విముక్తవాదానికి గుర్తింపు | Sakshi
Sakshi News home page

విముక్తవాదానికి గుర్తింపు

Published Mon, Dec 21 2015 3:30 AM

kendra sahitya academy winner olga

విరూపిగా శూర్పణఖ జీవితాన్ని ఎదుర్కొన్న తీరూ, జీవితాన్ని సౌందర్యభరితం చేసుకున్న వైనమూ,  సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించడమూ నేటి తరం తెలుసుకోవాల్సివుంది.
 
పురాణాలు రుద్దిన పవిత్రతా భావనలూ పతివ్రతా ధర్మాలూ- స్త్రీల జీవితాల్లో దుఃఖం ఒంపుతున్నాయి. వాళ్ల జీవితాల్ని నియంత్రిస్తున్నాయి. జీవించే హక్కుపై దాడి చేస్తున్నాయి. అదెలాగో తెలియాలంటే ఓల్గా సృష్టించిన కథావరణంలోకి వెళ్లాలి. సీతను సూత్రధారిగా చేసుకుని నాలుగు గాథల్ని స్త్రీవాద కోణం నుంచి ఆమె పునర్నిర్మించారు. వీటితో సహా మొత్తం ఐదు కథల్తో వెలువడిన ‘విముక్త’కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. విముక్త భావజాలానికి ఇదొక గుర్తింపు. వాటిని ప్రతిపాదించిన కథలు భారతీయ భాషల్లోకి అనువాదమవుతాయి. స్త్రీవాదం మరింత విస్తరించడానికి దోహదపడతాయి.
 
 తనపై రాముని ప్రేమ సత్యమని నమ్మింది సీత. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉండబోదన్న అహల్య మాటల్ని తిప్పికొట్టిన సీత... రాముడు శీలపరీక్ష కోరినప్పుడు - అధికారానికి లొంగవద్దన్న ఆమె మాటలు గుర్తు చేసుకుంటుంది. రాముడు అగ్నిపరీక్ష పెట్టినప్పుడూ అరణ్యాలకు పంపినప్పుడూ రేణుక ఇచ్చిన సైకత కుంభం (ఇసుక కుండ) ఆమెకు స్ఫురణకొస్తుంది. తమ పాతివ్రత్యాలు సైకత కుంభాల వంటివి అంటుంది రేణుక.
 
 శూర్పణఖను కురూపిగా చేసిన రాముని రాజకీయాన్నీ, వలచిన ఆమెకూ - ప్రేమించిన తనకూ వేదన మిగిల్చిన అతని ఆర్యరాజధర్మాన్నీ సీత నిరసించగలుగుతుంది. లక్ష్మణుడు అరణ్యంలో వదలివెళ్లిపోయాక - ఊర్మిళ మాటలు గుర్తు చేసుకుని ఉపశమనం పొందగలుగుతుంది. ‘అధికారాన్ని తీసుకో. అధికారాన్ని వదులుకో. అప్పుడు నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలాలి’ అంటుంది ఊర్మిళ. వివిధ సందర్భాల్లో పై నలుగుర్నీ కలుస్తుంది సీత. వాళ్ల జీవితాల్ని వింటుంది. వాళ్ల ‘అనుభవాల నుంచి తను నేర్వగలిగింది నేర్చింది’. వారివ్యధాభరిత జీవితంలో తనను తాను చూసుకుంది. స్నేహంతో బలపడింది. ‘నాకు లేనిదేమీ లేదు’ అనుకునే స్థాయికి ఎదిగింది. ఆర్యధర్మాన్ని ధిక్కరించింది.
 
 బాధించే సంప్రదాయాల హద్దులు దాటి తమదైన ప్రపంచం నిర్మించుకున్నారు ఈ కథల్లోని స్త్రీలు. తమతో తాము యుద్ధం చేసుకుంటూ - తమను తాము తెలుసుకుంటూ విస్తరించుకున్నారు. విరూపిగా శూర్పణఖ జీవితాన్ని ఎదుర్కొన్న తీరూ, జీవితాన్ని సౌందర్యభరితం చేసుకున్న వైనమూ,  సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించడమూ నేటి తరం తెలుసుకోవాల్సివుంది. ఇలాంటి కథలు పాఠ్యాంశాలు కావాల్సివుంది.
 
 స్నేహ సహకారాలూ, సమూహంలో భాగం కావడాలూ, అనుభవాలు పంచుకోవడాలూ, తమను తాము తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలూ  స్త్రీల జీవితాన్ని అర్థవంతంగా మలచుతాయి. ఓల్గా రచనలు అలాంటి దారి చూపుతాయి. అధికారానికి అతీతమైన - స్నేహపూరితమైన స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడుతాయి. సమాజంలోని అన్ని దృక్కోణాల్లోనూ ఒక పునరాలోచన, పునర్నిర్మాణం  సాధించడం ఫెమినిజం అంతిమ లక్ష్యమన్న  ఓల్గా - ఆ దిశగా తన సమకాలికులెవ్వరూ చేయనంత కృషి చేసినందుకూ, చేస్తూనే ఉన్నందుకు అభినందనపూర్వకంగా అందిస్తున్నాం ఈ అక్షరగుచ్ఛం.  
     వి. ఉదయలక్ష్మి

Advertisement
Advertisement