అల్లారఖాకు గూగుల్ ఘననివాళి | Sakshi
Sakshi News home page

అల్లారఖాకు గూగుల్ ఘననివాళి

Published Tue, Apr 29 2014 4:35 PM

అల్లారఖాకు గూగుల్ ఘననివాళి

 ఈ రోజు అల్లారఖా 95 వ జయంతి. ఈ పండుగను ఇంటర్నెట్ సెర్చ్ టైటాన్ గూగుల్ ఎంతో సంబరంగా జరుపుతోంది. భారతీయ తబలా మేస్ట్రో ఉస్తాద్ అల్లారఖా జన్మదినాన్ని భారీగా జరిపింది గూగుల్. తబలా అనేది రెండు వస్తువులతో ఏర్పడే వాద్యపరికరం అనే విషయం తెలిసిందే. వాటిని ప్రతిబింబించేలా గూగుల్‌లో ఉండే రెండు సున్నాలను రూపొందించారు. ఇందులో ఉన్న ఎల్ అనే అక్షరం తప్ప మిగిలినవన్నిటినీ గుండ్రంగా తయారుచేశారు. అల్లారఖా 1919, ఏప్రిల్ 29 న జమ్ములోని ఫగ్వాల్‌లో జన్మించారు. ఆయన పూర్తి పేరు అల్లారఖా ఖురేషీ ఖాన్ సాహెబ్. ఆయన సితార్ విద్వాంసుడు రవిశంకర్‌కి ఎక్కువసార్లు వాద్యసహకారం అందించారు. తన మామయ్య గుర్‌దాస్‌పూర్‌తో ఉంటున్నప్పుడు అల్లారఖాకి 12 వ ఏట నుంచే తబలా నుంచి వచ్చే రిథమ్, శబ్దం అంటే ఆసక్తి కలిగిందట. తబలా మీద ఉండే ఆసక్తితో అల్లారఖా ఇంటి నుంచి పారిపోయి, పంజాబీ ఘరానాకి చెందిన మియాన్ ఖాదర్ భక్ష్ దగ్గర తబలా సాధన ప్రారంభించారు.

 అల్లారఖా తన  కెరీర్‌ను లాహోర్‌లో పక్కవాద్య కళాకారుడిగా ప్రారంభించారు. ఆ తరువాత 1940లో ముంబైలో ఆలిండియా రేడియోలో స్టాఫర్ అయ్యారు. ఉద్యోగంలో చేరిన మొదటి ఐదు సంవత్సరాలు తబలా సోలోగా వాయిస్తూ, దానిని ఎంతగానో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. 1943 - 48 మధ్య ప్రాంతంలో రెండు మూడు హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చారు.
 1977లో పద్మశ్రీ అవార్డు, 1982లో సంగీత నాటక అకాడెమీ అవార్డు, ఆయనను వరించాయి. 1985లో ముంబైలో ‘అల్లారఖా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్’ అనే సంస్థను ప్రారంభించారు. ఆయన ముగ్గురు కొడుకులు జాకీర్ హుస్సేన్, ఫజల్ ఖురేషీ, తౌషిఖ్ ఖురేషీ... వీరు కూడా తబలాలో ప్రావీణ్యత సాధించారు.
 వాహ్ తాజ్ అంటే జాకీర్ హుస్సేన్ తాజ్‌మహల్ టీ కి ప్రకటన ద్వారా అందరికీ సుపరిచితులే.
 అల్లారఖా ఫిబ్రవరి 3, 2000 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement