ఆకాశవాణిలో మెరిసిన మంద్రస్వరం | Sakshi
Sakshi News home page

ఆకాశవాణిలో మెరిసిన మంద్రస్వరం

Published Fri, Jul 1 2016 12:58 AM

ఆకాశవాణిలో మెరిసిన మంద్రస్వరం

 సందర్భం
 మల్లాది నరసింహశాస్త్రి మా సహోద్యోగి అని చెప్పుకునేం దుకు మేము గర్వపడతాము. ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి తనయుడు కాబట్టి మేము గర్వపడతామని చెప్ప డం లేదు. ఎం.ఎన్. శాస్త్రి అస లెప్పుడూ అలాంటి భేషజా లకు పోయే వ్యక్తి కాదు. ఎప్పుడూ గొప్పలు చెప్పు కోలేదు. మితభాషి, తన పనేమిటో తాను చేసుకుపోవ డమేగాని, వివాదాలకు తావిచ్చే మనస్తత్వం కాదు ఆయ నది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం, ఆ ముఖంలో అప్పుడప్పుడూ ఒక కొంటెతనం, ఒక వేళాకోళం లాంటి భావాలు కనిపించేవి. కేవలం ముఖంలోనే ఆ మాట లతో ఆ భావాన్ని అస్సలు వ్యక్తపరిచేవారు కాదు. అదుగో ఈ స్వభావాలను బట్టి మేము ఆయనను చూసి గర్వపడతామని చెప్పేది.

మల్లాది నరసింహశాస్త్రి విజయవాడ ఆకాశవాణిలో 1950లో అనౌన్సరుగా జాయిన్ అయ్యారు. అంటే దాదాపు విజయవాడ స్టేషన్ ప్రారంభం నుంచి అందులో పనిచేసి ఆ సంస్థ అభివృద్ధికి తోడ్పడిన వారిలో ఒకరుగా చెప్పవచ్చు. సాహి త్యంలో ‘లత’గా పేరు పొందిన తెన్నేటి హేమలత, ఎ. శ్యామసుందరి, కూచి మంచి కుటుంబరావు, నండూరి పాండురంగ విఠల్ వీరందరూ ఆయన సహోద్యోగులు.

అప్పట్లో అనౌన్సర్స్, ఒక్క అనౌన్స్‌మెంట్‌కే పరిమి తంకాక వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవారు. అలా ఆయన కూచిమంచి ఓబయ్య, బాబయ్య అన్న స్టాక్ క్యారెక్టర్స్‌తో ఒక కార్యక్రమం నడిపేవారు. శ్రోతలు ఆ కార్యక్రమం కోసం ఎదురుతెన్నులు చూసేవారు. అంత పాపులర్. ఆ రోజుల్లోనే సుప్రసిద్ధ రచయిత ఆర్కే నారా యణ్ నవల ‘గైడ్’ని ‘మార్గదర్శి’ అన్న పేరుతో మల్లాది నరసింహశాస్త్రి తెనిగించారు. హైదరాబాద్‌కి వచ్చాక కొన్నాళ్లు అనౌన్సర్‌గానే ఉన్నా, ఆ తరువాత ‘సాం అండ్ హోం’ సెక్షన్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా ప్రమోషన్ పొందారు. ఆ రోజుల్లో ఆయన, నేను కలిసి కొన్నాళ్లపాటు ఉదయం ప్రసారమయ్యే గ్రామస్తుల కార్యక్రమంలో పాడిపంటల మీద ‘బులెటిన్’ చదువుతుండేవారం.

ఆయన హైదరాబాద్ వచ్చాక నాటకాలలో ఎక్కువ పాల్గొనలేదు. విజయవాడలో ఉన్నప్పుడు బుచ్చిబాబు రాసి నిర్వహించిన ప్రతి నాటకంలోను శాస్త్రిని తప్పక తీసుకునేవారని, శాస్త్రి సతీమణి అన్నపూర్ణ చెప్పారు. ఇక్కడ ఒక ఉగాదికి తురగా కృష్ణమోహనరావు రచించిన ‘నవ్వులు పండించే ఉగాది’ అన్న నాటకంలో ఒక కవి పాత్రను పోషించి మెప్పించారు. విజయవాడలో నేను కాజువల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నప్పటినుంచి శాస్త్రిని ఎరుగుదును. అన్నపూర్ణ ప్రసిద్ధ గాయని. ఆవిడ పాడిన ‘రాగ రంజితాత్మవై ఏగుచుంటివా రాధా’ అన్నపాట చాలా ప్రసిద్ధిపొంది, టి.ఎస్. రికార్డ్‌గా వచ్చి రేడియోలో అనేకసార్లు ప్రసారమైంది.

ఆయన చదువుకునే రోజులనుండే వారి కథలు వివిధ మాస, వార పత్రికలలో ప్రచురితమయ్యేవి. ‘ఛాత్రారామ’ అనే చైనీస్ నవలను అనువదించారు. ఆయన కథలన్నీ ‘మణి దీపాలు’ అన్న పేరుతో సంక లనంగా వచ్చాయి. చందమామలో పిల్లల కోసం కథలు రాశారు. మల్లాది నరసింహశాస్త్రి లేని లోటును తట్టుకునే శక్తి వారి కుటుంబానికి కాలమే ఇవ్వాలి.

 శారదా శ్రీనివాసన్,
 వ్యాసకర్త ఆలిండియా రేడియో కళాకారిణి
 మొబైల్ :  94410 10396

Advertisement
Advertisement