ఏకనగర రాజ్యం మనకి ఆదర్శమా? | Sakshi
Sakshi News home page

ఏకనగర రాజ్యం మనకి ఆదర్శమా?

Published Sun, Nov 13 2016 8:25 AM

ఏకనగర రాజ్యం మనకి ఆదర్శమా? - Sakshi

సింగపూర్‌ చిన్నదీవి. ప్రపంచంలోనే ఒకేఒక్క ఏకనగర రాజ్యం. రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా పొందికైన దేశం. ఆర్థికరంగంలో ఆధు నిక నమూనా. ఇటువంటి దేశాన్ని ఇతర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుని స్వీయముద్రతో పని చేయదలిస్తే మంచి విషయమే. కానీ స్వీయ ముద్రని వదిలి  ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్‌లా మారుస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. వాటిని ఆచరణ లోకి తెచ్చే ప్రయత్నాలు అమరావతి నిర్మాణక్రమంలో కనబడు తున్నాయి.

రాజకీయ, ఆర్థిక విధానాలను భావోద్వేగాల పరిధిలో చర్చించకూడదు కానీ, ప్రజల భావోద్వేగాల విషయంలో ప్రభుత్వాలకి చిన్నచూపు ఉండకూడదు. రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ నామస్మరణ తప్ప స్థానిక ప్రత్యేకతలను, సొంత సాంకేతికతని పరిగణనలోకి తీసుకున్నట్లు కనపడదు. సింగపూర్‌ తరహా నగర నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరానికైనా సాధ్యమేనా అన్నది ఇపుడు చర్చించవలసిన విషయం. నిర్మాణమన్నది కేవలం భౌతిక స్థాయిలో చూడటం ఒక పరిమితి. దీనివల్ల సింగపూర్‌ ప్రజల మనోవికసనానికి, స్థిమితమైన జీవన విధానానికి తోడ్పడిన పలు అంశాలను విస్మరించి పెట్టుబడిదారీ విధానానికి అనుకూలమైన వాటిని మాత్రమే గ్రహించడం జరుగుతోంది.

సింగపూర్‌ అభివృద్ధి కేవలం ఆర్థికవిధానాల వల్లనే జరగలేదు. అక్కడి సమస్త వ్యవస్థల పటిష్ట నిర్మాణం వల్ల జరిగింది. అందులో ముఖ్యమైనది రాజకీయవ్యవస్థ. 1959 నుంచీ ఇప్పటి వరకూ ‘పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ’ యే అధికారంలో కొనసాగుతున్నది. కమ్యూనిస్ట్‌ భావజాల ప్రభావం ఆ పార్టీ మూలాల్లో పాదుకుని ఉంది. ఎన్నికలలో గెలుపు కోసం ప్రజా సంక్షేమాన్ని నటించాల్సిన అవసరం ఆ రాజకీయ పార్టీలకి లేదు. అక్కడ ప్రతిపక్షం అనామకం. కానీ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల పట్టింపు అధికం. అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల, వ్యక్తుల భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరచడానికి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితిలేదు. ప్రైవేటువాహనాల పార్కింగ్‌కి రోజుకి నాలుగువందల రూపాయలు రుసుము వసూలు చేసే దేశం సింగపూర్‌. అందులో నాలుగోవంతు రేటుకి ప్రభుత్వ భూములను ఎకరాలకి ఎకరాలు ఫ్యాక్ట రీల కోసం ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పే రాష్ట్రం మనది.

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కూడిన బృందం గతేడాది సింగపూర్‌లో పర్యటించినపుడు అమరావతి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేయడంలో సీఎం చేసిన కృషిని సింగపూర్‌ ప్రధాని కీర్తించారు. అందులో సదుద్దేశమే ఉండొచ్చు. గ్రామీణ వ్యవస్థ, భూమితో ప్రజలకి సెంటిమెంటల్‌ అనుబంధం, వ్యావసాయిక నేపథ్యంలేని సింగపూర్‌ దేశానికి భూసేకరణ అత్యంత సులువైన విషయం కావొచ్చు కానీ భారతదేశంలో అది అత్యంత సంక్లిష్టం. రాజధాని విషయంలోనే కాక అభివృద్ధి పేరుతో జరిగే ప్రతి భూసే కరణ సందర్భాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ అభివృద్ధిలో బాధితులకు, సామాన్య ప్రజలకి ఎటు వంటి ఫలితం ఉండటం లేదు కనుక.

ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంతో సహా ఏదో ఒక అంశం మీద నిరంతరం ఆందోళనలు అలజడుల నిరసన రూపా లకి ఇక్కడ అవకాశం ఎక్కువ. శాంతిభద్రతల విషయంలో సింగ పూర్‌ వైఖరి చాలా కఠినం. 2013లో లిటిల్‌ ఇండియా ప్రాంతంలో బంగ్లా వలస కూలీని చైనా జాతీయుడు బస్‌లో నుంచి తోసి వేయడం వలన అతను చనిపోయాడు. ఆ సందర్భంలో అక్కడి దక్షిణాసియా కార్మికులు ఆరు బస్సులను తగలబెట్టారు. పది మంది పోలీసులు గాయపడ్డారు. గత నలభై ఏళ్లలో సింగపూర్‌ ఎదుర్కొన్న అతిపెద్ద అలజడిగా ఈ ఘటన గుర్తింపు పొందింది.  ప్రజలైనా, ప్రభుత్వాలైనా హింస ఆధునిక నిరసన రూపం కాదని గుర్తించడం వెనుక సమాజపు మానసిక విలువల పెరుగుదల ఉంటుంది. ఆర్ధిక అంతరాల తగ్గుదల ఉంటుంది. ప్రజలంటే ‘ఓటు’గా మాత్రమే గుర్తించే రాజకీయ పార్టీలు అటువంటి సమా నత్వ సాధనను ఆదర్శంగా తీసుకోలేవు.

ఆంధ్రప్రదేశ్‌లో కులమత లింగ వివక్షలపై పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. అనేక పీటముళ్లు పడిన సామాజిక అంతరాలు అభివృద్ధికి అడ్డుగా నిలిచిఉన్నాయి. వాటి పరిష్కారానికి వ్యవ స్థలో మౌలికమైన మార్పులు జరగాలి. యుక్తవయసు వచ్చిన ప్రతి యువకుడూ రెండేళ్లపాటు సింగపూర్‌ సైన్యంలో పనిచేయాలి. దీనివల్ల కఠిన తరమైన శ్రమకి యువత సిద్ధంకావడంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉంది. యువకులు సైన్యంలో ఉండే కాలంలో యువతులు వారిని దాటుకుని విద్యా ఉద్యోగ రంగా లలో ముందుకు వెళతారు. సింగపూర్‌ నుంచి గ్రహించవలసిన ప్రజా ప్రయోజనకర అంశాలను పక్కనబెట్టి, సముద్రతీర ప్రేమ పండుగలు, విలాసవంతమైన విశ్రాంతి స్థలాలు, ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల మాయాజాలంలో పడటం అంటే ఆకాశంలో మేఘాలను చూసి ముంతలోని నీళ్లను ఒలక బోసుకోవడం వంటిది.

-కేఎన్‌. మల్లీశ్వరి
వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ)
మొబైల్‌: 88850 16788

Advertisement

తప్పక చదవండి

Advertisement