిదర్శనం ఇటీవలే జరిగిన మన రాజధాని శంకుస్థాపన! ఢిల్లీ నుంచి దేశ ప్రధానిని రప్పించి ఆయన ముందు అతివినయం నటిస్తూ (పైగా, పెద్దల ముందు అలా ప్రవర్తించడం గొప్పగా కూడా చెప్పారు) ఆయన రాష్ట్రానికి విదిల్చిన నాలుగు మెతుకులకు, అక్కరలేని ప్రశంసలు కురిపించారు. ఆ అభ్యర్థనా స్థితిలో అతి ప్రధానమైన, రాష్ట్రానికి రావలసిన ‘ప్రత్యేకహోదా’ విషయం ప్రస్తావించనేలేదు. పైగా ప్రధాని మోదీ తెచ్చిన 'మట్టి, నీరు' వీటినే మహద్భాగ్యంగా చెప్పుకున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మంచిగా, వారి అనుగ్రహం కోసం అంగలారుస్తున్నట్టు ఉంటేనే తగిన సాయం కేంద్రం అందిస్తుందని చెబుతున్నారు.

 ఒక్కసారి స్వర్గీయ ఎన్‌టిఆర్ పదహారణాల ఆంధ్రజాతి ప్రతీకను ఎరిగిన వారెవరైనా ఇలాంటి పరిస్థితిపై ఆయన ఎలా స్పందించగలరో తమ తమ ఆరాధనను, ఆలోచనలను బట్టి ఎవరైనా ఇట్టే గ్రహించుకోగలరు. 'అసలు ప్రత్యేక హోదా ఒకరిచ్చేదేమిటి? మనమేమైనా ఈ కేంద్ర ప్రభు త్వానికి సామంతులమా? మన జనం లేకుండా కేంద్రానికి ప్రత్యేక జనం ఉన్నారా? మనం కట్టే పన్నుల రూపంలోని డబ్బులు లేకుండా కేంద్రానికి ప్రత్యేకంగా ఖజానా ఎక్కడండి? వీరట.. మనపై జాలితలచి నిధులిస్తారట! మేము యాచకులవలే చేయిచాచి భృత్యులవలే వంగివంగి నంగినంగి పొగడ్తలు చేయాలటా...'ఇలా అని వుంటారని అనుకుంటాను.

 బిహార్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్డువార్డు తిరిగి ప్రచారం చేసుకునే స్థాయి స్థానిక రాజకీయ నేతగా 30 భారీ బహిరంగ సభల్లో స్వయంగా దేశ ప్రధానిగా తన గౌరవాన్ని కూడా మరచి 'నమో' ప్రచా రం సాగింది. ఆయన ఏమన్నారంటే 'బిహార్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మంచిది. బిహార్ అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయేనే ఎన్నుకోండి' అని చెవిలో జోరీగలా బిహార్ ప్రజల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంలో గుర్తించుకోవాల్సింది ఆ ఎన్డీయేలో చంద్రబాబు తెలుగుదేశం కూడా భాగస్వామి అనే.!

 నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షులు అమిత్‌షాలు ఇరువురూ కనీసం స్థానిక బిహారీ నేతలను కూడా లెక్కచేయకుండా ప్రచారం చేశారు. దానికి భిన్నంగా, దీటుగా అక్కడి జేడీయూ నేతలు ప్రత్యేకించి నితీశ్‌కుమార్.. మీకు బిహారీ నేత కావాలో, బహారీ (బిహార్‌కు చెందని బయటివారి) నాయకత్వం కావాలో తేల్చుకోండి? అని మౌలికమైన, సహజమైన ప్రశ్న సంధించి వారిని ఆలోచింపజేశారు. బిహార్ ప్రజలు తమకు తమ బిహారీ నేతే కావాలని తిరు గులేని రీతిలో జవాబు చెప్పారు. ఈ విజయం నిజానికి ఈ దేశాన్ని ఏకశిలా సదృశ్యమైన వ్యవస్థగా చిత్రించి అఖండ భారత జాతి ఔన్నత్యం అంటూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టదలచిన శక్తులకు అపజయం. భారతదేశం వివిధ జాతుల సమాహారం. ఏకశిలా సదృశ్యమైన జాతి ఔన్నత్యం అన్నది వాస్తవం కాదన్న శక్తుల చైతన్యయుతమైన సమాధానమే వారి అపజయంగా మారింది.

 కొందరు విశ్లేషకులు బిహార్ విజయాన్ని తక్కువ చేస్తూ - ఇది కులాల సమీకరణ ఆలోచన సంకుచిత విజయం అన్నట్లు ప్రచారం చేశారు. తమాషా ఏమంటే బిహార్ వంటి రాష్ట్రాల్లో కులతత్వం, కులరాజకీయాలు ఉన్నాయని మాట్లాడడం ఇలాంటి వారికి మామూలే. ఇక్కడ శతాబ్దాల తరబడి ఆర్థికంగానేగాక, రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా దోపిడీ, దౌర్జన్యాలకు గురవడమే కాదు కొన్ని సందర్భాల్లో పశువులకన్నా హీనంగా బతుకుతున్న దళిత, ఆదివాసీ, మహిళ, మైనార్టీ, ఇతర వెనుకబడిన కులాలు ఐక్యమవడం ప్రత్యేకించి గమనార్హం. మన నేతలంతా మహా నీతివంతులై నట్లు.. అవినీతి పరుడంటూ లాలూ ప్రసాద్ యాదవ్‌ను అవహేళన చేసిన ఆ నేతల ఆధ్వర్యంలోనే ఈ అణగారిన ప్రజానీకం తమ సత్తా ఏమిటో చూపిం చారు. ఓట్లు మావి సీట్లు మీవా? అంటూ అగ్రకులాలను ప్రశ్నించిన కాన్షీరాం ప్రశ్నకు సీట్లు కూడా మనవే అంటూ పైన పేర్కొన్న దళిత బహుజనులు చెంపపెట్టులాంటి సమాధానమిచ్చారు. బిహార్‌లో కుల రాజకీయాల గురించి తల్లడిల్లేవారు మన ఆంధ్రప్రదేశ్‌లోని కుల రాజకీయాలపై అంతగా విమర్శిం చరెందుకో! అగ్రకుల నేతలు గెలిస్తే అక్కడ సకలవర్ణాల సమభావం వర్థిల్లినట్లు- అణగారిన కులాల అభ్యర్థులు గెలిస్తే కులతత్వం ప్రబలినట్లూనా?

 మార్క్సిస్టులు తగినంత శ్రద్ధ కనబర్చక చాలాకాలం అలక్ష్యం చేసిన ఒక తీవ్రమైన దోపిడీరూపం మనుస్మృతి ఆధారంగా ఏర్పడిన నిచ్చెనమెట్ల లాంటి కులవ్యవస్థ దుర్మార్గం. కుల వ్యవస్థను ఏదో వృత్తుల సంబంధంగా భావించడం తర్కానికి కొంత దోహదపడినా అది ఎక్కడాలేనంత విచ్ఛిన్నం కాని శిలగా మన దేశంలో ఘనీభవించింది. అందుకే వృత్తులు, ఉద్యోగ హోదాలు, ఆర్థిక ప్రగతులు జరిగినా  చెదురుమదురుగా తప్పా ఈ కుల వ్యవస్థ దాని అమానవీయత అలాగే నిలిచి ఉంది. ఈ కుల వ్యవస్థలో అణ గారిన కులాల వారు ఆర్థికంగా కూడా దోపిడీకి గురవుతున్నారు అంటే వారి ఆర్థికరీత్యా, వారి అణగారిన కుల రీత్యాకూడా. ఈ రెండూ ఎంతగా పెనవేసు కుపోయాయంటే వర్గరీత్యా చూసినా ఈ కుల అణచివేత కనబడుతుంది. పైన పేర్కొన్న కులాల్లోని వారు ఎంత మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగగలిగారు? జనాభాలో 75 శాతం పైగా వీరే ఉన్నా పారిశ్రామిక వర్గాల్లో వీరు కనీసం 7.5 శాతం కూడా లేరు. పైగా ఆ హోదాలో వారు పెట్టుబడిదారీ వర్గంలో చేరినా వారు కులరీత్యా అణగారిన కులాల వారే. ఈ దౌర్భాగ్య కుల వ్యవస్థ తీవ్రత ఎంత లోతుగా ఉందంటే ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి మారవచ్చు, నివాసం మారవచ్చు, మతం మార్చుకోవచ్చు కానీ కులం మారదు. ఈ కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతిపై వారిని సమీకరించి వారి నాయకత్వాన పోరాటం సల్పటం మనదేశంలో ప్రధానమైన  అంశం.

 అందువలన బిహార్ విజయం అగ్రవర్ణ కుటిల రాజకీయాలపై దళిత బహుజనుల (మైనార్టీ, మహిళలు, వెనుకబడిన కులాల వారు) విజయంగా కూడా అభినందనీయం, ఆహ్వానింపదగినది. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఈ ఎన్నికల్లో సైతం ముగ్గురు సీపీఐ(ఎంఎల్ లిబరేషన్) వారు గెలవడం గమనించదగినది. పెట్టుబడిదారీ అగ్రవర్ణ శక్తులు విడదీయలేనంత బలీయంగా ఈ కష్టజీవుల, అణగారిన కులాల దళిత బహుజనుల సమైక్య ప్రజా ఉద్యమ నిర్మాణం అత్యంత ఆవశ్యకం. మొత్తం మీద భారతదేశంలోని అన్ని జాతుల ప్రజలు, అన్ని అణగారిన కులాల జనం, శ్రమజీవుల అందరి తరపున బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు సమర్పింపదగినది ఈ విజయం.
 

http://img.sakshi.net/images/cms/2015-08/51439835628_Unknown.jpg    వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు: డా॥ఎ.పి. విఠల్ 

    ఫోన్ నెంబర్: 98480 69720
       

Advertisement
Advertisement