Sakshi News home page

స్వప్న భారతంలో మాయా స్వర్ణం

Published Sat, Oct 19 2013 11:27 PM

స్వప్న భారతంలో మాయా స్వర్ణం

బైలైన్
 ఎం.జె.అక్బర్,
 సీనియర్ సంపాదకులు
 
 
 భయానక కాల్పనిక సాహిత్యం మన దేశంలో జనాదరణ పొందకపోవడానికి కారణం ఏమిటి? ఆ విషయంలో వార్తా పత్రికల నుంచి పోటీ మరీ ఎక్కువగా ఉండటమే. అతి క్రూరమైన, అసంభవాలను సృష్టించే కాల్పనిక శక్తిలో దైనందిన వార్తలతో పోటీపడగలిగిన వైపరీత్యపు బుర్ర ఏ రచయితకైనా ఉండటం సాధ్యమేనా? స్వామీజీలుగా చెలామణి అవుతూ జలగల్లాగా నొప్పి తెలియకుండా నెత్తురును పీల్చేసే కొందరు తుచ్ఛుల దుష్ట పన్నాగాలు ఎల్లెడలా వ్యాపించి ఉన్న దేశం మనది. పదునైన కోర పళ్లతో ఆడవాళ్ల మెడ నుంచి నెత్తురును పీల్చేసే రక్త పిశాచి ‘డ్రాక్యులా’గానీ, ఆ పాత్రను సృష్టించిన బ్రామ్ స్టోకర్‌గానీ మనకు అవసరం లేదు. అలాంటి మోసకారి స్వాముల భక్తులు కోట్లలో ఉన్నారు. ఆ తుచ్ఛులు ఆక్రమించిన భూములు వేల ఎకరాల్లో విస్తరించాయి. మనవాళ్లు ఎంత మూర్ఖంగా ఉండగలరు?
 
 

ఎంతైనా మూర్ఖంగా ఉండగలరని రుజువవుతూనే ఉన్నది, నిజమే. సామూహిక వెర్రి కథ అతి సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది. ఉత్తరప్రదేశ్‌లోని దౌండియా ఖేరా అనే ప్రాంతంలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నదని సాగి స్తున్న అన్వేషణకు సాటిరాగ ల సామూహిక వెర్రి మరొకటి ఉండక పోవచ్చు. 150 ఏళ్ల క్రితం రాజా రామ్‌బక్ష్  ఆ బంగారాన్ని అక్కడ పాతర వేసినట్టు స్వామి శోభన్ సర్కార్ అనే వ్యక్తి ఇటీవల కలగన్నారు. ఆ కల ఆధారంగానే నిధి కోసం అన్వేషణ సాగుతోంది! ఆయన ఆ కలగనడానికి ముందు ఎవరూ విని ఉండని ఆ రాజా హఠాత్తుగా బాలీవుడ్ చిత్ర కథనాయకుడై పోయాడు. మన బంగారంపై తెల్లవాళ్ల చేతులు పడకుండా కాపాడటానికి ఆ అనామకపు రాజు ఈ నిధిని 1857కు ముందే  పాతర వేసి ఉండాలి.
 
 

భారత సాంస్కృతిక, పురావస్తు సంస్థ ఉన్నతాధికారులు సైతం ఈ నిధి గురించి పెదాలు తడుపుకుంటున్నారు. మూకుమ్మడిగా జనం అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని తప్పు పట్టడానికి లేదు. కంప్యూటర్ యుగపు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సదరు పూజ్యనీయులైన స్వామీజీ వద్దకు దూతను పంపి,.. ప్రజల మనిషినైన తాను ఆ నిధిని అభివృద్ధి కోసం ఉపయోగించడాన్ని దైవ స్వరూపుడైన ఆ మనిషి అనుమతిస్తారో లేదో వాకబు చేసినట్లు తెలుస్తోంది. అద్భుతమైన ఈ బంగారం ఎన్నటికైనా బయటపడితే... దాన్ని దయనీయ స్థితిలో ఉన్న ప్రజల కోసం గాక రాజకీయవేత్తల సంక్షేమం కోసమే బహుశా వినియోగిస్తారు. అది వేరే కథ.
 
 

వ్యక్తిగతంగా నా మటుకు నేను ఆ బంగారాన్ని కనుగొనాలనే ఆశిస్తాను. అందులోంచి ఓ పిడికెడు బంగారాన్ని ప్యాంటు జేబులోకి తోసేయగలగడం కాదుకదా దాని వాసన చూడటానికి కూడా నన్ను అనుమతించరు. ఆ నిధితో అఖిలేష్‌యాదవ్ పంచిపెట్టిన కంప్యూటర్లకు డబ్బు చెల్లించగలుగుతారు. బహుళజాతి సంస్థలకు అది ఆనందదాయకమైన వార్త అవుతుంది. అయితే కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు నా ఖాళీ బుర్రను తొలిచేస్తున్నాయి.
 
 ‘శాస్త్రీయమైన ఆధారాలు’ దొరికాయి కాబట్టే ఈ స్వర్ణ నిధి కోసం తవ్వకాలు సాగిస్తున్నామని భారత ప్రభు త్వ మేధావులు వివరించారు. మనం మాట్లాడుతున్నది పుడమితల్లి కడుపున  దాగి ఉన్న అపార బంగారు నిధి కుం భకోణం గురించి కాదు. రాజా రామ్ బక్ష్‌కు ఆయన సల హాదారులు ఆ బంగారాన్ని ఎలా దాచాలని చెప్పి ఉంటారనేదాన్ని బట్టి... ఆ నిధిని మట్టి లేదా ఇనుప కుండల్లో పాతరవేసి ఉండాలి. ఈ కుండల లేదా బిందెల గురించి మన మేధావులకు శాస్త్రీయ ఆధారాలు ఎలా లభించాయి? భూగర్భంలో ధగధగలాడుతున్న ఆ బంగారాన్ని కుశాగ్ర బుద్ధియైన ఓ లేజర్ కిరణం కళ్లారా చూసి,.. మెరిసేదంతా బంగారమేనని తేల్చేసిందా? నాకు తెలిసినంతలో వాసన చూడటం ద్వారా బంగారం ఉనికిని కనిపెట్టలేం. కాబట్టి ఢిల్లీలోని కొందరు ‘పెద్దలు’ ఈ పండుగ సెలవుల్లో సుప్రసిద్ధ సాహసిక నవల ‘ట్రెజర్ ఐలాండ్’ (స్వర్ణ ద్వీపం)  చదివి ఉంటారని భావించడం సమంజసం.
 
 

ఈ వెర్రితో మొట్టమొదట నశించేది వివేకం. రాజా రామ్ బక్ష్ ఎంతటి గొప్ప సంపన్నుడు? అతగాడు అవధ్ నవాబుగానీ, మరాఠా పీష్వాగానీ కాదు, బెనారస్ రాజానో, ఝాన్సీ రాణీనో కానే కాదు. అసలు అలాంటి వారి సరసన నిలిచేవాడే కాడు. లేకపోతే పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట అతని గురించి ఓ ముక్క మనకు వినిపించి ఉండేదే. ఆ రాజు కల్పన కాదు, నిజంగానే ఉండేవాడు. ఇంతకూ ఆ అనామకపు రాజు వెయ్యి టన్నుల బంగారాన్ని ఎలా కూడబెట్టగలిగి ఉంటాడు? ఆ కాలంలో అతి సంపన్న వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని వద్ద సైతం అంత బంగారం ఉన్నట్టు చెప్పగా వినలేదు. ఢిల్లీ మొగలాయి చక్రవర్తుల ఖజనాలో అంత బంగారం ఉండి ఉండేదేమో. ఉంటే దాన్ని 1739లోనే నాదిర్ షా ఖాళీ చేసేసి ఉంటాడు. అదీ పరిస్థితి.
 
 

ఆ కాలంలో అందుబాటులో ఉన్న భారీ తవ్వకం సాధనం పార మాత్రమే. అయినాగానీ అంత బంగారాన్ని ఎలా పాతిపెట్టి ఉండాలి? చాలా మంది శ్రామికులే పనిచేసి ఉంటారని అనుకోవాలి. గత రెండు శతాబ్దాలుగా అక్కడి రైతులు, వారి సంతతి అత్యంత నిజాయితీపరులుగా ఉండి ఉండాలి. రహస్యాలను దాచి పెట్టడంలో మన దేశానిది అధమస్థానమే తప్ప అత్యుత్తమ స్థానం కాదు. 1867లో లేదా 1877లో లేదా 1887లో ఎవరూ తిరిగి ఆ నిధి జోలికి వెళ్లకుండా ఉండి ఉండాలి. బ్రిటిష్‌వాళ్ల చెవిలో ఓ మాట వేయకుండా ఉండాలి. ఏమైనా అది అద్భుతమే.  
 
 మూఢ నమ్మకానికి, శాస్త్రీయ వివేచనకు మధ్యన జరిగే ఏ సంఘర్షణలోనైనా మూఢ నమ్మకమే కళ్లు మూసుకుని విజయం సాధిస్తుంది. ఆ బాబాకు నిధి గురించి కల వచ్చింది, సరే. ఈ సాయం సంధ్యా సమయపు నిగూఢ రహస్యాలను సవాలు చేసే సాహసం కూడా ఎవరూ చేయలేరు.
 
 సిగ్మండ్ ఫ్రాయిడ్ మన దేశానికి వచ్చి ఉంటే మనోవిశ్లేషణ, కలల అంతరార్థ వివరణ బతికి బట్టగలిగి ఉండేవి కావు.
 
 మనదేమైనా కలలు నిజమయ్యే దేశమా? దేశవ్యాప్త పేదరికం నుంచి ఢిల్లీ గతుకుల రోడ్లపై ప్రయాణం వరకు ప్రతి ఒక్కటీ కాదని రుజువుచేస్తూనే ఉన్నాయి. కలల తయారీని కూడా స్థూల జాతీయోత్పత్తికి కలిపితే మన జీడీపీ మిగతా ఆసియా దేశాలన్నిటి జీడీపీని మించిపోతుంది. ఇందులో పొరపాటు పడటానికి ఏమీ లేదు. కలల తయారీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. రిక్తహస్తాలను మాత్రమే మిగిల్చే కలలపై పెట్టుబడులు పెట్టేవారు మోసగాళ్లు మాత్రమే.    
 

Advertisement
Advertisement