‘సమాఖ్య’కు కాంగ్రెస్ సమాధి! | Sakshi
Sakshi News home page

‘సమాఖ్య’కు కాంగ్రెస్ సమాధి!

Published Tue, Nov 12 2013 3:22 AM

‘సమాఖ్య’కు కాంగ్రెస్ సమాధి! - Sakshi

‘‘భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించటంలో ఆచరణ యుక్తమైన మంచి రాజ్యాంగాన్ని అందించాలన్న లక్ష్యం తప్ప రాజ్యాంగ నిర్ణయ సభకు మరో ఉద్దేశమేలేదు... కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించి (ఉ:372-3 లాంటివి) వచ్చిన సవరణలు చాలా కొద్దివి మాత్రమే. అలాంటి ప్రత్యేక సవరణలకు రాష్ట్రాల శాసనసభల ధృవీకరణ తప్పనిసరి. కనుకనే, సవరణలు చేసే అధికారాలను కేంద్ర, రాష్ట్ర శాసన వేదికలకు వదిలిపెట్టడం జరిగింది... అయితే, అందుకు ఒక్క పరిమితి ఉంది - పార్లమెంటుకు చెందిన ఉభయ సభలూ దేనికదే సభలో హాజరైన మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది రాజ్యాంగ సవరణలను విధిగా ఓటింగ్ ద్వారా ఆమోదించి తీరాలి... అంతేగాదు, ముందు ముందు భావి పార్లమెంటు రాజ్యాంగ నిర్ణయ సభగా కలిసినప్పుడు ఆ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల సభ్యులుగా తమ చర్యల పట్ల పాక్షిక దృష్టితో వ్యవహరించగల అవకాశముంది; అప్పుడు వాళ్లు రాజ్యాంగంలోని ఏదో ఒక అధికరణ తమకు అడ్డు తగులుతున్నందున ఆ అధికరణకు పార్లమెంటు ద్వారా సవరణలు పొందడంలో విఫలమైనప్పుడు వారు పాక్షికంగానే వ్యవహరిస్తారు!’’
 
 - డాక్టర్ అంబేద్కర్: ‘రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలు’ (సంపుటి 7, పేజీ: 43-44).  రాజ్యాంగ నిర్ణేత డాక్టర్ అంబేద్కర్ 1948-49లోనే ముందు ముందు రాజకీయ పార్టీలు రాజ్యాంగ లక్ష్యాలను ఎలా తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు అనుకూలంగా నిర్వీర్యం చేస్తాయో పసికట్టి దేశ ప్రజలను దూరదృష్టితో హెచ్చరించిన ద్రష్ట! నేటి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అంబేద్కర్ అనుమానాలను రుజువు చేస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యల ద్వారా పాక్షిక ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ సంస్థలనూ భ్రష్ఠు పట్టిస్తూ వచ్చిన తీరు మనకు తెలుసు. దేశంలోని ‘సమాఖ్య’ (ఫెడరల్) వ్యవస్థను కూడా అవమానించే స్థాయికి అవి చేరుకున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ - రాజ్యాంగంలోని 3వ అధికరణ అనే తెరచాటు నుంచి ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావాలకే విరుద్ధంగా కేంద్రమే ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ సంఘం సిఫార్సుల ఆధారంగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలను సహితం చీల్చడానికి ఈ రెండు పార్టీలూ వెనుకాడక పోవడం. అసలు రాజ్యాంగంలో ఆ ‘3వ అధికరణ’ పుట్టిన సందర్భంలోకి వారు తొంగిచూడలేదు.

ముసాయిదా రాజ్యాంగం సిద్ధమవుతున్న సమయంలో అది వచ్చింది. బ్రిటిష్ వాళ్ల ‘విభజించి-పాలించే’ విధాన చట్రంలో 1935 నాటి వలస చట్టం (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్) ప్రకారం ఏర్పడిన ‘ప్రావిన్సెస్’గానూ, స్వదేశీ సంస్థానాలు, రాచరికాలు (నేటివ్ స్టేట్స్)గానూ దేశంలో ఆనాడు ద్వంద్వ పరిపాలన (1948-49) అమలులో ఉంది.   నైజాం వంటి సంస్థానాధీశులు తమ ‘స్వతంత్ర’ ఇలాకాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి ‘ససేమిరా’ అంటున్న దుర్ముహూర్తాలవి! ఈ స్వదేశీ సంస్థానాలు ఉత్తరోత్తరా ‘కొరకురాని కొయ్యలవు’తాయేమోనని భావించి ఆ పరిణామాన్ని అరికట్టడం కోసం ‘3వ అధికరణ’ను పటిష్టం చేసారు. తద్వారా ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని లేదా రాష్ట్రాలను విడగొట్టడానికి, సరిహద్దుల్ని చెరిపివేసి వాటిని మరొక రాష్ట్రంలో కలపడానికి, సంస్థానాల, రాష్ట్రాల పేర్లు మార్చడానికీ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకూ హక్కు ఉందని చాటవలసివచ్చింది.

అలా రాజ్యాంగంలో చొప్పించిన ఈ ప్రత్యేక అధికరణను వాడుకొని సంస్థానాల విలీనం తరువాత కూడా కేంద్రంలో అధికారం చెలాయించే పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం, ఓట్లు-సీట్లు పెంచుకోవడం కోసం రాష్ట్రాలను చీల్చడానికి శ్రీకారం చుట్టాయి. దేశ సమైక్యతకు, సంఘీభావానికి ప్రాథమిక పునాదులుగా ఉండాల్సిన రాష్ట్రాలను బలహీనపర్చి, ప్రతీ దానికీ కేంద్రంపై ఆధారపడి బతికే బానిస పరిస్థితుల్లోకి వాటిని నెడుతూ వచ్చాయి. రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాల పరిధులలోకి, ఆ రెండింటి ఉమ్మడి అధికారాల పరిధిలోకి వచ్చే మూడు జాబితాలను వేర్వేరుగా రూపొందించినప్పటికి తన జాబితా పరిధుల్ని దాటి కేంద్రం రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలలోకి దూరుతూ రాష్ట్ర ప్రభుత్వాలనూ ‘డూడూ బసవన్నలు’గా దిగజార్చుతూ వస్తోంది.

ఇందుకు తొలి ఉదాహరణ - మెజారిటీలో ఉన్న కేరళలోని నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కాంగ్రెస్ నిష్కారణంగా కూల్చడం. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు: 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లనేరదన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు పర్యవసానంగా బ్రూట్ మెజారిటీ ఆసరాగా ఆమె తన పదవీ ప్రయోజనాల కోసం  దేశంలో ‘ఎమర్జన్సీ’ని ప్రకటించి ప్రజాస్వామ్యాన్నీ, న్యాయవ్యవస్థ ఉనికినీ ప్రశ్నార్థకం చేయడం; రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని చుప్తాగా రద్దు చేయటం; న్యాయస్థానాలను బెదిరించ టం, బెదిరింపులకు లొంగని జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా లాంటి వారికి ప్రమోషన్లు నిలిపివేయటం ఇత్యాది చర్యలు. చివరికి దేశ రాష్ర్టపతిని రబ్బరు స్టాంపుగా మార్చుకోవటం!

 ఫెడరల్ వ్యవస్థలో ఒకరి పరిధుల్లోకి మరొకరు దూరకుండా ప్రభుత్వం, శాసన వేదిక, న్యాయవ్యవస్థల మధ్య పాలనాధికారాలను రాజ్యాంగం స్పష్టంగా విభజించినప్పటికీ నర్మగర్భంగా అలాంటి జోక్యానికి పాల్పడటానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు వెనుకాడలేదు! అసలు ఫెడరల్ వ్యవస్థనే ఆ రెండు పక్షాలూ అపహాస్యం చేశాయి, చేస్తున్నాయి. ‘‘ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థా రాజ్యాంగంలో అతి ముఖ్యమైన అంశాలు, అవి రెండూ, రాజ్యాంగం మౌలిక లక్షణాలలో అంతర్భాగం’’ అని జస్టిస్ సవంత్, జస్టిస్ జీవన్‌రెడ్డి 1977 లోను, 1994లోనూ సుప్రీం తీర్పుల్లో స్పష్టం చేశారని మరువరాదు (బొమ్మయ్ కేసులో)! జస్టిస్ జీవన్‌రెడ్డి ఇలా పేర్కొన్నారు: ‘‘మన రాజ్యాంగ పరిధుల్లో రాష్ట్రాలకన్నా కేంద్రానికి ఎక్కువ అధికారం ఉన్న మాట నిజమే. కానీ, దానర్థం రాష్ట్రాలనేవి కేంద్రాధికారానికి లోబడి ఉండే అనుబంధ సంస్థలని కాదు! రాష్ట్రాల అధికారాలను కేంద్రం దురాక్రమించలేదు. ఫెడరల్ వ్యవస్థ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాదు, అది సూత్రబద్ధమైన సువ్యవస్థ.’’

కొందరు వేర్పాటు వాదులు, కొందరు న్యాయవాదులూ కేంద్రం బిల్లు అనేది (తెలంగాణ బిల్లు ఏర్పాటు ప్రతిపాదన) నామమాత్రంగానే రాష్ట్రపతి నుంచి శాసనసభకు ఓటింగ్ ద్వారా ఆమోదం పొందడం కోసం గాక, ప్రస్తావన మాత్రంగా ‘రిఫర్’ కావడమే అసలు మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి అని పొరబడుతున్నారు. 1955లో ‘3వ అధికరణ’కు 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగిన కుట్రపూరిత సవరణ పూర్వాపరాలు వీరికి తెలియనట్టుంది. 1955 రాజ్యంగ సవరణ చట్టం రావడానికి ముందటి ‘ప్రొవిజో’ ప్రకారం ఏ పార్లమెంటు ‘బిల్లు’ అయినా సరే దానిని రాష్ట్ర శాసనసభ ‘నిశ్చితాభిప్రాయాన్ని’ తెలుసుకోవడానికి రాష్ట్రపతికి నివేదించాలని ఉంది.

ఇందుకు వాడిన పదం ‘ఎసర్‌టైన్.’ అంటే ‘నిశ్చితాభిప్రాయ’ ప్రకటన. అసెంబ్లీలో సభ్యుల ఓటింగ్ ద్వారానే అది స్పష్టపడుతుంది గాని సభ్యుల ఉపన్యాసాల ఊదర ద్వారా తేలదు! ఓటింగ్ ద్వారానే సభ వారి నిశ్చితాభిప్రాయం లేదా నిర్ణయం ప్రకటించడమనేదే ఆ ‘ఎసర్‌టైన్’ పదానికి అర్థం! ఆ కారణం వల్లనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అది తన అవకాశవాద స్వార్థ ప్రయోజనాలకు నష్టమని భావించి, ఆ పదాన్ని అర్థాంతరంగా మార్చేసి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని ‘రిఫరెన్స్’ అన్న పదాన్ని 1955 సవరణ ద్వారా చడీ చప్పుడు లేకుండా చేర్చింది! కనుకనే, శాసనసభ ‘అభిప్రాయాలు’ తెలుసుకోవడానికి రాష్ట్రపతి శాసనసభకు బిల్లును ‘రిఫర్’ చేయాలి గాని ఓటింగ్ తీసుకోవడానికి కాదు అనేది రుజువైపోయింది. ఆ ‘5వ సవరణ’ భరోసాతోనే కాంగ్రెస్ అధిష్టానంలోని తెలుగుజాతి వ్యతిరేకులు తెలుగు జాతిని చీల్చే పన్నాగానికి పాల్పడ్డారు!

అలాగే 356వ అధికరణ పేరిట తనకు పడని ప్రతిపక్ష ప్రభుత్వాల్ని కూల్చడానికి రాష్ట్రపతి పాలనను యధేచ్ఛగా వినియోగించడానికి అలవాటుపడిన కాంగ్రెస్, బీజేపీ పాలకుల నోళ్లకీ, చేతులకూ సుప్రీంకోర్టు ‘బొమ్మాయ్ కేసు’లో తీర్పు ద్వారా కళ్లేలు వేయవలసి వచ్చింది! అలాగే విభజించబోయే రాష్ట్రాలను, వాటి సరిహద్దులు మార్చే విషయంలో ‘పార్లమెంటు అధికారాలకు రాజ్యాంగపరమైన పరిమితులు ఉన్నాయ’నీ, ఫెడరల్ వ్యవస్థలోని రాష్ట్రాల శాసనసభల ప్రతిపత్తిని తగ్గించే ఏక పక్ష చర్యను తీసుకోరాదనీ తప్పు డు వ్యాఖ్యానం చేయరాదనీ ప్రపంచ ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ దుర్గాదాస్ బసు హెచ్చరించాల్సి వచ్చింది! కాంగ్రెస్ నుంచి ఈ భావి పరిణామాలను ఆ మహా విద్యావేత్త ముందే ఊహించినట్టున్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ముందు క్రిప్స్ మిషన్‌కు ఆయన కాంగ్రెస్ తరఫున సమర్పించిన నివేదికలో కూడా కేంద్రం వద్ద రక్షణ, విదేశాంగ, రెవెన్యూ శాఖలు మాత్రమే ఉండాలనీ మిగతా అధికారాలన్నీ రాష్ట్రాలకు సంక్రమింపచేయాలనీ సూచించి ఉంటారు. ఇప్పుడు ఆ దిశగానే ఈశాన్య భారత రాష్ట్రాలన్నీ కదలబారుతున్నాయి!  

Advertisement
Advertisement