Sakshi News home page

నిపుణుల తరం, దేశానికి వరం

Published Wed, Dec 17 2014 3:55 AM

నిపుణుల తరం, దేశానికి వరం

సమష్టి సంపదను పెంచాలంటే సామాన్యుడిపై పెట్టే ఖర్చు పెరగాలి. అట్టడుగున ఉన్న యువశక్తికి ఊతమివ్వాలి. వారి జ్ఞానానికి వెలుగునివ్వాలి. కాబట్టి, జాతి వనరులను పెట్టుబడిదారుడి మీద వెచ్చిస్తారా? దేశ పురోగమనా నికి దోహదపడే సాధారణ ప్రజానీకం నైపుణ్యం పెంపు కోసం ఖర్చు చేస్తారా? అనేవి నేడు సవాళ్లుగా ఉన్నాయి.
 
 దేశం ఎదుర్కొంటున్న ఈ దశాబ్దపు సవాళ్లలో యువశక్తిని వినియోగించుకోవడమే అత్యంత కీలకమైనది. మన జనాభాలో దాదాపు సగభాగం ఉన్న నవ యువత నైపు ణ్యాలను వినియోగించుకు నేందుకు ఉన్న ఏకైక సాధనం విద్యే. సామాజిక, ఆర్థికాభివృద్ధికి నోచుకోని యువకులను నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి కల్పిస్తే వారి శ్రమ దేశ సంపదగా మారే అవకాశం ఉంటుంది. యువశక్తిని ఆర్థికాభివృద్ధికి జోడిస్తేనే మరింత దేశ ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే పరిణా మాలు విపరీతంగా ఉంటాయి.
 
 21వ శతాబ్దంలో భారతదేశాభివృద్ధికి ఇది సరైన సమయం. దీనిని జార విడుచుకుంటే మరో పదేళ్లలో ఈ యువతరం శక్తి వృథా అవుతుంది. ఇదే జరిగితే యదేశ సామాజిక, ఆర్థికాభివృద్ధి వెనుకబడడానికి దోహదం చేసినట్టే. 20వ శతా బ్దంలో మానవ సంపద పెరుగుదలను ఒక శాపం గా పరిగణించారు. అదే ఈ శతాబ్దంలో వరంగా భావిస్తున్నారు.
 
 ఈ కోణం నుంచి చూస్తే ఏ దేశా నికి లేని అవకాశం మనకు ఉంది. ఈ యువశక్తిని నైపుణ్యం కలిగిన వనరుగా రూపొందించుకోవాలి. అలాగే నైపుణ్యం లేని మానవవనరులు దేశానికి భారమేనన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి. అందు కే ప్రపంచ దేశాలు ప్రజలను నిపుణులుగా తీర్చి దిద్దడానికి పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నాయి. నిజానికి సమాజాన్ని నిజమైన, నైపుణ్యం కలిగిన మానవ వనరుగా తీర్చిదిద్దడమంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే. అప్పుడే విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా మారే అవకాశం ఉంటుంది. దానితోనే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
 
చదువును పెట్టుబడిదారులకు అప్పగిస్తే వారు లాభార్జనే ధ్యేయంగా ఆ గొప్ప వ్యవస్థను వ్యాపారంగా మారుస్తారు. క్యూబా, లాటిన్ అమెరికా, స్విట్జర్లాండ్, పోలెండ్ వంటి కొన్ని దేశాలు తమ వనరులను, యావత్ శక్తియుక్తులను విద్య కోసం వెచ్చించాయి. మరొక వైపున అమెరి కాలో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి వాటిని పెట్టుబడిదారులకు అప్పగించారు. ఇందువల్ల లాభాలు పెరిగాయి. కానీ సామాన్యులు, సంపన్న లు మధ్య అంతరం పెరిగింది.
 
 పెట్టుబడిదారుడి చదువును ప్రోత్సహిస్తే పెరిగేవి అంతరాలే. దీనిని గుర్తించి చర్యలు తీసుకున్న కొన్ని దేశాలు ముందుకు వెళుతున్నాయి. సమష్టి సంపదను పెంచాలంటే సామాన్యుడిపై పెట్టే ఖర్చు పెరగాలి. అట్టడుగున ఉన్న యువశక్తికి ఊతమివ్వాలి. వారి జ్ఞానానికి వెలుగునివ్వాలి. కాబట్టి, జాతి వనరులను పెట్టుబడిదారుడి మీద వెచ్చిస్తారా? దేశ పురోగమనానికి దోహదపడే సాధారణ ప్రజానీకం నైపుణ్యం పెంపు కోసం ఖర్చు చేస్తారా? అనేవి నేడు భారత పాలకుల ముందు సవాళ్లుగా ఉన్నాయి. నేటి సమాజంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజలు 80 శాతం మించి ఉన్నారు. కాబట్టి పాలకులు ఎటు మొగ్గుతారోనన్న అంశం కీలకమే.
 
 సమష్టి సంపదను పెంచాలంటే సమష్టి క్యాపిటల్ తయారు కావాలి. అది కూడా నైపుణ్యం కలిగిన క్యాపిటల్ అయి ఉండాలి. అందుకే విద్యారంగాన్ని ఎవరికి అప్పగిస్తారన్నది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి పేద వర్గాలను నైపుణ్యం కలిగిన వనరుగా మార్చడం ఒక దశాబ్దంలో పూర్తయ్యే పని కాదు. శతాబ్దాలు గా పీడనకు గురైన వర్గం, మిగిలిన వర్గాలను అందిపుచ్చుకోవాలంటే వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అందుకే సమానత్వం సాధ్యమ య్యేవరకు రిజర్వేషన్లు తప్పవు. 21వ శతాబ్దంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన పరిశ్రమ లన్నీ సంపన్న వర్గం చేతికి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం నుంచి సాంకేతిక రంగానికి మళ్లడం ఇందుకు ప్రధాన కారణం. అదే ఇతర దేశాలలో వ్యవసాయం నుంచి పారిశ్రామిక వ్యవస్థకు మళ్లారు. దాని నుంచి సాంకేతిక రంగం వైపు పయనించారు.
 
కార్మిక రంగం నుంచి ఎదిగిన పారిశ్రామిక వర్గంలో ప్రజాస్వామిక భావజాలం ఉంటుంది. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి నేరుగా సాంకేతిక యుగం వైపు అడుగులు వేసిన భారత్ వంటి దేశాలలో ఫ్యూడల్ భావజాలం కనిపిస్తుం ది. ఈ చారిత్రక సంధ్యలోనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం, దీక్ష కలిగిన నాయకులు అవసరం. సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు పీడిత వర్గానికి అప్పుడే అందుతాయి. కానీ ఈ తత్వం మీద విశ్వాసం కలిగిన పాలకవర్గం రావడం కష్టం. కాబట్టి సాంకేతిక యుగం ఫలితాలు పీడిత ప్రజా నీకం అందుకోవాలంటే స్వాతంత్య్ర పోరాటాన్ని మించిన పోరాటం అవసరం. సమ్మిళిత వృద్ధి సాధ్యమయ్యేది అప్పుడే. ఈ పదేళ్లలో దీనిని సాధించకుంటే యువత శక్తిసామర్థ్యాలు వృథా అవుతాయి. వారిలో నిస్పృహ పెరుగుతుంది. అది ఎటు ప్రయాణిస్తుందో అనూహ్యం. కాబట్టి ముందే మేల్కొని నూటికి 90 శాతంగా ఉన్న ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని విస్తరించాలి.
- (వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)
 చుక్కా రామయ్య

Advertisement
Advertisement