ప్రపంచం పెంచిన ‘పొట్టివాడు’ | Sakshi
Sakshi News home page

ప్రపంచం పెంచిన ‘పొట్టివాడు’

Published Wed, Mar 5 2014 12:19 AM

ప్రపంచం పెంచిన ‘పొట్టివాడు’

అతి పెద్ద నిఘా వ్యవస్థ ఉందని చెప్పుకునే అమెరికాకు (కొలంబియా) ఇతడు 1990 నుంచి 2008 వరకు రెండు వందల టన్నుల కొకైన్, హెరాయిన్, మారిజునా వంటివి సరఫరా చేయగలిగాడు. వాటి వాడకంలో కొలంబియాది ప్రపంచంలో అగ్ర తాంబూలం.
 
 సద్దాం హుసేన్, కల్నల్ గడ్డాఫీ, బిన్ లాడెన్ వంటివారు చనిపోయినపుడు ప్రపంచ ం చూసిన హడావుడి ఈ ఫిబ్రవరి 22న కూడా పునరావృతం కావలసి ఉంది. ఎందుకో, అంకుల్‌శామ్ గడబిడ చేయలేదు. ఆ రోజున మత్తు పదార్థాల సామ్రాజ్యాధిపతి జాక్విన్ గూజ్మన్ లొయెరాను మెక్సికో పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి ‘మెక్సికో బిన్‌లాడెన్’ అనే పేరు కూడా ఉంది. లాడెన్ తరువాత ప్రపంచం అంత గా గాలించిన వ్యక్తి ఇతడే. గూజ్మన్ లేదా ఎల్‌చాపోను పట్టిచ్చినవారికి అమెరికా యాభయ్ లక్షల డాలర్లు పారితోషికం ఇవ్వజూపింది. మొత్తంగా ఎల్‌చాపో ‘నెత్తి మీద’ ఉన్న బహుమానం మొత్తం డెబ్బయ్ లక్షల డాలర్లు.  షికాగో రాష్ట్రం ‘పబ్లిక్ ఎనిమీ నెం.1’గా ప్రకటించింది. అమెరికాతో పాటు మెక్సికో, ఇంటర్‌పోల్ కూడా ఎల్‌చాపో కోసం జల్లెడ పట్టాయి. మెక్సికో సైన్యం, అత్యంత కఠినమైన మెక్సికో ‘మెరైన్’ పోలీసులు కూడా ఇతడి కోసం వేటాడారు.
 ఈ పొట్టివాడు (ఎల్‌చాపో అంటే అసలు అర్థం) తన నేర సామ్రాజ్యం నుంచి అమెరికాకూ, ప్రపంచానికీ సవాలు విసిరాడు. సినిమాను తలపిస్తూ ఇతడి కథ ముంబై మాఫియా డాన్‌ల జీవితాలకు సమీపంగా ఉంటుంది. మెక్సికోలోని బాదిరెగ్యుటాలో ఇతడు పుట్టాడు. ఇది సినాలోవా అనే తీర ప్రాంతంలో ఉంది. తన నేర వ్యవస్థకు ఎల్‌చాపో ఆ పేరే పెట్టాడు- సినాలోవా డ్రగ్ కార్టెల్. ఆ ప్రాంతమే మత్తుమందుల రవాణాకూ, వాటి తయారీకీ పేరు మోసింది. ఎల్‌చాపో తండ్రి వృత్తి పశువుల పెంపకమని చెప్పుకున్నా, చేసిన పని గంజాయి పెంచడమే. అతని బంధువులదీ అదే వ్యాపకం. వీళ్లనే అక్కడ గోమెరో అని పిలుస్తారు. తన ప్రత్యర్థి, గల్ఫ్ కార్టెల్ నేర వ్యవస్థ అధిపతి ఉజియల్ కార్డినెస్ 2003లో అరెస్టయిన తరువాత ప్రపంచంలోనే ఎల్‌చాపో అతి పెద్ద మత్తు పదార్థాల రవాణాదారు అయ్యాడు. ‘గాడ్ ఫాదర్ ఆఫ్ డ్రగ్ వరల్డ్’ అన్న బిరుదు సాధించాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులలో ఒకడిగా 2009 నుంచి ఫోర్బ్స్ పత్రిక ఇతడిని ఎంపిక చేయడం మొదలుపెట్టింది. మెక్సికో ధనికుల పదవ స్థానం, ప్రపంచ ధనికుల జాబితాలో 1,140వ స్థానం పొందాడు.


 నేర ప్రపంచంలో ఎల్‌చాపో నైపుణ్యం మాటలకు అందదు. అతి పెద్ద నిఘా వ్యవస్థ ఉందని చెప్పుకునే అమెరికాకు (కొలంబియా) ఇతడు 1990 నుంచి 2008 వరకు రెండు వందల టన్నుల కొకైన్, హెరాయిన్, మారిజునా వం టివి సరఫరా చేయగలిగాడు. వాటి వాడకంలో కొలంబియా ది ప్రపంచంలో అగ్ర తాంబూలం. అమెరికాతో పాటు, ఐరోపా, ఆసియాలకు కూడా ఎల్‌చాపో మత్తుమందులు రవాణా చేస్తాడు. 1993లో గ్వాటిమాలాలో అరెస్టయిన ఎల్‌చాపోను నేరగాళ్ల అప్పగింత ఒప్పందం మేరకు మెక్సికోకు తీసుకువచ్చారు. మత్తు పదార్థాల రవాణా, హత్యలు వంటి నేరారోపణలతో 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇతడు చంపిన వారిలో శత్రువర్గం, పోలీసు విభాగంలోని వారే కాదు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. సినాలోవా కార్టెల్ తన కార్యకలాపాలకు అడ్డంకి లేకుండా చేసుకునేందుకు  గడచిన ఏడేళ్లలో సాగించిన హింసలో 77,000 మంది మరణించారు. అతడికి ఎలాంటి వారినైనా లంచగొండులుగా మార్చే కళ ఉందని ప్రతీతి. ఆ నైపుణ్యంతోనే అత్యంత పటిష్ట భద్ర త కలిగిన మెక్సికో జైలు నుంచి 2001లో అతడు తప్పించుకున్నాడు. లాండ్రీ బాస్కెట్‌లో దాగి బయటపడడానికి జైలు అధికారులకు చెల్లించిన మొత్తం ఇరవై అయిదు లక్షల డాలర్లు. బయటకు వచ్చిన రెండేళ్లకే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మెక్సికోలోనే కొండలలో, అవినీతి రాజకీయవేత్తల అండతో ఈ ఘనకార్యం నిర్విఘ్నంగా చేశాడు.


 చట్టాల కంటె ఎల్‌చాపో ఒక  అడుగు ముందే ఉంటాడని పేరుంది. అరెస్టు వార్త వెల్లడి కాగానే అతడి న్యాయవాదులు వచ్చారు. మొదట ఎల్‌చాపోను నేరగాళ్ల అప్పగింత ఒప్పం దం పేరుతో అమెరికా పంపరాదన్నది వారి వాదన. ప్రభు త్వ అధికారుల వాదన ప్రకారం ఎల్‌చాపో 20 సంవత్సరాల కారాగార శిక్షలో ఎనిమిదేళ్లే అనుభవించాడు. మిగిలిన పన్నెండేళ్లు అనుభవించిన తరువాతే మరో దేశానికి అప్పగిం చవచ్చు. ప్లాస్టిక్ సర్జరీలతో ఎవరికీ అంతుపట్టకుండా తిరిగిన ఎల్‌చాపో కొండల్లో జీవితం భరించలేక బయటకు వచ్చాడు. తన అడ్డాలోనే మాజిట్లాన్ అనేచోటే ఒక హోట ల్‌లో ఒక స్త్రీతో ఉండగా దొరికిపోయాడు. ఇదికాదు వింత. నేరగాళ్లు ప్రపంచాన్ని గడగడలాడించే స్థాయికి ఎదగడానికి రాజకీయవేత్తలు, దేశాలు సహకరిస్తున్న తీరే పెద్ద వింత.
 - డాక్టర్ గోపరాజు నారాయణరావు

Advertisement

తప్పక చదవండి

Advertisement