గురజాడ తమ్ముడే బతికివుంటే... | Sakshi
Sakshi News home page

గురజాడ తమ్ముడే బతికివుంటే...

Published Sun, May 29 2016 10:54 PM

గురజాడ తమ్ముడే బతికివుంటే...

స్మరణ
 
విశాఖ మన్యంలో పొటమరించిన గిరిజనుల తిరుగుబాట్లను గురజాడ పట్టించుకోలేదనే విమర్శ ఉంది. అయితే, తన జీవిత కాలంలోనే కథాపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన ఆదివాసి తాంతియా భిల్ వీరగాథల్లో ఒక సన్నివేశాన్ని గురజాడ అప్పారావు తమ్ముడు గురజాడ శ్యామలరావు మాత్రం ‘ద పోలీస్ అండ్ ద బార్బర్, యాన్ ఎపిసోడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తాంతియా ద భీల్’ శీర్షికతో చిన్న గేయ దృశ్య రూపకాన్ని ఐయాంబిక్ పెంటామీటర్ ఛందస్సులో రచించి, ఆనాటి సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ ‘రీస్ అండ్ రైయత్’ పత్రికలో (అక్టోబర్ 26, 1889 సంచిక) ప్రచురించాడు.
 
 న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1889 నవంబరులో  తాంతియా అరెస్టు వార్తను ప్రచురించి, అతణ్ణి ‘ఇండియన్ రాబిన్‌హుడ్’గా అభివర్ణించింది. తాంతియా బ్రిటిష్ సైన్యాన్నీ, హోల్కరు సంస్థానం సిపాయిలనూ ముప్పుతిప్పలు పెట్టాడు. అతను గెరిల్లా పోరాట పద్ధతుల్లో ఆరితేరిన యోధుడు. తాంతియాకు సహకరించారనే ఆరోపణ మోపి ప్రభుత్వం ఎందరినో జైల్లో పెట్టింది. చివరకు అతని రక్త సంబంధీకుల ద్రోహం వల్లే ప్రభుత్వం తాంతియాను బంధించగలిగింది. 1889 అక్టోబర్ 19న సెషన్స్ జడ్జీ తాంతియాకు మరణశిక్ష విధించాడు. పోలీసులు తాంతియా పార్థివ దేహాన్ని ఖాండ్వాకు వెళ్లే రైలుమార్గంలో పాతాల్‌పానీ అనే ప్రదేశంలో పడేశారని జనశృతి.
 
తాంతియా ఒక పోలీసు జమేదారు నాసికను ఖండించినట్లు చరిత్ర. తన కోసం అరణ్యంలో గాలిస్తూ, ఎప్పుడు ఆకస్మికంగా విరుచుకుపడతాడో అని భిక్కుభిక్కుమంటున్న పోలీసుల దగ్గరకు తాంతియా ఒక పల్లెటూరి రైతు రూపంలో వస్తాడు. తాను మంగలిననీ, తాంతియా దోపిడి మూకకు భయపడుతున్నాననీ చెప్తాడు. పోలీసు జమేదారు తనకు గడ్డం చేయమంటాడు. వినయం నటిస్తూ గడ్డం చేస్తూ, అతని ముక్కు కోసి, తానే తాంతియానని చెప్పి అడవిలో అదృశ్యమవుతాడు. ఈ సంఘటనను బాలే రూపంలో చిత్రించి బ్రిటిష్ పోలీసులను ఎద్దేవా చేస్తాడు శ్యామలరావు. ఈ బాలేలో తాంతియా ధైర్యాన్ని కీర్తించడం కూడా ఉంది.
 
శ్యామలరావు స్మృతికి నిదర్శనంగా ఈ గేయరూపకం, అప్పారావు శ్యామలరావుకు రాసిన ఒక ఉత్తరం, శంభుచంద్ర ముఖర్జీ ఈ గేయ రూపకాన్ని ప్రశంసిస్తూ శ్యామలరావుకు రాసిన సుదీర్ఘ లేఖ మాత్రమే మనకు మిగిలాయి(‘గురజాడలు’ పుటలు 1005, 1012; అనుబంధం: 61-63).
 
గురజాడ అప్పారావు వారసుల కథనం ప్రకారం, శ్యామలరావు విజయనగరంలో బీఏ చదువుతూ ప్రిన్సిపాల్ రామానుజాచార్యుల బోధన నచ్చక మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. అక్కడ అతనికి ‘‘కాంగ్రెస్ గాలి సోకింది’’. దాంతో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభల్లో (1886) పాల్గొని విషయ నిర్ణయ సభలో ఒక తీర్మానం మీద పది నిమిషాలు ప్రసంగించాడు.
 
 మద్రాసులో జరిగిన మూడో కాంగ్రెస్ సభ (1887)లకు గూడా బి.ఎల్. విద్యార్థిగా హాజరయ్యాడు. ‘‘అవసరాల సూర్యారావిచ్చిపోయిన భోగట్టా విశ్వసనీయమైతే, బొంబాయిలో జరిగిన ఐదవ కాంగ్రెస్ (1889) సభల్లో గూడా శ్యామలరావు పాల్గొన్నాడనుకోవాలి.’’ అప్పటికే శ్యామలరావు రేడికల్ విద్యార్థిగా పేరుపడ్డాడు.
 
 మద్రాసులో జరిగిన మూడో కాంగ్రెస్ సభ (1887)ల్లో సుప్రసిద్ధ న్యాయవాది ఎడ్లీ నార్టన్ ఉపన్యసిస్తూ- శాసనసభల్లో ప్రజాప్రతినిధులకు ప్రవేశం కలిగించాలనడమే రాజ ద్రోహ చర్య అయ్యేట్లయితే- ...   I am ranked as one among such a magnificient arry of seditionists అని ప్రకటించాడు.
 
ఎడ్లీ ఉపన్యాసంలోని ఈ చివరి వాక్యాల స్ఫూర్తితో శ్యామలరావు To the magnificient Seditionists అనే గేయాన్ని రచించి, హిందూ పత్రికలో ప్రకటించాడు. ‘‘అంతకంటే ముఖ్యమైన సంగతి: సముద్రం ఒడ్డున మిత్రులతో కలిసి ముచ్చటిస్తున్న శ్యామలరావును ఎడ్లీ నార్టన్ వెదుక్కుంటూ వచ్చి కౌగిలించుకొనిగానీ వదల్లేదు’’. హిందూలో అచ్చయిన కవితను శ్యామలరావు శంభుచంద్ర ముఖర్జీకి పంపాడు. ముఖర్జీ తిరిగి శ్యామలరావుకు రాసిన ఉత్తరంలో పై కవితలోని తొలి నాలుగు చరణాలను ఉదహరించాడు.
 
ఈ నాలుగు చరణాలే ప్రస్తుతం మనకు దక్కినవి. ఐ ్చఝ ్చటౌ్టజీటజ్ఛిఛీ ్చ్ట డౌఠట ఛిౌఝఝ్చఛీ ౌజ ఉజజీటజి అని శ్యామలరావును ముఖర్జీ ప్రశంసించారు. శ్యామలరావు, అతని కవి మిత్రుడు వంటి విద్యార్థులు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉంటే ఎంతో బాగుండేదని అభినందించారు. ‘‘మీరు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటాను. అది సాధ్యం కాదని తెలుసు. దిగజారుతున్న స్థానిక రాజకీయాలకు దూరంగా ఉండలేరనీ తెలుసు. ఏమైనా ఉన్నత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి, రాజకీయాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వండి’’ అని సలహా కూడా ఇచ్చారు.
 
గోమఠం శ్రీనివాసాచార్యులు తన ఇంగ్లీషు హరిశ్చంద్ర నాటకం చివర శ్యామలరావు స్మృతిచిహ్నంగా, అతను రాసిన రెండు బ్లాంక్ వెర్సెస్‌ని చేర్చుకొని, ఆ విషయాన్ని ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు. మొదటి పద్యంలో నారదుడు హరిశ్చంద్రుణ్ని ఆశీర్వదిస్తూ చెప్పిన అంశాలు, రెండో పద్యంలో హరిశ్చంద్రుడి సమాధానం ఉన్నాయి. ‘‘నా మిత్రులు కీర్తిశేషులు గురజాడ శ్యామలరావు బి.ఏ.గారు పన్నెండు సంవత్సరాల క్రితం రచించిన రెండు బ్లాంక్ పద్యాలను వారి జ్ఞాపక చిహ్నముగా వుంచుటకు యింతకంటె మార్గము లేదు గనుక యీ నాటకంలో అచ్చొత్తించాను’’ అని శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. అవసరాల సూర్యారావు శ్రద్ధ వల్లే ఈ పద్యాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి.
 
గురజాడ శ్యామలరావు 1890-91లో లా చదువుతూ, జబ్బు చేసి, యవ్వనంలోనే చనిపోయినట్లు కె.వి.ఆర్. పరిశోధనలో తేలింది. అప్పటికి శ్యామలరావుకు పెళ్లి కూడా అయింది. ‘‘చచ్చిన వాని కళ్ళు చేరడేసి అని కాదుగాని, శ్యామలరావే బతికివుంటే అన్న తల దన్నిపోయినా, పోకున్నా సమవుజ్జీగానైనా రాణించి ఉండేవాడు’’(కె.వి.ఆర్. మహోదయం).
 
 డా॥కాళిదాసు పురుషోత్తం
 9247564044

Advertisement
Advertisement