కాళోజీ ఇజానికి నమస్కారం | Sakshi
Sakshi News home page

కాళోజీ ఇజానికి నమస్కారం

Published Tue, Sep 9 2014 12:48 AM

కాళోజీ ఇజానికి నమస్కారం - Sakshi

సాహిత్య రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం దేనినీ తన కవిత్వంలో విడిచిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేదు. ‘డెమోక్రసీ పట్టాలు తప్పింది’ అని హెచ్చరించాడు. నిజానికి కాళోజీ వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైంది.
 
పాండిత్య ప్రధాన సాహిత్యాన్ని మార్గ సాహిత్యం అంటాం. చదువ నేర్వని ప్రజల కోసం రాసే నోటి, రాత సాహిత్యాన్ని దేశీ సాహిత్యం అంటాం. ప్రపంచంలో చాలా మంది కవులను ఈ రెండు విభాగాలలో వింగడించవచ్చు.
 
కాళోజీ నారాయణరావు (9.9.1914- 13.11.2002) మాత్రం ఈ రెండు ధోరణుల కన్నా విలక్షణమైన, విభిన్నమైన కవి. ఎందుకంటే, కాళోజీ ఉర్దూ, ఆంగ్లం, తెలుగుభాషలలో దిట్ట. 1940ల లోనే ఉర్దూ, ఆంగ్లంలలో కవితలు రచించాడు. అణా గ్రంథమాల కె.సి. గుప్త కాళోజీతో కథలు రాయించి ‘కాళోజీ కథలు’ (1946) అచ్చు వేశాడు. వచన రచన, కవిత్వం అతని రెండు కళ్లు, కాని అతను త్రినేత్రుడు. సాహి త్యాన్ని మనోచక్షువుల ద్వారా గ్రహించి, సంభాషణా ప్రక్రియ ద్వారా ఎందరినో సాహిత్య పిపాసులను చేశాడు. కాళోజీ అన్నగారు కాళోజీ రామేశ్వరరావు (1908-1996) ఉర్దూలో జానేమానే షాయర్. వీరిద్దరూ ఎల్‌ఎల్‌బీ చేసి వకీలు వృత్తిలో ఉన్నారు. ఆ తరువాత కాళోజీ రాజకీయ సామాజిక సాహిత్య కార్యకర్తగా మారాడు.

కాళోజీ చక్కని సంభాషణాప్రియుడు. ఆయనతో కూర్చో వడం అంటే సాహిత్య పండిత సభలో ఉన్నట్టే. సాహిత్యం గురించి అనేక సంగతులు అలవోకగా వివరించేవాడు. సంగీత విషయాలు సదాశివ ముచ్చట్లలో చెప్పినట్టు కాళోజీ ముచ్చ ట్లలో సాహిత్యం జలపాతమయ్యేది. కాళోజీ జ్ఞాపకశక్తి గొప్పది. ఆయా కవులను కలసిన తేదీలతోపాటు, వారి కవిత్వ చరణా లను కూడా చెప్పేవాడు. ఎన్నో ప్రాంతాల నుంచి ఎందరో కవులు కాళోజీని కలవడానికి వరంగల్లు వచ్చేవారు. ఐతే ఆయన ఎన్నడూ తన కవిత్వం గురించీ, పోరాటం గురించీ చెప్పుకోలేదు. కప్పి చెప్పడం కన్నా, విప్పి చెప్పడం ఆయన గుణం. అందుకే కవిత్వ శైలిని, భాషని, విధానాన్ని పక్కన పడేసి తనదైన సాదాసీదా తత్వాన్ని అక్షరాలకు అద్దాడు. వేలాది మంది సాహిత్యేతర పాఠకులు అతడు రాసిన కవిత్వం చదివారు. నిజానికి ‘నా గొడవ’ సంపుటాలు సాహిత్య పరులకన్నా, మామూలు పాఠకులకే ఎక్కువగా అందాయి. సాహిత్య వ్యవస్థని ఇంతగా ధిక్కరించిన కవి కాళోజీ ఒక్కడే. సాహిత్య వ్యవస్థ వెలుపల ఉండి ఆయన కవిత్వం రాశాడు. అందుకే కాళోజీని గొప్పగా ప్రేమించే సాహిత్యకారులు చాలామంది కవిగా ఆయనను ఆమోదించేవారు కాదు. కవిత్వ భావన సామాన్యుడి కళ్లు తెరిపించాలి. ఒక కొత్త ఆలోచన కలిగించి కార్యోన్ముఖ దిశగా కదిలించాలి. ఆ విధంగా వేమన లాగా కాళోజీ అన్ని చట్రాలను, విలువలను, ఆధిపత్యాలను నిరసించాడు. ముఖ్యంగా భాష విషయంలో. వేమన కవిత్వాన్ని ఉచితంగా అందించినట్టే,  ‘నా గొడవ’ సంపుటాలు ఉచితంగా పంచిపెట్టాడు. ఎలాంటి క్లిష్టత లేని సరళ భాషలో రాశాడు. భాష పెత్తనాన్ని ప్రశ్నించాడు. వలసవాదానికీ, భాషకూ గల సంబంధాన్ని విప్పి చెప్పాడు. నిజానికి గిడుగు, శ్రీపాదలు ఊహించని కొత్త సరళ భాషను హత్తుకున్నాడు. మాండలికాలే భాషకు ప్రాణవాయువని చెప్పాడు. ప్రతి సమస్యను ప్రజా దృక్పథం నుంచి చూసే నేర్పు కాళోజీ సహజాతం. నిజాంని ‘రాణి వాసములోన రంజిల్లు రాజా’ అని సంబోధిస్తూ ‘ప్రజలను హింసించు ప్రభువు మాకేల’ అని అన్నాడు. దాదాపు ప్రతి ముఖ్యమంత్రి చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కవిత్వం రాశాడు. జలగం వెంగళరావుపై పోటీ చేసి చెక్ పెట్టాడు. ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు.  పౌర హక్కులకు చిరునామా అయ్యాడు.

ప్రత్యేక తెలంగాణ కోసం కాళోజీ ఒక పుట్టు రెబెల్. ఎనభై ఏళ్లు తనని పెంచి పెద్ద చేసిన అన్నను కూడా ఎదిరించాడు. 1946-47లో నిజాం ప్రభుత్వం వరంగల్, గుల్బర్గా జైళ్లలో ఉంచింది. మూడు నెలలు జన్మస్థలం అయిన వరంగల్ నుండి బహిష్కరించింది. చెరసాలను చూసి ఏనాడూ వెరవలేదు. ఎంత పెద్ద నాయకుడినైనా లెక్క చేయలేదు. 1958 నుంచి 60 వరకు శాసన మండలి సభ్యుడిగా ఉండి కూడా రాజకీయాలకు దూరమయ్యాడు.  స్వాతంత్య్ర సమరయోధునిగా, గౌరవ డాక్టరేట్ పుచ్చుకున్న వాడిగా, పద్మవిభూషణ్‌గా ఎన్ని పురస్కా రాలు పొందినా తన స్వభావానికి వ్యతిరేకంగా జీవించలేదు. మనసు ఎంత సున్నితమో ఆయన వ్యక్తిత్వం అంత సుదృఢం. చిన్నా పెద్దలను ఒకేలా పలకరించేవాడు. అందరితో హాయిగా ఉండే కాళోజీ ‘పెద్దల’ విషయంలో మాత్రం అతి కటువు.  ఆనాడు ఎన్నికలను బహిష్కరించాలని పీపుల్స్‌వార్ చేసిన ప్రకటనని ధైర్యంగా ఖండించాడు.
  సాహిత్య రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం దేనినీ తన కవిత్వంలో విడిచిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేదు. ‘డెమోక్రసీ డీ రేలైంది’ అని హెచ్చరించాడు. నిజానికి కాళోజీ వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైంది. అటువంటి ‘మనిషి’ అరుదు. సాహిత్య లోకంలో మరీ అరుదు. కాళోజీ తనను తాను విముక్తం చేసుకున్న ఆలోచనా పరుడు. అతడిని క్రాంతదర్శి అనవచ్చు. కులం మతం పట్ల పట్టింపులేదు.  సాహిత్యంలో అతనిది పాల్కురికి సోమన మార్గం. ఆ మార్గంకన్నా సులభీకరణ చేసిన దారిలో నడిచింది అతని రచనా వ్యాసాంగం.  రూపం వచన కవిత్వమే. కాని గేయలక్షణం ఎక్కువ. అప్పుడప్పుడు విషయ ప్రధానమైన ప్రకటనలా కనిపిస్తుంది. కాళోజీ మొత్తం 500 పేజీల కవిత్వాన్ని ఒక దగ్గరగా చూసినప్పుడు ఆ కవిత్వం మనల్ని వెంటాడటం మొదలవుతుంది. దిగంబరుల కన్నా ఎంతో ముందే తిరుగు బాటు కవిగా కాళోజీని పేర్కొనవచ్చును.

 తెలంగాణలో తిరుగుబాటు తత్వం పాలక హింసాకృత్యాల వల్లే హెచ్చింది. 70 ఏళ్లుగా అలాంటి హింసని అక్షరీకరించిన కాళోజీ ఒక తిరుగుబాటు సాహిత్య చరిత్రకారుడు. కాళోజీ జీవితం నేర్పిన పాఠం ధిక్కారం. ప్రశ్న. కాళోజీని గుర్తు చేసుకోవడం అంటే నోరులేని ప్రజల తరఫున ప్రశ్నించడమే. రాజ్యాన్నే కాదు. ప్రతి నిర్మాణాన్ని ప్రశ్నించి, హెచ్చరించి ప్రజాస్వామ్యీకరించాలి. విముక్త మేధావి మాత్రమే ఇవాళ సమగ్ర సమాజ అధ్యయనశీలి. అతడే కొత్త పోరాట బీజం. 1950ల లో ‘నా ఇజం’ కవితలో ‘‘నాది నిత్య నూత్న వికసిత విజ్ఞానం’’ అంటాడు.  వ్యవస్థలోని ప్రాచీన, ఆధునిక వ్యవస్థలలో ప్రజలను, బలహీనులను అణచివేయడాన్ని ఇష్టపడలేదు. అదే కాళోజీ తత్వం. ఇవాళ ఈ ఆలోచన సమాజంలో ఇంకిపోవాలి. దీనిని ఎదిరించగలిగే సత్తా ప్రజలకు అందించిన నాడు అన్ని రకాల పెత్తనాలు సమసిపోతాయి. దీని వల్ల ప్రజల సత్తా పెరుగుతుంది. అందుకోసమే కాళోజీ కలలు గన్నాడు.
 
(వ్యాసకర్త జానపద సాహిత్య పరిశోధకుడు)  -  డా॥జయధీర్ తిరుమలరావు
 

 
 

Advertisement
Advertisement