100% దొంగలెక్కలు | Sakshi
Sakshi News home page

100 దొంగలెక్కలు

Published Thu, Sep 19 2013 1:17 AM

100%  దొంగలెక్కలు

తన కుటుంబ ఆస్తులు రూ.41 కోట్లేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన
 -    జనం నవ్వుతున్నారని తెలిసినా మూడేళ్లుగా అవే ‘విలువలు’
 -    1988లో కోర్టుకిచ్చిన అఫిడవిట్లో కుటుంబ ఆస్తి 77 ఎకరాలుగా చెప్పిన బాబు
 -    దాన్లో తన వాటాను సాగు చేస్తున్నానని, ఏటా రూ.36 వేలు వస్తోందని వెల్లడి
 -    1994లో ముఖ్యమంత్రి పదవి; 1999లో స్పీకర్‌కు ఆస్తుల వెల్లడి
 -    నాటి అఫిడవిట్లో తన ఆస్తులు రూ.7.7 కోట్లుగా తెలిపిన బాబు
 -    2004 నాటికి రూ.20 కోట్లకు; 2009 నాటికి రూ. 60 కోట్లకు చేరిన విలువ
 -    ఇవన్నీ ఆఫిడవిట్ల ద్వారా బాబు చెప్పిన అధికారిక లెక్కలు మాత్రమే
 -    ఆయన చెప్పిన దాని ప్రకారమే 20 ఏళ్లలో రూ.60 కోట్ల సంపాదన
 -    వాటి మార్కెట్ విలువలు చూసినా బాబు చెప్పినదానికి ఎన్నో రెట్లు అధికం
 
 ఒకవైపు రాష్ట్రం తగలబడుతోంది. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని నిలువునా చీలుస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై యావత్తు ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల ప్రజానీకమంతా రోడ్డెక్కారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ స్తంభించి 50 రోజులు కావస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులెందుకు ప్రకటించారు? ఎవరడిగారని? నయవంచక లెక్కలతో ఎవరిని నమ్మించాలని? ఎవరిని పక్కదోవ పట్టించాలని? ఏటా తాను వల్లిస్తున్న ఆస్తుల లెక్కలు చూసి జనం నవ్విపోతున్నారన్న కనీస ఇంగితం చంద్రబాబుకెందుకు లేదు?
 
 ఈ సమయంలో చంద్రబాబు చేయాల్సిందిదేనా? రాష్ట్ర విభజనకు సై అంటూ బ్లాంక్ చెక్ ఇచ్చేసిన బాబు... సమైక్య సెగలను చూశాక, సీమాంధ్రలో యాత్ర మొదలుపెట్టారు తప్ప తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల చేత సైతం రాజీనామా చేయించలేదు. పెపైచ్చు ఆర్భాటంగా తన యావత్తు కుటుంబ ఆస్తులూ కలిపి రూ.41 కోట్లేనంటూ పత్రికలకెక్కారు. అది కూడా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు పిటిషన్ విచారణకు వచ్చే ముందు!!! ఎవరి దృష్టి మళ్లించాలని? ఎవరిని వంచించాలని? మరీ ఇంత బరితెగింపా బాబూ!!?
 
 విలేకరులను పిలిచి సోమవారంనాడు చంద్రబాబు చెప్పిందేంటంటే... తన కుటుంబ ఆస్తులన్నీ కలిపి మొత్తం రూ.41.70 కోట్లని. వీటిలో ఆయన పేరిట ఉన్న ఆస్తులైతే మరీ ఘోరం!! కేవలం 42 లక్షలట. తనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న విలువైన భూములు, భవనాలు, కంపెనీల్లో వాటాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో ఉన్న నగదు, వాహనాలు... ఇలా అన్నిటివిలువా కలిసి ఆయన చెప్పిన మొత్తం లెక్క మాత్రం రూ.41 కోట్లు. ఇదెంత పచ్చి అబద్ధమో చెప్పటానికి ఒకే ఒక్క లెక్క చాలు. అదేంటంటే... ఆయన చెప్పిన దాని ప్రకారం అధికారికంగా హెరిటేజ్ ఫుడ్స్‌లో బాబు కుటుంబానికి 50 శాతం వాటా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంస్థ కనక ఇప్పుడు దాని విలువ రూ.500 కోట్లు. అంటే బాబు కుటుంబ ఆస్తి ఒక్క హెరిటేజ్ ఫుడ్స్‌లోనే... అది కూడా ఆయన చెప్పిన ప్రకారమే రూ.250 కోట్లు. కానీ ఆయన ఎన్నో రెట్లు తక్కువగా చూపించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఆయన చెప్పినవన్నీ ‘100%’ దొంగ లెక్కలని తేల్చడానికి!!
 
 మరి ఎవరిని నమ్మించడానికి ఏటా ఈ ఆస్తుల వెల్లడి తంతు!! ఈ రాష్ట్ర ప్రజలంటే బాబుకు ఎందుకంత చిన్నచూపు!! వారికి తన లెక్కలు తెలియవనా? రెండుసార్లు ఓడించింది ఆ లెక్కలు తెలియబట్టే కదా? నిజంగా తన ఆస్తులు 41 కోట్లే అయితే... అక్రమంగా సంపాదించింది లేకుంటే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు సహకరించలేదు? కోర్టు ఆదేశించినా కూడా... దర్యాప్తు జరగకుండా ఎందుకు ఢిల్లీ స్థాయిలో తంటాలు పడ్డారు? ఆ తరవాత కోర్టులకు వెళ్లి తనపై విచారణ జరగకుండా ఎందుకు అడ్డుకున్నారు? దర్యాప్తునకు సహకరించి, తానెలాంటి తప్పూ చేయలేదని నిరూపించుకోవచ్చు కదా? ఆయన నిజాయితీపరుడైతే... అదేదో దర్యాప్తు సంస్థే తేల్చి చెబుతుంది కదా!! ఆయనకు తన నిజాయితీని నిరూపించుకోవటానికి ఇదో మంచి అవకాశం కదా?  
 

  రెండెకరాల కథ చెప్పరేం?
 మదీనాగూడలోని ఈ భూమి లోకేశ్, భువనేశ్వరిలది. బాబు చెబుతున్నది ఇది పదెకరాలని. కానీ ఈ కాంపౌండ్ వాల్‌లో ఉన్న భూమి కనీసం 40 ఎకరాలుంటుందనేది స్థానికుల మాట. పదెకరాలకు బాబు కట్టిన విలువ 73.8 లక్షలు. అక్కడ రిజిస్ట్రేషన్ విలువే ఎకరా దాదాపు రూ.8 కోట్లు. మార్కెట్ విలువైతే రూ.15 కోట్ల పైనే. ఈ లెక్కనే దీని విలువ రూ.150 కోట్లు. మరి మొత్తం భూమిని లెక్కేస్తే? బాబు ఎన్ని రెట్లు దొంగలెక్కలు చెప్పినట్లు?
 చంద్రబాబు ఎప్పుడు ఆస్తుల లెక్క చెప్పినా... 1988లో తమ కుటుంబానికి 77 ఎకరాలుండేదని, దాన్ని కుటుంబీకులంతా పంచుకున్నామని చెబుతుంటారు. కానీ బాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది 1978లో. మంత్రి అయిందీ అప్పుడే! మరి అప్పటికి ఆయన ఆస్తులేంటి? ఎప్పుడూ చెప్పరెందుకు? దీనికి సమాధానం ఒక్కటే. అప్పటికి ఆయన తండ్రి ఖర్జూరనాయుడికి నారా వారి పల్లెలలో ఉన్న ఆస్తి అరెకరం. తల్లి అమ్మణ్ణమ్మ పసుపు కుంకుమగా తెచ్చుకున్న భూమి రెండెకరాలు.  మొత్తం రెండున్నర ఎకరాలు.
 
 హైకోర్టులో ఏం చెప్పారంటే...
 1988లో కర్షక పరిషత్‌కు బాబు నియామకాన్ని సవాలు చేస్తూ రైతు నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి పిటిషన్ వేశారు. దానికి జవాబుగా బాబు అఫిడవిట్ వేస్తూ... ‘‘నేను సంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ. 2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాక నేను స్వయంగా కూలీల్ని పెట్టి సాగు చేశా. ఏటా రూ. 36,000 ఆర్జించా’’ అని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టడం... ఎన్టీఆర్ కుమార్తెను వివాహమాడటం తప్ప బాబుకు ఇతర వ్యాపారాలేవీ లేవు. అలాంటిది 1992-93 నాటికి హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. ఏడాదికి రూ. 36,000 ఆర్జించిన బాబు ఆరేళ్లలో అంత డబ్బెలా సంపాదించారు? భువనేశ్వరి కార్బయిడ్స్ కంపెనీ పెట్టి దివాలా తీసి, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారు తప్ప ఏ వ్యాపారంమీదా రూపాయి కూడా సంపాదించిన దాఖలాలు లేవు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది?
 
 1999 నాటికి రూ.7.7 కోట్లకు చేరిన ఆస్తి!
 1994లో ముఖ్యమంత్రి అయిన బాబు... 1999లో తన ఆస్తుల్ని స్పీకర్ ఎదుట ప్రకటించారు. తనకు రూ.7.79 కోట్ల ఆస్తులున్నట్లు దాన్లో వెల్లడించారు. అన్ని కోట్లు ఎలా సంపాదించారు? అప్పట్లో హెరిటేజ్ ఫుడ్స్ కూడా నష్టాల్నే నమోదు చేసింది. మరి బాబు ఆస్తులెలా పెరిగాయి?
 
 జూబ్లీహిల్స్‌లోని ఈ కోట విలువ బాబు చెప్పిన ప్రకారం రూ. 23 లక్షలు. ఇది నిజంగా పాతిక కోట్లుండదా? అంటే వంద రెట్లు తక్కువ చూపించినట్లు కాదా?
 
 2009 నాటికి రూ.60 కోట్లకు
 ఫిక్స్‌డ్ డిపాజిట్ రెట్టింపు కావాలంటే ఆరేళ్లు తప్పనిసరి. కానీ బాబు ఆస్తులు ఎంత వేగంగా పెరిగాయంటే... 2004 నాటికి 20 కోట్లకు చేరాయి. 2009 నాటికి ఏకంగా 60 కోట్లయ్యాయి. ఇవన్నీ బాబు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పినవే సుమా!! అది కూడా బాబు తాను కొనుగోలు చేసిననాటి విలువలను మాత్రమే చెప్పారు. మరి మార్కెట్ విలువ 30 రెట్లు ఎక్కువేనన్నది అబద్ధమా? అన్ని కోట్లు ఎలా పోగేశారు బాబూ??
 
 బాబు చెప్పని కుటుంబ ఆస్తుల కథ...
 భువనేశ్వరి: ఆస్తి రూ. 33 కోట్లట! మూడేళ్ల ఆదాయం రూ. 34 కోట్లు... చంద్రబాబు చెప్పినదాని ప్రకారం తన భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.33 కోట్లు. కానీ వాస్తవమేంటో తెలుసా...? 2008-2011 మధ్య మూడేళ్లలో భువనేశ్వరి ఆదాయం రూ. 34 కోట్లు. ఇదెక్కడైనా సాధ్యమా? ఆస్తుల్ని బట్టే కదా ఆదాయం వచ్చేది? ఎంత ఆస్తి లేకుంటే ఇంత ఆదాయం వస్తుంది? జనం ఈ మాత్రం ఆలోచించగలరనే విషయం బాబుకెందుకు తట్టదు?
 
 భువనేశ్వరి ఆదాయం...
 2010-11లో రూ. 13.50 కోట్లు. 2009-10లో  రూ. 6.58 కోట్లు. 2008-09లో రూ. 13.00 కోట్లు. ఇది ఆదాయపుపన్ను శాఖకు స్వయంగా భువనేశ్వరి సమర్పించిన లెక్క. ఈ మూడేళ్లలో ఈ ఆదాయంపై ఆమె చెల్లించిన ఆదాయపు పన్నే అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు లెక్కలు ఎవరిని మోసం చేయడానికన్నట్టు?
 లోకేశ్..
 
 2008-09వ సంవత్సరం దాకా లోకేశ్ ఎక్కడా ఉద్యోగం చేసిన దాఖలాలు లేవు. అప్పటిదాకా చదువుతూనే వస్తున్నారు. అందుకే 2008-09 ఐటీ రిటర్నులో తన వ్యక్తిగత ఆదాయాన్ని రూ.86,350గా చూపించారు. దానిపై 4,280 రూపాయల పన్ను చెల్లించారు. తరవాత హెరిటేజ్ ఫుడ్స్‌లో చేరటంతో ఆయనకు జీతం ద్వారా ఆదాయం వచ్చి... 2009-10లో రూ.29.27 లక్షల ఆదాయాన్ని, 2010-11లో రూ.37.18 లక్షల ఆదాయాన్ని చూపించారు.  గమనించాల్సిందేంటంటే 2008-09 వరకు పెద్దగా ఆదాయమేదీ లేని నారా లోకేశ్... మైనర్‌గా ఉన్నప్పటి నుంచీ భారీగా ఆస్తులు కూడబెడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిందాలిలో మొదలెట్టి... హైటెక్ సిటీ పక్కన మదీనాగూడ, కొండాపూర్‌లలో ఎకరాలకు ఎకరాలు కూడబెట్టేశారు. నాయినమ్మ ఇచ్చిన గిఫ్ట్‌లతో మదీనాగూడలో భూమితో పాటు బంజారాహిల్స్‌లో భవనమూ సొంతమయింది. తరవాత హెరిటేజ్ ఫుడ్స్ సహా వివిధ కంపెనీల్లో షేర్లను సమీకరించుకున్నారు. ఇవన్నీ చంద్రబాబునాయుడి ఆస్తులో... లోకేశ్ ఆస్తులో తెలియటం లేదూ!!? ఆదాయం లేని లోకేశ్ కర్ణాటక, ముంబయిలలో విలువైన భూములెలా కొన్నారు? చెప్పు బాబూ!!

Advertisement

తప్పక చదవండి

Advertisement