జన పుష్కరం | Sakshi
Sakshi News home page

జన పుష్కరం

Published Sat, Jul 25 2015 12:32 AM

జన పుష్కరం

విశ్లేషణ
గోదావరి పుష్కరాలు వచ్చాయి. పద కొండు రోజులు గడిచాయి. ఇవాళ పన్నెం డవ రోజు, చివరి రోజు. కోట్ల మంది జనం పుష్కర స్నానాలు చేశారు. పండిత పామర భేదం, చిన్నా పెద్ద భేదం, ధనిక పేద భేదం, నాయకులు, సామాన్య ప్రజ లు అన్న భేదం లేకుండా అన్ని తరగతుల, అన్ని వర్గాల ప్రజలూ పుష్కర స్నానాలు చేశారు.

ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ఎన్నో వాదాలూ, వివాదాలూ తలెత్తుతుంటాయి. వీటిలో ఒకవైపు నాయకులు, మరో వైపు ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు, ప్రవచనకారులు, హేతువా దులు భాగస్వాములవుతుంటారు. రాజకీయ నాయకులు ఇది మంచిది, చెడ్డది అన్న వివాదంలోకి గాని, వీటి ముహూర్తాల వివా దంలోకి గాని, అక్కడ ఆచరించాల్సిన, ఆచరించకూడని ఆచారాల వివాదాల్లోకి గాని వెళ్లరు. వాళ్లకు వ్యక్తిగతంగా వీటిపై విశ్వాసం ఉందా, లేదా అన్నది కూడా సందేహాస్పదమే. జనం విశ్వసిస్తు న్నారు, ఆచరిస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసం తమకూ ఉన్నట్లే, తామూ ఆచరిస్తూ ఉన్నట్లు అందరికీ కనిపించడమే వారి లక్ష్యమూ, ప్రయోజనమూ కూడా.

లౌకికవాద సమాజంలో ప్రభుత్వాలు ఈ విశ్వాసాలను ప్రోత్స హించవచ్చునా అని హేతువాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ విశ్వా సాలున్న జనం మరెవరికీ హాని కలగనంతవరకూ తమ విశ్వాసాన్ని నెరవేర్చుకోవడంలో అభ్యంతరాలు పెట్టవలసిందేమీ లేదు. ప్రభు త్వాలు ఆ ప్రజలకు సదుపాయాలు కల్పించవలసే ఉంటుంది. అయితే పుష్కరాల వంటి వాటి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసి అందర్నీ నది దాకా తీసుకువెళ్లే ప్రయత్నం ప్రభుత్వాలు చేయవలసిన పనేనా అన్నది విచారణీయమే.
 పుష్కరాల వంటి సందర్భాలన్నీ సంప్రదాయంపై నమ్మకం కలిగినవాళ్లు, ప్రాచీన మత గ్రంథాల పట్ల విశ్వాసం కలిగిన వాళ్లు, పరంపరగా ఆచారాలను అనుసరిస్తూ వస్తున్న వాళ్లు అనుసరించేవే అనీ, ముఖ్యంగా పామరజనం వీటిని వేలంవెర్రిగా పాటిస్తోందనీ చదువుకున్న వాళ్లు కొందరికున్న అభిప్రాయం. కాని ప్రస్తుత పరిస్థి తులను చూస్తూ ఉంటే చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్ల మధ్య భేదమేమీ కనిపించదు.

ప్రపంచ వ్యాప్తంగా చదువుకున్న యువత ఆలోచనా విధా నంలో, ప్రవర్తనా సరళిలో ఏదో శూన్యం ఆవరించి ఉన్నట్లు తోస్తుం ది. చదువుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. జీవితానికి వీటి తోనే తృప్తిగానీ,  సమగ్రత గానీ వస్తున్నదా అంటే సందేహమే. దేవా లయాల వంటి మతసంస్థలకూ, పుష్కరాలకూ, జాతర్లకూ, పండు గల నిర్వహణకూ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే సంస్కృతీ పరం గా వాళ్లేదో వెతుక్కుంటున్నట్లు కనిపిస్తుంది. వారి జీవితాలలోని శూన్యాన్ని వీటిలో పూరించుకుంటున్నట్లనిపిస్తుంది. వీటిలో మరో అంశం కూడా ముందుకు వస్తోంది. ప్రాంతీయ, జాతీయ, మత సాంస్కృతికపరమైన అస్తిత్వాన్ని ప్రకటించడంతో పాటు, వినోదం కూడా ఒక భాగమవుతున్నది.

ఆధునికులు గాని, హేతువాదులు గాని ఎన్నో ప్రశ్నలు కురిపిం చవచ్చు. వాస్తవానికి మతపరంగా మనం అనుసరించే ప్రతి ఆచా రాన్నీ ప్రశ్నించవచ్చు. పిండాలు పెట్టడమేమిటి? తర్పణాలు విడవ డమేమిటి? స్నానాలు చేయడమేమిటి? వంటి ప్రశ్నలకు పరంప రంగా వస్తున్న ఆచార విధులు, వాటిని చెప్పిన మత గ్రంథాలు, వాటిని వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలే సమాధానాలు. ఆధునిక విజ్ఞానశాస్త్ర దృక్పథంతో పరిశీలించి వీటిని సమర్థించేవారూ, మూఢ నమ్మకాలని కొట్టివేసే వారూ కూడా ఉంటారు.

ఆధ్యాత్మికవేత్తలూ, ప్రవచనకారులూ ప్రాచుర్యం పొందిన తర్వాత ఆ ప్రాచీన మత గ్రంథాలకూ, ఆచారాలకూ వారు చెప్పిన భాష్యాలే జనానికి ఆధారం. ఒకప్పుడు ఈ పని పౌరాణికులు చేసేవారు. ఇప్పుడు ప్రసార మాధ్యమాలు విస్తరించి, ప్రజలకు సమాచారం విరివిగా లభిస్తూ ఉంది. పుష్కరాలు పన్నెండేళ్లకొకసారి ఎందుకు రావాలి? పన్నెండు రోజులే ఎందుకు జరగాలి? పన్నెండేసి పుష్కరాలకు ఒక మహా పుష్కరం వస్తుందా? పుష్కర స్నానం ఎలా చేయాలి? నీళ్లలో మట్టి తీసి బయటపడవేయాలా? ఒడ్డునున్న మట్టి తీసి నీళ్లలో వేయాలా? అని ప్రశ్నిస్తే ఈ విషయాలన్నీ ఏదో పురాణంలోనో, మత గ్రంథం లోనో ఉంటాయి. వాటిని ప్రమాణాలుగా అంగీకరించే వారికి సమస్య ఏమీ లేదు.

మరి ఈ ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియనివి కదా. చెప్పే వాళ్లు ఒక పద్ధతిగా చెప్పకపోతే వినేవాళ్లు గందరగోళంలో పడిపో తారు. అసలే దిక్కుతోచని జనాన్ని అగమ్యగోచర స్థితిలోకి నెట్టడం వాంఛనీయం కాదు. మత విషయాలు జనంలో ఉద్వేగాలు, ఉద్రే కాలు కలిగిస్తాయి. ఆందోళన రేకెత్తిస్తాయి. ఇవ్వాళ పుష్కరాల విష యమే కాదు. మతానికి సంబంధించి ఏ అంశం జనంలోకి వచ్చినా అదే పరిస్థితి. ఇటువంటి విషయాలలో ప్రమాణమేమిటి? ఆ ప్రమా ణాన్ని నిర్ణయించే వారెవరు? వివిధ పీఠాధిపతులు సమష్టిగా ఈ నిర్ణయాలు చేయవచ్చు. ప్రజల సందేహాలు తీర్చవచ్చు. ప్రవచన కారులు కూడా ఎవరి ప్రాధాన్యం వారు చాటుకోవడానికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. జనంలో మౌఢ్యమూ పెంచకూడదు.

ఇటువంటి వాద సంప్రదాయం మన దేశంలో ప్రాచీన కాలం నుండి ఉంది. భిన్నమతాల ఆచార్యులు పరస్పరం వాదించుకొని ఓడిన వారు గెలిచిన వారి మతంలో చేరిన సందర్భాలు మన చరి త్రలో అసంఖ్యాకాలు. మాన్య ప్రజల వివేకం చాలా గొప్పది. వాళ్లకేది మంచిదో వాళ్లు ఏదో విధంగా నిర్ణయించుకోగలరు. వాళ్ల దారిన వాళ్లని వది లేస్తే వాళ్లని నడిపే అంతర్గత రక్షణలేవో వాళ్లకుంటాయి, వాటిని విని యోగించుకోగలరు. ఇక ఇదంతా మౌఢ్యమేనంటే, కావచ్చు. నెహ్రూ గారిని కుంభ మేళాను మీరు కూడా విశ్వసిస్తారా అని అడిగితే కుంభమేళాను విశ్వ సించే కోట్లాది ప్రజల విశ్వాసాన్ని నేను విశ్వసిస్తానన్నాడాయన. అచ్చమైన ప్రజాస్వామ్యవాది లక్షణం ఇది.






చంద్రశేఖర్ రెడ్డి
(వ్యాసకర్త ఎమెస్కో బుక్స్ సంపాదకులు)
మొబైల్: 9866195673.

Advertisement
Advertisement