దేవతావస్త్రాలు | Sakshi
Sakshi News home page

దేవతావస్త్రాలు

Published Sat, Dec 6 2014 12:18 AM

దేవతావస్త్రాలు - Sakshi

అక్షర తూణీరం : సహచరులతో హాయిగా దేశాలు తిరుగుతున్నారు. పెట్టుబడులు తెస్తున్నా మంటున్నారు. నిజంగా విదేశీ సొమ్ములు వస్తున్నాయో లేదో చూసి, ఏడా దిలోగా రాకపోతే, అయిన ఖర్చులు వసూలు చేసి సర్కార్‌కి జమ వేయాలి.
 
 ‘‘ఆరునెలలు దాటిపో యింది... అంటూ నిట్టూర్పులు వద్దు. ఉన్నాం.. ఆ పని లోనే ఉన్నాం. పథక రచన పూర్తయిపోయింది. ఎటొచ్చీ ప్రజల్లోకి తేవడమే మిగిలి ఉంది. బ్లూప్రింట్సే కాదు, రెడ్ ప్రింట్స్, గ్రీన్ ప్రింట్స్ కూడా రెడీ చేశాం. రోడ్డులేని ఊరే ఉండొద్దని ఆదేశిం చాం. అవసరమైతే ఊరుని రోడ్డు పక్కకి బదలాయి స్తాం. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. అందుకే సాంఘిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక, విద్య, ఉద్యోగ, నైతిక, అనైతిక అంశాల మీద సమగ్ర సర్వే చేయించి క్రోడీక రించి సిద్ధంగా పెట్టుకున్నాం. ఇక ప్రారంభించాల్సి ఉంది. ఇలాగ ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెబుతుంటే అర్థం చేసుకోరేంటో- ముఖ్యంగా మీడియా’’ అని వాపోతలు వినిపిస్తున్నాయి.


 చంద్రబాబు మాకు ద్రోహం చేశాడు, చేస్తున్నా డు, చేస్తాడంటూ మూడుకాలాల్లో మూడు వేళల్లో చెరిగిపోస్తున్నారు. దానివల్ల బాబు మనకేదో ఒరగ పెడుతున్నాడని వాళ్లంతా అనుకుంటున్నారు. ఇలాం టి దుష్టసంకేతాలు వెళ్తున్నాయి కాబట్టి నిప్పులు చెరగడాన్ని నియంత్రిస్తే మంచిది. ఇద్దరు ముఖ్య మంత్రులూ తమ తమ రాష్ట్రాల గురించి కలలు కం టూ ఉన్నారు. ఇద్దరూ భయంకరమైన ఆశావాదు లు. ఇక కలలు సాకారం కావడమే మిగిలి ఉంది. అందుకు గట్టిగా నాలుగేళ్ల వ్యవధి మిగిలి ఉంది. ఈ కర్మభూమిలో నమ్ముకోవలసింది మన జాతకాలని. ఓటర్లు కూడా ఆ మాట మీదే ఉన్నారు.
 
 కిందటిసారి ఓడిపోయినప్పుడు భాజపా ‘‘భారతదేశం వెలిగిపోతోంది’’ నినాదంతో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ అంటూ ప్రచారానికి దిగింది. అదంటే ఏమి టండీ అని ఒక పల్లెటూరి ఆసామీ నన్నడిగాడు. ఏం లేదు, పెదనాన్నగారి గేదె దూడ కూడా చచ్చిపోవ డం. మన దూడ పోయిందనే బాధని ఆనందమ యం చేయగలిగింది పెదనాన్నగారి గేదె దూడ సమాచారం ఒక్కటే. మనింట్లో కరెంటు పోతే పక్కిం ట్లోకి చూస్తాం. అక్కడ కూడా దీపాలు ఆరిపోతే ఊరట. ప్రస్తుతం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఇక్కడ రాజ్యం ఏలుతున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ వాటర్ లైన్లు, అక్కడ బులెట్ ట్రెయిన్‌లు, ఇక్కడ నదుల అను సంధానం, అక్కడ సముద్రాల సమీకరణం, ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు, అక్కడ బహుళార్థ సాధక ఆలోచనలతో రాష్ట్రాలు కిటకిటలాడుతు న్నాయి.
 
 ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అసలు ముఖ్య పట్టణంగా అంతటి మహా నగరం మనకిప్పుడు అవసరమా? అని ఆలోచించుకుంటు న్నారు. ఒక ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం నిర్మి స్తామని అనలేదు. జనసామాన్యానికి వైద్యం చేసే మంచి వైద్యశాలని ప్రస్తావించలేదు. ఆనాటి నాగా ర్జునసాగర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామనలేదు.


 సహచరులతో హాయిగా దేశాలు తిరుగుతున్నా రు. పెట్టుబడులు తెస్తున్నామంటున్నారు. నిజంగా విదేశీ సొమ్ములు వస్తున్నాయో లేదో చూసి, ఏడా దిలోగా రాకపోతే, అయిన ఖర్చులు వసూలు చేసి సర్కార్‌కి జమ వేయాలి. జవాబుదారీతనం లేకపోతే వీళ్లు రేపు చంద్రమండలానికి పెట్టుబడులకు వెళ్తా మంటారు! అని ఒక పెద్దాయన వేష్టపడ్డాడు. రియ ల్ సర్వే, ఏరియల్ సర్వే ఇదొక ఆర్భాటంగా ఉం దన్నాడు.
 
 అసలు రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థగా మారిస్తే సమస్య వదిలిపోతుందన్నాడాయన. నాకేం అర్థంకాలేదు. ఏం లేదు, షేర్లు అమ్మేసి ఆ డబ్బుల్తో పరిశ్రమలు, కాంప్లెక్స్‌లు పెట్టడం. అందరూ కలసి లాభాలు పంచుకోవడం... అంతే! ‘‘నష్టాలొస్తే నో...’’ అన్నాను. అదేం ఫర్వాలేదు. రాష్ట్రాలకు బోలె డన్ని స్థిరాస్తులుంటాయి కదా! అంటే అడవులు, నదులు, కొండలు వాటిని అమ్మేసి ఒడ్డున పడతారు.

అసలప్పుడు పరిపాలన మీద పట్టు దొరకలేదనీ, కుటుంబంలో నలుగురూ నాలుగు పగ్గాలు పట్టుకు న్నారనీ ఇట్లాంటి సత్యాసత్యాలు మనకు వినిపిం చవు. ఎక్కడ బావుంటే అక్కడ షేర్లకి గిరాకీ ఉంటుంది. ఇక ప్రెస్‌మీట్లు మాట్లాడవ్. బ్యాలెన్స్ షీట్లే మాట్లాడతాయ్! ఇదిగో, ఆయన నేను సీయ మ్‌ని కాదు, సీఈఓని అంటూ తెగ మారాం చేసే వాడు కదా! ఇప్పుడాయన కోరిక నిజంగానే తీరు తుంది- అంటూ ఆగాడు పెద్దాయన. నా బుర్రలో ఒక కొత్త విండో తెరుచుకుంది.
 (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)
 

Advertisement
Advertisement