చినుకు పూల చెట్టు | Sakshi
Sakshi News home page

చినుకు పూల చెట్టు

Published Sun, Jul 17 2016 11:28 PM

చినుకు పూల చెట్టు - Sakshi

 సినుకు పూలు జల్లి సిగురు కొమ్మ సరసమాడె.
 కరిగిపోయిన సీకటి కాటుక ముఖాన్ని కడుక్కొని
 తెట్టన తెల్లారింది మొగులు.
 భుజాల మీద పొడెండ మెరువంగ
 కోండ్రేస్తూ అతడు.
 తూరుపున మొలిసిన పొద్దును సిగనిండా ముడిసి
 విత్తనాలు చల్లుతూ ఆమె!
 తలపుల తలనిండా పంటను మోసుకుంటూ
 కలె దున్నిన దుక్కిలో వాళ్లు.
 అలసిన శ్రమ దేహాలను
 ఆదమరపి నిదురపుచ్చె భూమి!
 - తైదల అంజయ్య
 9866862983
 
 అంకురం
 నా బాల్యం నుంచీ ఇంటా, బయటా మాతృభాష మీద దండయాత్రలు జరిగాయి. నాటి నిజాం ప్రభుత్వం ఉర్దూను బోధనా భాషగా నిర్ణయించింది. బడిలో ఉర్దూలోనే బోధన. ఇక ఇంట్లో మా నాయనగారు సంస్కృతంలోనే మాట్లాడేవారు. తెలుగులో మాట్లాడితే మైలపడి పోతానేమో అని భయపడే ఛాందసుడాయన.
 
 ‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్’’ అనడానికి ‘‘త్వంకుత్ర గచ్ఛసి’’ అనేవారు! నాకు సంస్కృతం మీద గౌరవమే గాని, ఇంతటి ఛాందసం నాకు నచ్చేది కాదు. ఇక మదర్సా బడిలో ఉర్దూలో ప్రార్థనతో మా దినచర్య ప్రారంభమయ్యేది. (‘‘ప్రళయకాలం వరకూ పరమేశ్వరుడు ఈ రాజ్యాన్ని (హైదరాబాదు) సుస్థిరంగా వుంచుగాక.’’) ‘‘తాబద్ ఖాలిఖె ఆలం, యెరియాసత్క్ఖ్రే’’ అనే పల్లవితో ఈ ప్రార్థనాగీతం ప్రారంభమయ్యేది. ఏడుస్తూ ఈ ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసేవారితో గొంతు కలపని వారిని కొట్టేవాడు హెడ్ మాస్టరు. అలా దెబ్బలు తిన్నవాళ్ళలో నేనొకణ్ణి. ఇలా ఇంటా, బయటా నా బాల్యంలో తెలుగు మీద దండయాత్రలు ప్రారంభమయ్యాయి. నేను ఇంట్లోను, బడిలోను ఎదురు తిరగవలసి వచ్చేది. నాలో తిరుగుబాటు బీజాలు ఆ విధంగా నాటుకున్నాయి.
     (‘యాత్రాస్మృతి’లోంచి)
 -  జూలై 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి
 
 పద్యంలా
 కాళ్లకిందకు పడకుండా
 పరికిణీని
 ఒద్దికగా కొంచెమంటే కొంచెమే పెకైత్తి
 ఆమె అతడ్ని పువ్వులా
 కోసుకెళ్తుంది పెరట్లోంచి
 వాకిట్లో అరుగుపై
 బోర్లా పడుకుని నల్లని
 ఆకాశం పడిపోయిన అతని కంట్లో
 తన నవ్వుల్నే పదే పదే
 అటు ఇటు దొర్లిస్తూ ఆడుకుంటుంది
 ఇన్నాళ్లు కురవగా
 అలసిన వానలావున్న అతడి గుండెలపై
 వెన్నెల వెలుతుర్లో చెరువులా
 ఆమె నిశ్శబ్దంగా
 తలాన్చి పడుకున్నాక
 అతడు తడిరెక్కలతోవున్న గువ్వలా
 బయటికొచ్చి
 ఆమెనొక పద్యంలా
 దాచేస్తాడు ఇంట్లోనే    
 - సత్యగోపి
 8500845710
 
 కొత్త రంగుల దారుల్లో
 నువ్వొక విప్పారిన పూర్ణచందమామవి
 నీ నిగూఢత్వం తెలియని చిన్నపిల్లలాగే నిరభ్యంతరంగా
 వాత్సల్య మనోయింద్రధనస్సునైనను
 అచ్చంగా నీకివ్వాలని
 వెన్నెలపై సప్తవర్ణాలు వెలవెలేనన్నావు
 అద్దుడు కాగితపు పంజరంలో
 యింకిపోయిన రంగుల వాత్సల్య స్వప్నాలని
 తిరిగి వెతుక్కొంటూ...
 - కుప్పిలి పద్మ
 
 ఈవెంట్
 మల్లెమాల సాహిత్య పురస్కారాలు
 2009 నుండీ ప్రదానం చేస్తున్న ‘మల్లెమాల సాహిత్య పురస్కారం’ను ఈ ఏడాది పాలగిరి విశ్వప్రసాద్‌కు ఇస్తున్నట్టు మల్లెమాల వేణుగోపాలరెడ్డి తెలియజేస్తున్నారు. 2015లో కాత్యాయనీ విద్మహేకు ఈ పురస్కారాన్ని ప్రకటించీ ప్రదాన సభ జరపనందున, ఇరువురికీ ఈ జూలై 24న ఉదయం 9:30కు హరిత ఆడిటోరియం, ఎస్పీ బంగ్లా ఎదుట, కడపలో పురస్కార ప్రదానం చేయనున్నారు. షేక్ హుస్సేన్ సత్యాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి, పొత్తూరి సుబ్బారావు, మధురాంతకం నరేంద్ర, ఎన్.దాదాహయత్, వి.ప్రతిమ, ఆవుల రామచంద్రయ్య, అబ్బిగారి రాజేంద్రప్రసాద్, అలపర్తి పిచ్చయ్య చౌదరి, జానమద్ది విజయభాస్కర్ పాల్గొంటారు.
 
 ముస్లిం అస్తిత్వ సాహిత్య సదస్సు
 ‘బాబ్రీ విధ్వంసం అనంతర తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్యం’ అంశంపై జూలై 24న ప్రకాశం జిల్లా ఒంగోలులో సదస్సు జరగనుంది. బహుజన రచయితల వేదిక, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం చైతన్య వేదికల ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పత్ర సమర్పణ, కవి సమ్మేళనం, కొన్ని పుస్తకాల ఆవిష్కరణ ఉంటాయి. ఇందులో- ఖాదర్ మొహియుద్దీన్, ఉషా ఎస్.డానీ, సయ్యద్ నశీర్ అహ్మద్, సలీం సయ్యద్, యాకూబ్, చల్లపల్లి స్వరూపారాణి, షాజహానా, కరీముల్లా, స్కైబాబ, అన్వర్, షమీవుల్లా, ఇనాయతుల్లా, రెహానా, ఖాజా, దోనెంపూడి నారాయణరావు, కోయి కోటేశ్వరరావు, దాసోజు లలిత, మల్లవరపు ప్రభాకరరావు పాల్గొంటారు.
 
 చిత్రకూటమి యాత్ర
 ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలూ, తోవపొడవునా అనేక గిరిజన గ్రామాలూ వారి మౌఖిక సాహిత్యం, ముఖ్యంగా బాలల సాంస్కృతిక విశేషాల పట్ల ఆసక్తితో ఆగస్ట్ 13, 14, 15 తేదీల్లో 60 మంది రచయితలు, విద్యార్థులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తలపెట్టిన యాత్ర ‘చిత్రకూటమి’. విశాఖసముద్రం నుంచి బయల్దేరి విజయనగరం, సాలూరు, సుంకి ఘాట్, కోరాపుట్, జైపూర్, జగదల్‌పూర్ మీదుగా చిత్రకూట్ జలపాతాలని ముట్టివచ్చే ఈ యాత్రని ప్రరవే(ఏపీ), మహిళా చేతన, సంస్కృతి గ్లోబల్ స్కూల్, తెలుగు రీడర్స్ క్లబ్, 10 టీవీ అక్షరం సమన్వయం చేస్తున్నాయి. ఈ సందర్భంగా అధ్యయనం కోసం గోండులు, గదబలు, సంతాలీలు, సవరబాలల మౌఖిక సాహిత్యం గురించిన సమాచారాన్ని telugu.elibrary@gmail.com కు పంపాల్సిందిగా బృంద సభ్యులు కె.ఎన్.మల్లీశ్వరి, కె.పద్మ విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 సొరాజ్జెం పుస్తకావిష్కరణ
 అక్కినేని కుటుంబరావు తెలుగు రచన ‘సొరాజ్జెం’ను అల్లాడి ఉమ, ఎం.శ్రీధర్ అదే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. ప్రచురణ: ఓరియంట్ బ్లాక్‌స్వాన్. ఈ పుస్తకావిష్కరణ జూలై 23న సాయంత్రం 5:30కి విద్యారణ్య హైస్కూల్, గ్రీన్ గేట్స్, సైఫాబాద్, హైదరాబాద్‌లో జరగనుంది. కె.సునీతా రాణి, గోపాల్ గురు, కల్పన కన్నబీరన్, సౌజన్య తమలపాకుల పాల్గొంటారు.
 
 కైతల కవాతు పుస్తకావిష్కరణ
 తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో- కైతల కవాతు(తెలంగాణ జన విముక్తి గీతాలు) పుస్తకావిష్కరణ సభ జూలై 24న పగలు 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరగనుంది. జయధీర్ తిరుమలరావు, కేశవరావు జాదవ్, కుదురుపాక రాజవ్వ, చుక్కా రామయ్య, విమలక్క, పాశం యాదగిరి, తెలిదేవర భానుమూర్తి, మోహన్ బైరాగి, ఎ.కె.ప్రభాకర్, బి.నర్సన్ పాల్గొంటారు.
 
 కోడూరి పుస్తకాలావిష్కరణ
 కోడూరి శ్రీరామమూర్తి రచనలు ‘మహాత్ముడు- పర్యావరణము’, ‘సాహిత్యానుభూతి’ ఆవిష్కరణ సభ జూలై 31న ఆనం రోటరీ హాలు, వై జంక్షన్ వద్ద, రాజమండ్రిలో సాయంత్రం 5:30కు జరగనుంది. ఆవిష్కర్త: తుర్లపాటి కుటుంబరావు. పుస్తకాల పరిచయం: ఆర్.ఎస్.వేంకటేశ్వరరావు, తల్లావఝుల పతంజలి శాస్త్రి, నండూరి రాజగోపాల్. పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎండ్లూరి సుధాకర్, తుమ్మిడి రామ్‌కుమార్, పట్టపగలు వెంకటరావు పాల్గొంటారు. నిర్వహణ: కళాగౌతమి.
 
 కొత్త పుస్తకాలు
 కాన్పుల దిబ్బ
 కథకుడు: చింతకింది శ్రీనివాసరావు; పేజీలు: 124; వెల: 110; ప్రతులకు: శ్రీనిజ ప్రచురణలు, 6-60/1, రవీంద్రనగర్, ఓల్డ్ డైరీ ఫామ్, విశాఖపట్నం-530040; ఫోన్: 8897147067
 చింతకింది రెండో కథాసంపుటి ఇది. ఇందులో 10 కథలున్నాయి. ‘‘దాలప్పతీర్థం’ కంటే ఈ కథలు ఒక పరిపక్వదశలో వచ్చినవి. తనెక్కడుండి, ఎవరిపక్షం వహించి మాట్లాడుతున్నాడో స్పష్టంగా చెబుతాయి’. ‘కళింగాంధ్ర స్థానీయ జీవితాల చుట్టూ తిరుగుతూనే ప్రపంచాన్ని చుట్టివస్తున్నాయీ కథలు. లోకంలోని చీకటి వెలుగులన్నింటినీ తడుముతున్నాయి’. ‘చింతకింది కథలో ఉత్తరాంధ్ర మాండలికం ఒక పాత్రగా కలగలసిపోయింది. పాత్రోచిత మాండలిక భాషా వైవిధ్యమంతా ఈ కథల్లో ప్రాణం పోసుకుంది’.
 
 శికారి
 కథకుడు: పర్కపెల్లి యాదగిరి; పేజీలు: 116; వెల: 120; ప్రతులకు: 1-1-94/4ఎ, నెహ్రూపార్క్ దగ్గర, 2వ అంతస్థు, సిద్దిపేట; ఫోన్: 9299909516
 ‘తెలంగాణ అట్టడుగు జీవితాల గురించి రాసిన పది కథలు ఇవి’. ‘ఆర్థిక సంస్కరణల అమలు తొలి దశ దాటి, రెండో దశలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఉత్పాదక రంగానికి ప్రాధాన్యం తగ్గి, అనుత్పాదక రంగానికి ప్రాధాన్యం పెరగడమనే లక్షణం సమాజంలో ఏ విధమైన అసమానతలకు దారి తీస్తుందో, ప్రజలను ఏ విధంగా పరాయీకరణకు గురి చేస్తుందో ఆయన కథలన్నీ చెబుతాయి’. ‘తెలంగాణ భాషను ఎంత పఠనయోగ్యంగా, రుచీపచీ ఉండేట్లుగా వాడవచ్చునో ఆయన కథలను చదివితే అర్థమవుతుంది’.
 
 వైష్ణవ సాక్షి
 రచన: పానుగంటి లక్ష్మీనరసింహారావు; సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ; ప్రచురణ: సంస్కృతి; పేజీలు: 104; వెల: 70; ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, ఫోన్: 040-24652387
 
 ‘పంతులుగారు సాక్షి వ్యాసాల రచయితగా ఆధునిక తెలుగు సాహిత్యాకాశంలో ధగధగ మెరిసేతార. సాక్షి వ్యాసాలలో వైష్ణవ సంబంధ వ్యాసాల సంకలనమే ఈ గ్రంథం’. వ్యాసాలకు అవసరమైన చోటల్లా విలువైన పాదసూచికలు ఇచ్చారు. వైష్ణవం పేరుమీద వచ్చిన సామెతలు, జాతీయాలు అనుబంధంలో చేర్చారు. వాసు చిత్రాలు అదనపు ఆకర్షణ!
 
 వాళ్లు
 రచన: భువనచంద్ర; పేజీలు: 264; వెల: 125; ప్రతులకు: 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2; ఫోన్: 0866-2436642
 ‘ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా?’ అని తనను వేధించిన ప్రశ్నకు ఒక సంతృప్తికర సమాధానాన్ని వెతుక్కుంటూ రచయిత తన యౌవన కాలంలో సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణమే ఈ పుస్తకం. పాదచారి అనే కలంపేరుతో స్వప్న మాసపత్రికలో భువనచంద్ర ధారావాహికగా రాసిన ఈ ‘అలౌకిక ప్రపంచ దర్శ’నాన్ని ‘సాహితి ప్రచురణలు’ పుస్తకంగా తెచ్చింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement