ఏమిటీ 'ముద్దు గోల' | Sakshi
Sakshi News home page

ఏమిటీ 'ముద్దు గోల'

Published Thu, Nov 6 2014 2:08 AM

ఏమిటీ 'ముద్దు గోల' - Sakshi

 ఇటీవల కేరళలో ప్రారంభమైన ముద్దుల గోల అవమానకరంగా ఉంది. ఏం సాధించాలని విద్యార్థులు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు? ఉద్యమాల బాట వీడి ముద్దుల బాట పడతామని వారు అనడం విచారకరం. కల్చరల్ పోలీసింగ్‌కు నిరసన తెలియచేయాలంటే ఇదా మార్గం? వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వేరే విధంగా నిరసన తెలియ చేయవచ్చు. వ్యక్తి స్వేచ్ఛకూ మతానికీ ముడిపెడితే దానికి కూడా అభ్యంతరం చెప్పవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ముద్దులు ఎందుకు పెట్టుకోవాలి? అప్పుడైనా ఎవరో అందమైన బాలిక దగ్గరే కుర్రకారు అంతా కనిపించింది తప్ప, మామూలు బాలికలు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కదా! పాల్గొన్నా వారిని అబ్బాయిలు ఆకర్షించలేదా? ఒకనాడు తమ మనోభావాలను వ్యక్తీకరించడానికి విద్యార్థులు గొప్ప ఉద్యమాలు చేశారు. సినిమాలలో ముద్దు సీన్లకు వ్యతిరేకంగా పోరాడివారే ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు భంగం పేరుతో బహిరంగ ముద్దులను ప్రేరేపించడం ఏమిటి? ఇదంతా విద్యార్థులలో, యువతలో తీవ్రంగా ఆలోచించగలిగే మనస్తత్వం నశించిపోవడమే. దీనిని సరిదిద్దాలి.
 బి. సాయికిరణ్  గుంటూరు
 
 నత్తనడకన 'బాబు'పాలన
 ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు నత్తనడకను తలపించింది. ఈ వ్యవధిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టకపోవడం దురదృష్టకరం.  రైతు రుణ మాఫీ అంటూ వాగ్దానాలను కురిపిం చి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు, ఆ దిశగా ఇప్పటికీ సుస్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఒక వైపు బ్యాంకర్ల ఒత్తిడి, మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు రుణాలు పొందాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు డ్వాక్రా రుణాలను లక్ష రూపాయల వరకే మాఫీ ప్రకటించారు. ఒక్కో గ్రూపులో పది మందికి పైగా సభ్యులున్న మహిళలకు దీని వల్ల ఒనగూరేది అంతంత మాత్రమే.  చౌక దుకాణ వస్తువుల సరఫ రాను గ్రామాల్లో 2 రోజులకు, పట్టణ, నగరాల్లో 3 రోజులకు కుదించడం హేయమైన చర్య. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆధార్ లేకపోయినా బియ్యం కోత పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల మనసెరిగి పాలించేందుకు సమాయత్తం కాచాలి.
 బట్టా రామకృష్ణదేవాంగ  శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
 
 న్యాయమే అయినా, సమస్యే
 ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండటం చాలా వరకు న్యాయమే. అయితే అక్కడ రాజధానిని నిర్మిస్తే మనకున్న భౌగోళిక స్థితి వల్ల చాలా వరకు పంట భూములను కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికి చాలా మంది రైతులు వ్యవసాయం లాభసాటిగా లేదంటున్నారు. మనిషిని బతికించేది ఆహారం. ఆ కొరత రానివ్వకుండా ఆంధ్ర అన్నపూర్ణగానే ఉండాలి. రాయలసీమ వాసులు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చాలా బాగుంది. వారి సూచనకు మౌలిక మార్పులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు. భారతదేశంలో చివరిసారిగా రెండు ముక్కలైంది మన తెలుగు రాష్ట్రమే ఇప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్రను చూసి నేర్చుకోవాలని మిగిలిన రాష్ట్రాలు అనుకోవాలి. ఈ విషయంలో నేతలు వినాయకులుగా మారకుండా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ ప్రత్యేకతను నిరూపించుకోవలసిందే! ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీర ప్రాంతం మనకు మాత్రమే ఉంది. ఒకరకంగా అదృష్టం.
 మైనేపల్లి సుబ్రహ్మణ్యం  ఆకునూరు, కృష్ణా జిల్లా

Advertisement
Advertisement