అబే అబద్ధాల మేడలో జపాన్ ‘ప్రాభవం’ | Sakshi
Sakshi News home page

అబే అబద్ధాల మేడలో జపాన్ ‘ప్రాభవం’

Published Thu, May 8 2014 1:31 AM

అబే అబద్ధాల మేడలో జపాన్ ‘ప్రాభవం’

గతించిన జపాన్ సామ్రాజ్య వైభవం కోసం పాకులాటతో చైనాతో కయ్యానికి దిగిన అబే  విదేశాంగ విధానం ఫలితంగా ఉత్పత్తి రంగానికి  విదేశీ, స్వదేశీ పెట్టుబడులు మొహం చాటేస్తున్నాయి. ‘అబేనామిక్స్’ జపాన్‌ను అగాధంలోకి తోసేసే సంక్షోభానికి తలుపులు తెరుస్తోంది.
 
 అబద్ధాలు ఆడటంలోనే కాదు, అలా అని నిజాయితీగా అంగీకరించడంలో కూడా జపానీయులను మించినవారు లేరని ప్రతీతి. జపాన్ ప్రజల సంగతేమోగానీ ప్రధాని షింజో అబేకు మొదటిది మాత్రమే వర్తిస్తుంది. అమ్మ పుట్టింటి సంగతి మేనమామకు తెలుసని తెలిసి కూడా ఆయన ఫకూషిమా అణు విద్యుత్ కేంద్రంలోని ‘పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంద’ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ వద్ద బొంకారు. ‘అణు కాలుష్యానికి గురైన నీరు 0.3 చదరపు కిలో మీటర్లు మాత్రమే’నని నమ్మబలికారు. కాసుల కక్కుర్తితో ఫకూషిమా అణు ఉత్పాతానికి కారణమైన టోక్యో ఎలక్ట్రిక్ కంపెనీ (టెప్కో) మాటలనే ఆయన వల్లించారు. అయితే అసలు వాస్తవాన్ని ఫకూషిమా అణు విద్యుత్ కేంద్రం మేనేజర్ అకిర అనో గత నెల 20న  బయటపెట్టక తప్పింది కాదు. ‘చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉంటుందిగానీ అణు కర్మాగారంలోని కొన్ని ప్రాంతాలపై మాకు పూర్తి అదుపులేదు’ అని అంగీకరించారు. టెప్కో, అబేల విడదీయరాని బంధం బహిరంగమే. అంతులేని నిర్లక్ష్యంతో అణు ఉత్పాతాన్ని సృష్టించిన టెప్కోకే రేడియేషన్ ‘పరిస్థితిని అదుపుచేసే’ బాధ్యతలను అప్పగించారు. 4,500 మంది ఉద్యోగులు ఇంతవరకు వెయ్యి భారీ ట్యాంకులను 4,40,000 టన్నుల కలుషితమైన నీటితో నింపారు. 2016 నాటికి ఇంతకు రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తామంటున్నారు.
 
   పూర్తి పని ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఆ ట్యాంకులే రేడియేషన్ టైం బాంబులని అంటుండగా... అనుక్షణం సముద్ర జలాలు కలుషితమవుతూనే ఉన్నాయి. పైగా రోజుకు 400 టన్నుల రేడియేషన్ జలాలు భూగర్భ జలాల్లో కలిసిపోతున్నాయి. ఉద్యోగులు రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. అయినా గానీ ‘అసలు అక్కడ ఆరోగ్యపరమైన సమస్యలే లేవు, రాబోవు’ అని అబే అలవోకగా హామీ ఇచ్చారు. ఎలాగైనా 2020 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు అనుమతిని సంపాదించాలనే ‘సదుద్దేశం’తోనే అబద్ధాలాడుతున్నారనేది నిజం. అట్టహా సంగా ఆయన ప్రారంభించిన ఆర్థిక పునరుజ్జీవన కార్య క్రమం కుప్పకూలిందనే చేదు నిజాన్ని మరుగు పరచడానికి ఒలింపిక్స్ అత్యుత్తమ సాధనమని ఆయన విశ్వాసం.
 
 జపాన్ రెండు దశాబ్దాల క్రితమే అంతరించిన ‘అసలు సిసలు ఆసియా అద్భుతం.’ ఆ ఆర్థిక ప్రాభవంతో పాటూ, గతించిన సామ్రాజ్య ప్రాభవాన్ని కూడా సాధించి... జపా న్‌ను అగ్రరాజ్యంగా నిలుపుతానని అబే రెండేళ్ల క్రితం ‘వాగ్దానం’ చేశారు. దీర్ఘకాలిక వృద్ధి హీనత వ్యాధిగ్రస్త ఆర్థిక వ్యవస్థ కోసం అద్భుత దివ్యౌషధాన్ని తయారు చేశారు. ‘అబేనామిక్స్’ బ్రాండ్ నేమ్‌తో అది చెలామణి అవుతోంది. డిఫ్లేషన్‌కు (ధరలు పడిపోయే ధోరణి) విరుగుడుగా చేసిన ద్రవ్య విస్తరణ చికిత్స వికటించింది. 1991 తర్వాత మొదటిసారిగా ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరిగింది.  యెన్ విలువ దిగజారింది. ధరల పెరుగుదల పొదుపులను నిరుత్సాహపరిచి, కొనుగోళ్లను పెరిగేలా చేస్తుందన్నారు. కానీ ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి అత్యల్ప స్థాయిలో ఉన్న ఆ దేశంలో ధరల పెరుగుదల వల్ల కార్మికులు, ఉద్యోగులు, చిన్నాచితకా వర్తకుల బతుకులు మరింత అధ్వానమయ్యా యి. నిజవేతనాలు 5 శాతం మేర పడిపోయాయి. కొనుగోలు శక్తి మరింత క్షీణించి, కొనుగోళ్లు మరింత పడిపో యాయి. దీనికి తోడు అబే ప్రభుత్వం వినియోగపు పన్నును ఎడాపెడా పెంచుతోంది.  గత  ఏడాది 5 శాతంగా ఉన్న వినియోగ పన్ను ఏప్రిల్ మొదటికి 8 శాతానికి పెరిగింది.
 
 సంపన్న దేశాల్లో ఒకటైన జపాన్‌కు పేదరికం గణాంకాల విషయంలో కాకి లెక్కల ‘వర్ధమాన దేశం’గా పేరు. ఆ లెక్కల ప్రకారమే  జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు పేద లు. విదేశీ చంచల పెట్టుబడులతో స్టాక్ మార్కెట్ల తాత్కాలిక కళకళ తప్ప వృద్ధి ఎక్కడా కానరావడం లేదు. ఉద్దీపన పేరిట అబే జపాన్ కంపెనీలకు కట్టబెడుతున్న రాయితీలతో ఒక్క ఉద్యోగం కొత్తగా ఏర్పడింది లేదు. అవి తమ పెట్టుబడులను ఇండోనేసియా, భారత్, మైన్మార్, ఫిలిప్పీన్స్‌కు తరలిస్తున్నాయి. ఒకప్పుడు ‘ఆసియా ఫ్యాక్టరీ’గా పేరుమోసిన దేశంలో పారిశ్రామిక, వస్తు ఉత్పత్తి కొడిగట్టిన దీపంగా మారుతోంది. ప్రభుత్వ రుణం స్థూల జాతీయోత్పత్తిలో 200 శాతానికి చేరింది.  వలసవాద హక్కుల కోసం చైనా కయ్యానికి దిగిన అబే  విదేశాంగ విధాన ఫలితంగా విదేశీ, స్వదేశీ పెట్టుబడులు ఉత్పత్తి రంగానికి మొహం చాటేస్తున్నాయి. అబేనామిక్స్ జపాన్‌ను అగాధంలోకి తోసేసే సంక్షోభానికి తలుపులు తెరుస్తోంది. అయితేనేం, ఆ ఎండమావుల్లోని నీటిని కొనుక్కోడానికి మన జాతీయ మీడియా ఎగబడుతోంది. జపాన్‌తో కలిసి చైనాకు కళ్లెం వేసేయాలని సలహాలిస్తోంది.
 పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

తప్పక చదవండి

Advertisement