సాహిత్య, సమన్యాయాల తీర్పరి | Sakshi
Sakshi News home page

సాహిత్య, సమన్యాయాల తీర్పరి

Published Fri, Apr 11 2014 1:57 AM

సాహిత్య, సమన్యాయాల తీర్పరి - Sakshi

న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పులోని ముఖ్యాంశాలను నిపుణతతో వెల్లడించినట్టే ఒక సాహిత్యాంశం గురించీ, సాహిత్యవేత్త గురించీ, సామాజికాంశం గురించీ చిన్నపరెడ్డి ప్రసంగించడం కనిపిస్తుంది.
 
మానవాళికి అందకుండా అనంతంగా బాధిస్తున్న మౌలిక అవసరాలను, ప్రభుత్వాన్ని నిగ్గదీసి సాధించుకునే  మానవ హక్కుల స్థాయికి తీసుకువచ్చిన అరుదైన న్యాయమూర్తులు మనకు ఉన్నారు. అంటే అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చే బాధ్యతను వారు స్వీకరించారు. వారిలో జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నపరెడ్డి ఒకరు. చిన్నపరెడ్డి ‘ది కోర్ట్ అండ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ (ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2008) పుస్తకానికి ప్రొఫెసర్ ఉపేంద్ర బాగ్చి రాసిన్ఙ‘ముందుమాట’లో వీఆర్ కృష్ణయ్యర్, పీఎన్ భగవతి, డీఏ దేశాయ్‌లతో పాటు మన రాష్ట్రానికి చెందిన చిన్నపరెడ్డి కూడా అలాంటి చరిత్రాత్మక బాధ్యతను నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. నిజానికి సాహిత్యం చేసిందీ, చేయాల్సిందీ ఇదేనని చిన్నపరెడ్డి విశ్వసించి, మనందరికీ చెప్పదలిచారనిపిస్తుంది. చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి (ఏప్రిల్ 13, 2014)కి విడుదలవుతున్న ‘జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి: సాహిత్య సామాజిక ప్రసంగాలు’ (జనసాహితి ప్రచురణ)పుస్తకం ఈ తాత్వికతనే ప్రతిబింబిస్తోంది.
 
 న్యాయస్థానం మౌనంగా ఉండిపోవడం మీద జస్టిస్ చిన్నపరెడ్డికి ఉన్న ఆవేదనే ఆయన విస్తృత గ్రంథం ‘ది కోర్ట్ అండ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’లో కనిపిస్తుంది. 1967 నాటి గోలక్‌నాథ్ వ్యాజ్యంలో (ప్రాథమిక హక్కులను సవరించేందుకు పార్లమెంటును అనుమతించకపోవడం) అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం విషాదమని ఆయన వ్యాఖ్యానించారు. 1970లో ఈఎంఎస్ నంబూద్రిపాద్‌ను శిక్షిస్తూ తీర్పునివ్వడం తప్పిదమని అంటారాయన. అరుంధతీరాయ్‌ని శిక్షించడం, బాబ్రీ మసీదు కూల్చివేతలో మౌనం దాల్చడం గురించి కూడా చిన్నపరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య తీర్పులూ, హయాం మీద వెలువరించిన వ్యాఖ్యలు అసాధారణమైనవి. భూమయ్య, కిష్టాగౌడ్ మరణ దండనను తప్పించి, విప్లవకవుల మీద కేసును కొట్టేసిన న్యాయమూర్తి ఆయన. మహా నేరగాళ్లు సమాజంలో నిర్భయంగా తిరుగుతుంటే వీళ్లనెందుకు శిక్షించాలన్నది ఆయన ప్రశ్న. ఇలాంటి తీర్పరి తెలుగు సాహిత్యం మీద చేసిన వాదనలూ, విశ్లేషణలూ లోతుగా కాకుండా ఇంకెలా ఉంటాయి? ‘సాహిత్యానికీ సామ్యవాదానికీ, నిత్య జీవితానికీ తీరని బంధాలున్నాయి’ అని నమ్మారాయన. ‘సమాజ హృదయం సాహిత్యం. లోకాన్నంతటినీ అవలోకించే నేత్రం సాహిత్యం. చదువరిలో చైతన్యం కలిగించి భావి భావ విప్లవానికి దారి తీస్తుంది సాహిత్యం’ అంటారు జస్టిస్ చిన్నపరెడ్డి.
 
 న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పులోని ముఖ్యాంశాలను నిపుణతతో వెల్లడించినట్టే ఒక సాహిత్యాంశం గురించీ, సాహిత్యవేత్త గురించీ, సామాజికాంశం గురించీ చిన్నపరెడ్డి ప్రసంగించడం కనిపిస్తుంది. ఆ అంశం మీద ఆయన అధ్యయనం లోతుగా ఉంటుంది. దాని సారాన్ని ఆయన క్లుప్తంగా, బలంగా ఆవిష్కరిస్తారు. ‘వేమన ఏ కాలానికి చెందిన  వాడూ కాదు. వేమన కాలం కలకాలం. చిరకాలం, స్థిరకాలం’ (వేమన-మనకర్తవ్యం) అన్నారాయన. కానీ వేమన తన సమకాలీన సమాజం మీద చేసిన విమర్శలు, నేటి సమాజానికి  వర్తించడం గురించి జస్టిస్ గట్టిగానే స్పందించారు. ఆ దుస్థితి నుంచి సమాజాన్ని తప్పించమని మీ అందరినీ ‘శాసిస్తున్నాను’ అన్నారా న్యాయమూర్తి. ‘గురజాడ తెనుగు వారికి గ్రాంథిక భాషకు బదులు వాడుక భాషను చేకూర్చాడు. తెనుగు సాహిత్యంలో కాల్పనికానికి బదులు వాస్తవికాన్ని ప్రవేశపెట్టాడు. తెనుగు వారికి ఆధ్యాత్మికతత్వం బదులు శాస్త్రీయ మానవతాతత్వం పరిచయం చేశాడు. ఈ విధంగా రకరకాలుగా నవయుగ వైతాళికుడుగా వెలుగొందాడు గురజాడ’ (నవయుగ వైతాళికుడు - గురజాడ )అన్నారాయన. చండీగఢ్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం నాటక పోటీలు నిర్వహిస్తే అక్కడకి కూడా వెళ్లి ‘ఏ విషయాన్నైనా, ఏ సమస్యనైనా ప్రజాబాహుళ్యానికి సులభ గ్రాహ్యం చేయగల కళ నాటక కళ’ అని పేర్కొన్నారు. ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ కృషిలో జస్టిస్ చిన్నపరెడ్డి పాత్ర ఏమిటో చెప్పే ప్రసంగం చదవడం మంచి అనుభవం.
 
 ఆధునిక చరిత్రలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్థానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ‘ధర్మయుద్ధం’, వసతి గృహాలలో ఉండే పేద విద్యార్థులకు ఏమి అందాలి వంటి అంశాల మీద ప్రసంగాలు విలువైనవి. సామాజిక న్యాయానికీ, సాహిత్యానికీ మధ్య బంధం గురించి ప్రపంచం చర్చిం చుకుంటున్న వేళ ఈ పుస్తకం రావడం ఆహ్వానించదగినదే.
 - కల్హణ
 13 వ తేదీన హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా

Advertisement
Advertisement