పాలకుల చేతి ఆయుధం | Sakshi
Sakshi News home page

పాలకుల చేతి ఆయుధం

Published Sun, May 8 2016 1:24 AM

పాలకుల చేతి ఆయుధం - Sakshi

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)నీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా దుర్వినియోగం చేశాయో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు  సోదాహరణంగా వివరించారు. ఆత్యయిక పరిస్థితి గురించి ప్రస్తావించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోదీని రకరకాల కేసులలో ఇరికించేందుకూ, ఆయనను బదనాం చేసేందుకూ సీబీఐని ప్రయోగించినట్టు ఆరోపించారు. కానీ అక్రమాలను దర్యాప్తు చేసే నెపంతో సీబీఐని సాధనంగా వినియోగించుకొని ఒక యువ నాయకుడిని వెంటబడి వేధించిన ఉదంతాన్ని చెప్పకుండా వదిలేశారు.
 
 అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ళ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పాలనకు చరమగీతం పాడి 2004లో కాంగ్రెస్ పార్టీని  అధికారంలోకి తెచ్చిన అసాధారణ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఒత్తిడి చేసినా ససేమిరా అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి 2009లో కాంగ్రెస్ పార్టీని రెండోసారి గెలిపించిన విజేత. రాష్ట్రం నుంచి 33 మంది సభ్యులను లోక్‌సభకు పంపించి యూపీఏ-2 ఏర్పాటును సుగమం చేసిన నేత. కాంగ్రెస్ అధిష్ఠాన దేవతకు ఆత్మీయుడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రజానాయకుడు. అటువంటి వ్యక్తి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన తర్వాత ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత వ్యవహరించిన తీరూ, అందుకు సీబీఐని వినియోగించిన రీతీ, టీడీపీ సహకరించిన విధం ఢిల్లీలో వెంకయ్య నాయుడు తనదైన శైలిలో వివరించి ఉంటే సోనియాగాంధీ అసలు స్వరూపం పూర్తిగా వెల్లడయ్యేది.
 
 కాంగ్రెస్ అధ్యక్షురాలి అభిమతాన్ని గౌరవించనందుకూ, ఆమెను ధిక్కరించి పార్టీ నుంచి నిష్ర్కమించినందుకూ, కొత్త పార్టీ పెట్టినందుకూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెల్లించిన మూల్యం పదహారు మాసాల కారాగారవాసం. శాసనసభ్యుడు శంకరరావు జగన్‌మోహన్ రెడ్డిపైన ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు లేఖ రాయడం,  పద్ధతి ప్రకారం పిటిషన్ వేయవలసిందిగా సలహా ఇవ్వడం, పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం, కొన్ని వాయిదాల తర్వాత టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేసి అదే కేసులో ఇంప్లీడ్ కావడం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రమే కాకుండా టీడీపీ నాయకత్వం కూడా ఉన్నట్టు అప్పట్లో పత్రికలలో వార్తలు వచ్చాయి. శంకరరావుకు అవసరమైన పత్రాలు అందింది టీడీపీ నుంచే అని చెప్పుకునేవారు. సోనియాగాంధీ అభీష్టం మేరకే ఈ లేఖలు రాశానంటూ శంకరరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ నిస్సార్ అహమ్మద్ కక్రూ కశ్మీరీ. ఆయన ఎక్కువగా కశ్మీర్‌లోనే ఉండేవారు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవారు. 2011 జూలైలో సాక్షి మీడియా సంస్థలలో పెట్టుబడులపైన సీబీఐతో ప్రాథమిక విచారణ జరిపించాలని జస్టిస్ కక్రూ, జస్టిస్ విలాస్ అఫ్జల్‌పూర్కర్‌తో కూడిన బెంచ్ నిర్ణయించింది.
 
 ద్వంద్వ ప్రమాణాలు
 హైకోర్టు ఆదేశం వెలువడిన పద్నాలుగు రోజులలోనే సీబీఐ హైకోర్టుకు మొదటి నివేదిక సమర్పించింది. ఒక్క మాసంలోనే దాడులూ, సోదాలూ, ఈడీ కేసూ వగైరా పనులన్నీ చకచకా జరిగిపోయాయి. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కార్యాలయం నుంచి అందే సమాచారంతో మీడియా చేసిన ప్రచారం హోరెత్తింది. 2012 మే చివరి వారంలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని ఆరో పిస్తూ చంద్రబాబు నాయుడిపైన జగన్‌మోహనరెడ్డి తల్లి విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు గులాం మహ మ్మద్,  నూతి రామమోహన రావులతో కూడిన బెంచ్ ఆరోపణలపై దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కానీ సిబ్బంది లేరనే సాకుతో సీబీఐ తాత్సారం చేసింది.
 
 ఈ లోగా సుప్రీంకోర్టుకు వెళ్ళిన చంద్రబాబునాయుడు అత్యున్నత న్యాయస్థానం ఆదేశంతో హైకోర్టుకు తిరిగి వచ్చి స్టే తెచ్చుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై విచారణ శరవేగంతో సాగించిన సీబీఐ చంద్రబాబు నాయుడికి అవసరమైన వెసులుబాటు కల్పించింది. హైకోర్టులో ‘నాట్ బిఫోర్’ సంప్రదాయాన్ని తెలివిగా వినియోగించుకొని తనకు అనుకూలమైన తీర్పు తెచ్చు కోగలిగారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారా యణను హైదరాబాద్‌లో ఏడు సంవత్సరాలపాటు కొనసాగించడం కూడా అసాధారణమే. గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. మారణహోమం జరిగింది. ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీకి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. జగన్ మోహన్‌రెడ్డి చేసిన అపరాధం ఒక్కటే- అధిష్ఠానదేవతను ధిక్కరించడం.
 
 శంకరరావూ, ఎర్రన్నాయుడూ, గజపతిరాజూ, సీబీఐ చేసిన ఆరోపణలు ఏవీ నిజ నిర్ధారణలో నిలబడజాలవని న్యాయప్రవీణుల అభిప్రాయం. కేవలం తన మాట కాదన్నందుకు ఒక యువ రాజకీయ నాయకుడిని అపఖ్యాతిపాలు చేసి, జైలులో పెట్టించి, కుటుంబ సభ్యులకు తీరని ఖేదం కలిగించిన సోనియాగాంధీ శుక్రవారంనాడు ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేస్తున్నదంటూ ధర్మాగ్రహం ప్రదర్శించడం విడ్డూరం. తన ప్రతిష్ఠను మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని వాపోవడం విచిత్రం. ఈ ఘటనల క్రమాన్ని వెంకయ్య నాయుడు పార్లమెంటులో వివరించి ఉంటే సీబీఐని యూపీఏ-2 ఎంతగా దుర్వినియోగం చేసిందో దేశప్రజలకు స్పష్టంగా తెలిసేది. సీబీఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని నిరూపించడానికి ఇంత బలమైన ఉదాహరణ ఉన్నప్పటికీ దానిని ప్రస్తావించకుండా ఉండటం వెనుక వెంకయ్యనాయుడి రాజకీయ ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. సీబీఐని ప్రత్యర్థులపైన ప్రయోగించారు కనుకనే కాంగ్రెస్ నాయకులు అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపైన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ, ఈడీల చేత సత్వరం దర్యాప్తు చేసి, దోషులను శిక్షించాలని కోరుతున్నారు.
 
 ఈ కోర్కెను తిరస్కరించినట్లయితే మోదీ ప్రభుత్వం కూడా సీబీఐని పావుగా వినియోగిం చాలని ప్రయత్నిస్తున్నదని భావించవలసి వస్తుంది. సీబీఐ విశ్వనీయత పట్ల దేశ ప్రజలలో సందేహాలు బలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సారథుల నిస్పాక్షికత పట్ల కూడా అనుమానాలు ఉన్నాయి. కనుక దాపరికం లేకుండా, రహస్య ఎజెండా లేకుండా అగస్టా కుంభకోణంపైన దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలనే సంకల్పం మోదీ ప్రభుత్వానికి ఉంటే సుప్రీంకోర్టు పర్య వేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలి.
 
 రక్షణమంత్రి మనోహర్ పరీకర్‌ది ఆత్మవిశ్వాసమో, మితిమీరిన విశ్వా సమో తెలియదు. బోఫోర్స్‌ను వదిలేసినట్టు అగస్టాను వదిలేది లేదంటూ పార్లమెంటు సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. రక్షణ శాఖ కొనుగోళ్ళకు సంబంధించి 1948 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఏ  కుంభకోణంలోనూ నిజం వెల్లడి కాలేదు. దోషులు ఎవరో దశాబ్దాలు గడిచినా  తేలలేదు. ఇప్పుడు పరీకర్ నిజనిర్థారణ చేయ గలరా?
 
 వరుస కుంభకోణాలు
 నెహ్రూ హయాంలో 1948లో జీపుల  కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌కు చెందిన ఒక కంపెనీ నుంచి 200 జీపులను సైన్యం కోసం కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. బ్రిటిష్ సంస్థ 155 జీపులు మాత్రమే సరఫరా చేసింది. తక్కిన జీపులు రాలేదు. ఈ లావాదేవీ విలువ అప్పట్లో 80 లక్షల రూపాయలు. నెహ్రూ మిత్రుడు కృష్ణమీనన్ ఆ సమయంలో లండన్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయనకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నదంటూ పార్ల మెంటులోనూ, పత్రికలలోనూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మిత్రుడిని రక్షిం చాడు నెహ్రూ. 1955లో కేసు మూసివేశారు.
 
 ఆ తర్వాత కృష్ణమీనన్ దేశ రక్షణ మంత్రిగా వ్యవహరించి 1961లో చైనా చేతిలో ఇండియా చావుదెబ్బ తినడానికి కారకులైనారు (జనరల్ కౌల్ రాసిన ‘ది హిమాలయన్ బ్లండర్’ చదవండి). 1987లో బోఫోర్స్ శతఘు్నల కుంభకోణం గురించి ఇప్పటికీ తరచుగా ప్రస్తావన వస్తూనే ఉంటుంది (ఈ వ్యవహారంలో పేరుమోసిన దళారి కట్రోకీ మిలాన్‌లో 2013లో మరణించాడు. అదే నగరంలోని కోర్టు  అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై 2016 ఏప్రిల్ 7న  తీర్పు ఇచ్చింది). రక్షణ శాఖ కొనుగోళ్ళలో కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకమే కాదు. మొదటి ఎన్‌డీఏ సర్కార్‌లో జార్జి ఫెర్నాండెస్ హయాం లోనూ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. బరాక్ క్షిపణుల కొనుగోలు వద్దంటూ ప్రధానికి శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల సలహా దారుడిగా వ్యవహరించిన అబ్దుల్ కలామ్ వారించినా  ఖాతరు చేయకుండా రూ. 1,150 కోట్లు ఖర్చు చేసి కొన్నారు. చాలా ఆలస్యంగా 2006లో సీబీఐ కేసు నమోదు చేసింది.
 
 సమతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే జైన్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల పార్థివదేహాలను వారి కుటుంబ సభ్యులకు పంపించేందుకు ఉద్దేశించిన శవపేటికల కొనుగోలులో గోల్‌మాల్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంట్రాక్టరుపైన కేసు పెట్టారు. ఆయుధాల కొనుగోలు వ్యవహారంలోనే తెహల్కా డాట్ కామ్ పరిశోధన చేసి మాటు వేసి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా నాటి భాజపా అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను పట్టిచ్చింది. తెహల్కా టేపులు విడుదల కాగానే రక్షణ మంత్రి ఫెర్నాండెస్ రాజీనామా చేశారు. దానిని ప్రధాని వాజపేయి ఆమోదించ లేదు.
 
 మిస్టర్ క్లీన్

 యూపీఏ-2లో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీకి మిస్టర్ క్లీన్ అని పేరుంది. సౌత్‌బ్లాక్‌లో తన కార్యాలయానికి వచ్చినవారికి టీ కూడా ఇవ్వరని ప్రతీతి. ఆయన ఆరు ఆయుధ వ్యాపార సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టారు. వీటిలో రెండు స్వదేశీ సంస్థలు, నాలుగు విదేశీ సంస్థలు. ఈ సంస్థల నుంచి లంచాలు తీసుకున్నాడనే ఆరోపణపైన ఆర్డినెన్స్ బోర్డు మాజీ డెరైక్టర్ సుదీప్తాఘోష్‌ను సీబీఐ 2009లో అరెస్టు చేసింది. టాట్రా ట్రక్కుల కొనుగోలుకు సహకరిస్తే 15 కోట్ల రూపాయల ముడుపు చెల్లిస్తామంటూ తన వద్దకు కొందరు దళారీలు వచ్చారంటూ జనరల్ వీకేసింగ్ (ప్రస్తుత కేంద్ర మంత్రి) ఆరోపించారు. ఇన్ని కుంభకోణాలు జరిగినట్టు తెలిసినా, సీబీఐ దర్యాప్తు ఎన్నేళ్ళు జరిపినా ఎవరు ముడుపులు స్వీకరించారో ఇంతవరకూ నిర్ధారణ కాలేదు. బోఫోర్సు వ్యవహారం స్వీడన్ రేడియో ద్వారా తెలిసింది. అగస్టా సంగతి మిలాన్ పత్రిక ద్వారా ప్రపంచం దృష్టికి వచ్చింది. రెండు కుంభకోణాలలోనూ అనుమానాలు సోనియాగాంధీపైనే.
 
 సోనియాపైన ఆరోపణలు చేసే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేని భాజపా గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ) బిల్లుపైన కాంగ్రెస్ సహకారంకోసం ప్రయత్నించాలన్న సంకల్పానికి స్వస్తి చెప్పింది. కాంగ్రెస్ నాయకత్వంపైన దాడి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ వ్యవహా రంలోనూ నిజానిజాలు ఇప్పట్లో తేలవు. ఎప్పటికీ ఏదీ రుజువు కాకపోవచ్చు.

కానీ అనుమానాలు బలపడే విధంగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణాన్ని ఉపయోగించుకోవాలన్నది భాజపా నాయకత్వం ఎత్తుగడ. వచ్చే సంవత్సరం జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల దాకా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసి కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా చేయాలని నరేంద్ర మోదీ, అమిత్ షాల వ్యూహం. అత్యుత్సాహంతో సోనియాగాంధీని అరెస్టు చేస్తే లోగడ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో దేశీయాంగ మంత్రిగా ఉండిన చరణ్‌సింగ్ ఇందిరాగాంధీని అరెస్టు చేసి ఆమె రాజకీయ పునరుత్థానానికి దోహదం చేసిన  చారిత్రక తప్పిదమే పునరావృత్తం అవుతుందంటూ కొందరు బీజేపీ నాయకులే హెచ్చరిస్తున్నారు. అవధులు దాటిన ఆవేశం అనర్థ హేతువు.
 - కె.రామచంద్రమూర్తి
సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌

 

Advertisement
Advertisement