‘నేను’ అనే వైరస్ | Sakshi
Sakshi News home page

‘నేను’ అనే వైరస్

Published Thu, Sep 8 2016 2:01 AM

గొల్లపూడి మారుతీరావు - Sakshi

‘‘చరిత్రలో నేను కాదు ఉండాల్సింది - ఈ దేశం. ఈ దేశపు వైభవం. 1.20 బిలియన్ల భారతీయ ప్రజల మధ్య మోదీ కూడా ఒక మామూలు మనిషే’’ అన్న ఒక ప్రధాని గురించి ఈ కాలమ్.
 
ఇది రాజకీయాలకు సంబం ధించిన కాలమ్ కాదు. రాజ కీయ నాయకులకు సంబం ధించిన కాలమ్ అంతకంటే కాదు. అయితే ఇది నరేంద్ర మోదీ గురించి చెప్పబోయే కాలమ్. కనుకనే ఈ రెండు వాక్యాలూ ముందు చెప్పవ లసి వచ్చింది. మొన్న ఒక ఇంగ్లిష్ చానల్ ఇంటర్వ్యూలో మోదీని ఒక ప్రశ్న వేశారు: రాబోయే కాలంలో చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? అని. ఇది మనం తరచూ వినే ప్రశ్న. రాజకీయ నాయకుల సమాధా నాలూ మనకి వినడం అలవాటయిపోయింది.

కాని నరేంద్ర మోదీ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మించి - దిగ్భ్రాంతుణ్ణి చేసింది. సారాంశం ఇది. ‘‘చరిత్ర నన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి? మోదీ ఈ దేశంలోని 1.20 బిలి యన్ల భారతీయులలో ఒకడు. నన్ను కాదు-చరిత్ర ఈ దేశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేశానికి జరిగిన మేలుని గుర్తుంచుకో వాలి’’- స్థూలంగా ఇదీ సమా ధానం.
 
మన ముఖ్యమంత్రి గారు- ‘‘మీరంతా గర్వపడే స్థాయిలో మీ నగరాన్ని వద్ధి చేస్తాను. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి రైతులకు లక్షా ఏభైవేల ఎకరాలకు నీళ్లు ఇప్పిస్తాను. చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తాను’’ అనడం మనం తరచూ వింటున్నాం. అది తప్పుకాదు. ఒక mindsetకి నిదర్శనం. అంతే. కానీ దక్షిణాఫ్రికాలో తనలాంటి బడుగు వర్గాలకు జరిగే వివక్షను ఎదిరించిన  ఓ న్యాయవాది అలనాడు - చరిత్ర గురించి ఆలోచిస్తే - చరిత్ర ఆయన్ని ‘మహా త్ముడు’గా గుర్తుంచుకునేది కాదు.
 
గొంతు విప్పే స్థాయిలో కేవలం ఒక తపస్సుగా ఒక జీవితకాలం తన సంగీత సాధనని కొనసాగించకపోతే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అనే భారతరత్నని దేశం గౌరవించి ఉండేదికాదు. ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణంలో సింధు అనే 21 సంవత్సరాల పిల్ల ఒలింపిక్స్‌లో ‘నేను’ ఈ దేశానికి కీర్తిని తీసుకు రాబోతున్నాను- అని ఒక్క క్షణం అనుకున్నా పాతాళానికి కుంగిపోయేది.
 
ఈ వారమే ఒక మహోన్నతమైన ‘శక్తి’ని - మదర్ థెరిసాని- దేవదూతగా రోమ్ వాటికన్‌లో సెయింట్ పీటర్స్ బిసిల్కాలో పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. బడు గువర్గాల పట్ల, పేదల పట్ల ఆమె చూపిన నిరవధికమైన ప్రేమాభిమానాలు ప్రపంచాన్ని- సామాజిక, ఆధ్యాత్మిక రంగాలను పులకితం చేశాయి. ‘నేను’ అనే మాట ఆమె టిప్పణిలో లేదు. ఆమె రాష్ట్రపతి భవన్‌లో పద్మశ్రీ పుర స్కారాన్ని పుచ్చుకోవడాన్ని నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ వివరించారు.
 
మదర్ పద్మశ్రీ పురస్కారాన్ని ఒక రోగిష్టి బిడ్డని పొదివి పట్టుకున్నట్టు, ఆఖరిక్షణాలలో ఉన్న దీనుడిని భుజానికి ఎత్తుకున్నట్టు అందుకున్నా రట. ఇస్తున్న రాష్ట్రపతి కన్నుల్లో, చూస్తున్న ప్రేక్షకుల కన్నుల్లో నీళ్లు నిండాయి. తర్వాత కారులో నెహ్రూని ఆమె అడిగారట - నీకెలా అనిపించింది? అని. ‘నువ్వెలా భావించావో కానీ - కంటినీళ్లు ఆపుకోవడం నాకు చాలా కష్టమయింది’ అన్నారట నెహ్రూ. ‘నేను’ అనే భావనని పూర్తిగా తన మనసులో నుంచి ఖాళీ చేసుకుని ఒక పరిపూర్ణమయిన ‘శూన్యం’గా మారిన అరుదయిన, అసామాన్యమయిన వ్యక్తిత్వం మదర్ థెరిసా అన్నాడొక పాత్రికేయుడు.
 
ఇప్పుడు మళ్లీ నరేంద్ర మోదీ దగ్గరికి.  There is no greater joy than to be lost in the history- అన్నారాయన. నేను ప్రధాన మంత్రి గురించి రాయడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుని గురించి రాయడం లేదు. మళ్లీ- ఇది రాజకీయ కాలమ్ కాదు. కాని తను చేసే కషిలో, సేవలో, సాధనలో, లక్ష్యంలో, దక్ప థంలో, ఆదర్శంలో, దష్టిలో ‘నేను’ - ‘చరిత్ర’ అనే రెండు దురాశలు- ఏమాత్రం దొంగ తోవన ప్రవేశించినా- వారు ఆ చరిత్రకు దగ్గరికి కూడా రాలేనంత దూరంగా నిలిచి పోతారు.
 
ఈ దేశంలో కుష్టురోగిని తన ఒళ్లో పెట్టుకుని ‘చావులో ఇంత ఆనందం ఉందా!’ అనిపించేలాగ ప్రేమని పంచిన ఒక దేవదూత గురించి, ఒక జీవితకాలం తన సాధనతో లక్షలాది హదయాలని తాకిన ఒక భారతరత్న గురించి, ‘‘చరిత్రలో నేను కాదు ఉండాల్సింది - ఈ దేశం. ఈ దేశపు వైభవం. 1.20 బిలియన్ల భారతీయ ప్రజల మధ్య మోదీ కూడా ఒక మామూలు మనిషే’’ అన్న ఒక ప్రధాని గురించి ఈ కాలమ్.

రాజకీయ నాయకులు, పార్టీల వారికి ఈ కాలమ్ వెక్కిరింతగానూ, భజన చేసే ప్రయత్నంగానూ కని పించవచ్చు. కానీ దక్షిణాఫ్రికాలో ఓ అర్ధరాత్రి పీటర్ మారిట్స్‌బర్గ్‌లో ఫ్లాట్‌ఫారం మీదకు తెల్ల అధికారి మెడ పట్టుకు గెంటిన క్షణంలో ఓ నల్ల లాయరు చరిత్ర గురించి ఆలోచించలేదు. తన జాతికి జరుగుతున్న ‘అవమానం’ గురించే ఆలోచించాడు. కనుకనే చరిత్ర అయ్యాడు. చరిత్ర మానవ ప్రయత్నానికి అతి కర్కశమయిన వడపోత. ‘నేను’ అన్న ఆలోచన వచ్చిన మరుక్షణంలో అది నిర్దాక్షిణ్యంగా సెలవు తీసుకుంటుంది.

Advertisement
Advertisement