ఇది సకల జనుల సంక్రాంతి | Sakshi
Sakshi News home page

ఇది సకల జనుల సంక్రాంతి

Published Thu, Jan 15 2015 12:48 AM

మల్లెపల్లి లక్ష్మయ్య - Sakshi

ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం. ఆకలిని అంతమొందించి, ఆహార భద్రతను సాధించి పౌష్టికాహారాన్ని అందించడం, సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం రెండవ లక్ష్యం. ఆరోగ్యవంతమైన జీవితం, అన్ని వయసుల వారికి ఒక భరోసానివ్వడం అందరికీ మెరుగైన, నాణ్యమైన విద్యనందించడం, జీవితాంతం నైపుణ్యాలను సాధించే అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. అందరికీ పరిశుభ్రమైన నీటిని, పారిశుద్ధ్యాన్ని అందుబాటులో ఉంచడం ఈ లక్ష్యాలలో ముఖ్యమైనవి.

ఈ జనవరి 15వ తేదీ తెలుగువారి ముఖ్యమైన సంక్రాంతి పండుగ. రం గుల ముంగిళ్లలో తెలుగు వారంతా ఆశలూ ఆకాంక్షలూ కలబోసుకునే వేళ. అయితే , తెలుగు ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఏడాది, ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో విశ్వమంతా కలసి ఒక లక్ష్య ప్రకటన చేయబోతున్నది. సమాజాభివృద్ధికి ఇది కీలక సందర్భం.

అసమానతలను, పర్యావరణ విధ్వంసాలను, పెరిగిపోతున్న పేదరి కాన్ని తగ్గించడం, వీలైనంత నిర్మూలించడంవంటి సుస్థిర లక్ష్యాలను సాధిం చడానికి అంకితమవుతున్నట్టు ఈ రోజే ప్రపంచం చేత ఐరాస ప్రమాణం చేయించబోతోంది. నూతన సహస్రాబ్ది సందర్భంగా 2000 సంవత్సరంలో ఐరాస సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు ప్రకటించుకున్నది. పదిహేనేళ్ల అనంత రం వాటిని ఇప్పుడు సమీక్షించుకొంటోంది. మరింత వేగవంతంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు ఐరాస ఈరోజు ప్రతిన బూన బోతోంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో ఎనిమిది అంశాలు ఉంటే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పదిహేడు అంశాలున్నాయి. వీటిని సాధించే కృషిని ఆరంభించడానికి జనవరి 15, 2015నే ముహూర్తంగా నిశ్చయించుకున్నారు.

రేపటి పౌరుల నాయకత్వంలో ఉద్యమం

ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బొలీవియాలోని లజ్‌పజ్‌లో అన్ని వర్గాల, అన్ని వయసుల వారితో మూడు భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నా రు. కోస్టారికాలో యువజనులు సైకిల్ యాత్రలు చేపడుతున్నారు. భారత దేశంలో 15 సంవత్సరాల వయసున్న వారు పదిహేను మంది చొప్పున 15 రాష్ట్రాలలో ప్రభుత్వాధినేతలను కలిసి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వివరి స్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయి. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పదిహేనేళ్ల పిల్లలతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అం దులో ఈ లక్ష్యాల గురించి చర్చిస్తారు. నైజీరియాలో పదిహేను సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఆ దేశ ఆర్థికమంత్రి గోజి ఒకొంజోను కలిసి సంగీత కచేరి ద్వారా లక్ష్యాలను ఆవిష్కరిస్తారు. నార్వేలో ఆ దేశ ప్రధాని సోవ్ బెర్గ్‌ని కలిసి భవిష్యత్తులో ప్రజలందరూ భద్రత, రక్షణలతో జీవించే విధంగా చర్య లు తీసుకోవాలని కోరతారు. టాంజానియా, ఉగాండాలలో అక్కడి దేశాధినే తలను పదిహేనేళ్ల పిల్లలు కలిసి సుస్థిర అభివృద్ధి గురించి చర్చిస్తారు. బ్రిట న్‌లో ప్రధాని డేవిడ్ కామెరూన్, ప్రతిపక్ష నాయకులు ఎడ్ మిలీబాండ్‌లను కలిసి 2015 సంవత్సరం నుంచి యువతకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తారు.
 
ఈ కార్యక్రమాన్ని సమితి ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నది. పదింతల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ఈ సహస్రాబ్దిలో కూడా ప్రపంచంలో ఇంకా ప్రజలు ఆకలితో, పేదరికంతో, అసమానతలతో జీవించడంపట్ల ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో వంద కోట్ల మంది ప్రజలు అత్యంత దీనస్థితిలో నిరుపేదలుగా బతుకుతు న్నట్టు ఐరాస సర్వేలో వెల్లడైంది. అంటే ప్రపంచ జనాభాలో ఇది పదిహేడు శాతం. ఈ రోజు నుంచి 15 సంవత్సరాలలో అంటే, 2030 నాటికి ఆ సంఖ్య ను 36 కోట్లకు తగ్గించాలని, అంటే నాలుగు శాతానికి తీసుకురావాలని ఐరాస సంకల్పించింది. సుస్థిర అభివృద్ధి ఉద్యమంలో పేదరికాన్ని వీలైనంత మేరకు తగ్గించాలనేది ప్రధాన కార్యక్రమంగా ఎంచుకున్నారు. ఇందుకుగాను పది హేనేళ్ల నవయవ్వనులను నాయకులుగా, ప్రచార సారథులుగా ఎంచుకు న్నారు. ఎందుకంటే 2030 నాటికి వీరంతా బాధ్యతాయుతమైన తల్లిదండ్రు లుగా ఉంటారు. కనుక రేపటితరం ఆకలికీ, పేదరికానికీ గురికాకుండా చూసే బాధ్యత వీరికి అప్పగించడమే సబబు. ఇందులో పాల్గొంటున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్ బాలిక మలాలా మాట్లాడుతూ ‘యువతకు, బాలబాలికలకు మంచి సమాజాన్ని, భద్రతను కలిగించడానికి 2015 సంవ త్సరం నుంచయినా మనం మేల్కొనాలి. వీటిని సాధించడానికి మనమంతా భాగస్వాములం కావాలి. లేనట్టయితే సమాజంలోని అవకాశాలన్నీ వృథా అవుతాయి’ అని హెచ్చరించారు. 120 దేశాలలోని వేలాది సంస్థలు, సంఘా లు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించాయి.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలంటే...

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల స్థానంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను తీసుకు రావడానికి కారణమేమిటనేది ప్రశ్న. ఈ విషయంలో ఐరాస సమగ్ర అధ్య యనం చేసి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సమీక్షించింది. ఇందులో నాలుగు లోపాలున్నాయని నిర్ధారించింది.

హిందీ మాట్లాడే ప్రాంతం నుంచి ఈ ఉద్యమంలో పాల్గొనేవారిపై దృష్టి సారించలేదు.
ప్రజల్లోకి, ప్రభుత్వ సంస్థల్లోకి లక్ష్యాల స్ఫూర్తిని తీసుకెళ్లలేకపోయారు.
దీనికి హక్కుల దృక్పథాన్ని జోడించలేకపోయారు.
వీటికి నిర్దిష్టమైన బాధ్యతలను, బాధ్యులను నిర్ణయించలేకపోయారు.

అందువల్లనే ఈ రోజు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక దృష్టితో మరో సారి ప్రారంభించాల్సి వచ్చింది. ఇందులో 17 ప్రధాన లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉంటాయి. 70 దేశాలతో కూడిన కార్యాచరణ బృందం దీనిని రూపొందించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ఈ లక్ష్యాలను ఐరాస సభ్యదేశాలు ఆమోదించే విధంగా పౌర సమాజంలోని సంస్థలు, సంఘాలు చొరవ చూపాలని ఐరాస భావిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్‌లలో జరిగే రెండు కీలక సమావేశాల్లో ఈ లక్ష్యాలపై మరింత విస్తృతమైన చర్చ జరపాలని ఐరాస నిర్ణయించింది.

పేదరిక నిర్మూలనే ధ్యేయం

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ముసాయిదాను ఐరాస విడుదల చేసింది. అందులో 17 అంశాలున్నాయి. ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధా నలక్ష్యం. ఆకలిని అంతమొందించి, ఆహారభద్రతను సాధించి పౌష్టికాహారా న్ని అందించడం, సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం రెండవ లక్ష్యం. ఆరోగ్యవంతమైన జీవితం, అన్ని వయసుల వారికి ఒక భరోసానివ్వడం అందరికీ మెరుగైన, నాణ్యమైన విద్యనందించడం, జీవితాంతం నైపుణ్యాల ను సాధించే అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. పురుషు లతో పాటు మహిళలు సమానత్వాన్ని సాధించే దిశగా, మహిళలు, బాలికల్లో సాధికారతను సాధించడం, అందరికీ పరిశుభ్రమైన నీటిని, పారిశుద్ధ్యాన్ని అందుబాటులో ఉంచడం ఈ లక్ష్యాలలో ముఖ్యమైనవి. ఆధునిక ఇంధనా లను అందరికీ అందుబాటులోకి తేవడం, సుస్థిర, సమ్మిళిత, ఆర్థికాభివృద్ధిని సాధించడం, అందరికీ ఫలాలు అందించే పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్ట డం లాంటి మరికొన్ని లక్ష్యాలు కూడా ఉన్నాయి. దేశాల మధ్య అంతరాలను తగ్గించడం, నగరాలకు, ప్రజల ఆవాసాలకు తగు రక్షణ కల్పించడం, పర్యా వరణాన్ని కాపాడుకోవడం, మరికొన్ని లక్ష్యాలుగా ఉన్నాయి.

నిరాశ పరిచిన యూపీఏ

ఇప్పటికీ చాలా దేశాలు వీటిపై తమ వైఖరిని ప్రకటించలేదు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని గత ప్రభుత్వం ఈ లక్ష్యాలను తాము అమలు చేయ డం సాధ్యం కాదనీ, తమ మీద బలవంతంగా రుద్దవద్దనీ వేడుకుంది. అభి వృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందనీ, అభివృద్ధి చెందుతోన్న తమ లాంటి దేశాలు వీటిని అమలు చేయడం సాధ్యం కాదనీ కూడా అశక్త తను ప్రకటించింది. ఇది అత్యంత శోచనీయం. నిజానికి ఈ లక్ష్యాలను సాధిం చడం మనలాంటి దేశాల కే ఎక్కువ అవసరం. ఇంకా ఇక్కడే పేదరికం, ఆకలి విలయతాండవం చేస్తున్నాయి. ఇప్పటికీ నూటికి యాభై శాతానికి పైగా జనా భాకు స్వచ్ఛమైన నీరు అందడం లేదు. దీనివల్లనే ఏటా మలేరియా, డయే రియా, పచ్చకామెర్ల లాంటి వ్యాధులతో లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు.

ఆరోగ్య, వైద్య సదుపాయాలు మన దేశంలో కొందరికే అందు బాటులో ఉన్నాయి. ఖరీదైన ప్రైవేటు వైద్యం ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తున్నది. మెరుగైన, నాణ్యమైన విద్య నూటికి 80 శాతం మందికి అందు బాటులో లేదు. రోజు రోజుకీ పేదలకూ, ధనికులకూ మధ్య ఉన్న అగాధం పెరిగిపోతున్నది. కొన్ని కులాలు, వర్గాలు మాత్రమే ఈ రోజు మెరుగైన వైద్యా న్నీ, విద్యనూ అందుకుంటున్నాయి. స్త్రీపురుష సమానత్వం గురించి చెప్పుకో వాల్సిన అవసరమే లేదు. అన్ని రంగాల్లో మహిళలు ముందువరుసలో ఉండా లని చెప్తున్నప్పటికీ వారి పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష, దాడుల తీవ్రత ఎలాంటివో అందరికీ తెలుసు.

రాజకీయాలలో మహిళలకు అందివచ్చిన అవకాశాలను కూడా పురుషులే అనుభవిస్తుండటం ఒక వాస్తవం. ఆచరణలో ఆడవాళ్లను శక్తిహీనులుగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధిని చూస్తే సంపద కొద్ది మంది సొత్తుగా చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు. భారతదేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ అతి తక్కు వ వేతనాలతో, కాంట్రాక్టు విధానంతో కార్మికులను, ఉద్యోగులను అభద్రత వైపు నెడుతున్నారు. ఆచరణలో మొత్తం సమాజాన్ని కార్పొరేట్ శక్తులు తమ కబంధహస్తాల్లో బంధించి అసమానతలను పెంచి పోషిస్తున్నారు.

అందుకే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా అంగీకరించాలి. ఆమోదం తెలియజేయాలి. కడు పేదరికంలో ఉన్న పేదలకు ఒక భరోసా, ఒక భద్రత ఇచ్చి భవిష్యత్తు తరాలలో ఒక ఆశకు అంకురార్పణ చేయాలి. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రకటించబోతున్న స్ఫూర్తిని పుణికి పుచ్చుకోవాలి.

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)
 

Advertisement

తప్పక చదవండి

Advertisement