విహారంలో అక్షరం | Sakshi
Sakshi News home page

విహారంలో అక్షరం

Published Sat, May 10 2014 1:02 AM

విహారంలో అక్షరం - Sakshi

వేసవి సమయం: ప్రకృతి తీరం, పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసే గ్రామం, ధగధగలాడే విదేశం... ఏదైతే ఏం ఉన్న ఆవరణ నుంచి బయటకు వెళ్లడమే ఒక రీచార్జ్. తిరగడమే రచయితకు కొత్తబలం. విహారానికి వెళ్లి వచ్చిన అక్షరం కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది. మరింత సృజించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే  వేసవి సెలవుల్లో కవులు, రచయితలు  కాసింత ఆటవిడుపును వెతుక్కుంటున్నారు. పర్యటనలు చేస్తూ ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. సాహిత్యప్రేమికులను ముసాఫిర్‌లుగా మారమని ప్రేరణ కలిగిస్తున్నారు.
 
 ‘‘ఇదిగో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్నా. స్నేహితునితో థియేట ర్‌కు వెళుతున్నా. దారిలో ఇలా నా సెల్ నుంచే ఫొటో తీసుకుంటూ’’...
 - అక్కిరాజు భట్టిప్రోలు, కథారచయిత.
 (నివాసం: హైదరాబాద్)
 
 ‘‘ఈ మధ్య ఫ్రెండ్‌తో కలసి  హాంగ్‌కాంగ్, చైనా, మకావ్ వెళ్లాను. తిరుగు ప్రయాణంలో హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ కోసం ఎదురు చూస్తూ’’
 - తుల్లిమల్లి విల్సన్ సుధాకర్,
 కవి
  (నివాసం: బెంగుళూరు)‘‘కాకినాడలో మడ అడవులకు మా ప్రయాణం చెట్ల మీద కట్టిన చెక్క వంతెన మీద నడుస్తూ మొదలైంది. కింద నత్తలు, పీతలు, జలగలు. నీళ్లలో ఉన్న మంగ్రూవ్ చెట్లు. నల్లమడ, తెల్లమడ... ఇంకా చాలా రకాలు. దూరంగా గోదావరి... గోదారమ్మ నుంచి వెనక్కి వస్తున్న నీళ్లల్లో అటు ఇటు గోడ కట్టినట్టు మడ అడవి... ఎండలో ఆకుపచ్చగా మెరిసిపోతున్న చెట్లు. నది మీద నుంచి వస్తున్న గాలికి తలలూపుతూ నీళ్లలో వాటి నీడలు. అసంఖ్యాకమైన పక్షులకి ఆవాసం ఆ ప్రాంతం. మనం ఏ మాత్రం శబ్దం చేసినా గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉంటాయి. అలాంటి ఓ గుంపును మేం చూడగలిగాం. ఆ ప్రకృతి సౌందర్యం మమ్మల్ని ఏదో అలౌకిక లోకాల్లోకి తీసుకెళ్లిపోయింది’’
 - కొండవీటి సత్యవతి,
 రచయిత్రి- భూమిక ఎడిటర్ (నివాసం: హైదరాబాద్)
 
 ‘‘మా అమ్మమ్మగారి ఊరు ఉయ్యూరులోని పుల్లేరు లాకులు ఇవి. నేను, మా తమ్ముడు జితేంద్ర బాల్యంలో ఎన్నో ఆహ్లాదకర సాయంత్రాలు ఇక్కడే గడిపాం. అప్పట్లో మాకు ఇదే నాగార్జున సాగర్, శ్రీశైలం డామ్. మళ్లీ మొన్న ఉయ్యూరు వెళ్లినప్పుడు ఆ మధుర స్మృతులను తలుచుకుంటూ...’’
 - వడ్డి ఓం ప్రకాష్, కథారచయిత
 (నివాసం: హైదరాబాద్)
 
 ‘‘కడప జిల్లా పులివెందల నియోజకవర్గం వేముల మండలంలో ఉన్న మోపూరు బసవేశ్వరస్వామి దేవళం (12వ శతాబ్దం) ఇది. వీరశైవానికి చెందిన చరిత్ర ఈ దేవళంతో ముడిపడి ఉంది. దానిని తెలుసుకున్నట్టుంటుంది. కాస్త మనసుకు హాయిగా ఉంటుందని’’...
 - వేంపల్లి గంగాధర్, రచయిత,
 (నివాసం: కడప)

Advertisement

తప్పక చదవండి

Advertisement