ప్రకృతి వ్యవసాయంతో.. లాభాల పంట! | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతో.. లాభాల పంట!

Published Mon, Feb 17 2014 4:34 AM

ప్రకృతి వ్యవసాయంతో.. లాభాల పంట! - Sakshi

 ప్రకృతిని ప్రేమిస్తే ఫలాలందిస్తుంది!
     రసాయనిక ఎరువులు, పురుగు మందులకు పూర్తిగా స్వస్తి
     {పసాద్ చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది ప్రకృతి వ్యవసాయం
 
 ‘నీరు అతి మృదువైనది అయితే అది గండశిలా పర్వతాలను పగలదోసుకు దాటగలదు. నేల అట్టడుగు పొరల వరకు చీల్చుకొని చేరగలదు. మృదుత్వం కాఠిన్యతపై ఆధిక్యత సాధించగలదనడానికి ఇది ఉదాహరణ’ అంటాడు చైనా తత్వవేత్త లావోజు. మనిషి, మాట మృదువుగా కనిపించే చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంసీవీ ప్రసాద్‌కు ఈ మాటలు వర్తిస్తాయి. వ్యవసాయం ఏళ్లనాటి శని అని భావిస్తున్న రోజుల్లో చదివిన ఇంజనీరింగ్ చదువును వ్యవసాయానికి వర్తింపజేస్తూ.. సాగు బతుకుకు భరోసాగా నిలుస్తుందని చాటాడు. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఉద్యమస్థాయికి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తూ పెట్టుబడిలేని వ్యవసాయ విధానంతో లాభాల సాగుకు దారులేస్తున్నాడు. ప్రసాద్ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఇంజనీరింగ్ చదివిన ఏ కుర్రాడైనా కార్పొరేట్ సంస్థలు అందించే వేతన ప్యాకేజీని తన ప్రతిభకు కొలమానంగా చూసుకుంటాడు. అయితే, రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రసాద్‌కు తండ్రి వారసత్వంగా వ్యవసాయం అంటే మమకారం అబ్బింది. భూమి తల్లి అంటే ఆయనకు తగని మమకారం. తండ్రి పద్మానాభరెడ్డి వ్యవసాయంలో దిట్ట. మొట్టమొదట మదనపల్లెకు టమాటొ పంటను పరిచయం చేసిన వ్యక్తి. తండ్రి బాటలోనే వారసత్వంగా అందిన 80 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నారు. వ్యవసాయంలోనే దేశ ఆర్థిక మూలాలున్నాయని గట్టిగా నమ్మిన వ్యక్తి. అందుకే తన తండ్రి పద్మనాభరెడ్డి స్ఫూర్తితో సాగు ప్రారంభించారు.

 సేద్యంలో అడుగు మొదలు పెట్టిన తరువాత ఎదురవుతున్న ఆటుపోట్లను దృఢచిత్తంతో ఎదుర్కొంటూనే.. సాధించిన ఫలితాలను మదింపు వేసుకుంటే రసాయనిక వ్యవసాయంలోనే ఎక్కడో తేడా ఉందని భావించి ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. ఆ సమయంలో 2008లో వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్(మహారాష్ట్ర) తిరుపతిలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానంపై నిర్వహించిన శిక్షణా శిబిరానికి ప్రసాద్ హాజరయ్యారు. ఈ విధానాన్ని ఆకళింపు చేసుకొని సంతృప్తిగా ప్రకృతి వ్యవసాయం చేసు ్తన్నారు. భార్య యోగిత, స్నేహితుడు గుణశేఖర్‌రెడ్డి తోడ్పాటుతో మిరప, టొమాటొ, క్యాప్సికం, వంగ, మొక్కజొన్న, వేరుశెనగ, కందులు, మినుములు పండిస్తున్నారు. దవనం, నిమ్మగడ్డి సాగు చేసి వాటితో సుగంధ తైలం ఉత్పత్తి చేసి, ఎగుమతి చేస్తున్నారు.
 ఎకరానికి 48 బస్తాల ధాన్యం దిగుబడి

 2008కి ముందు రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ప్రసాద్‌కు ఏటా రూ. పది లక్షలు ఖర్చయ్యేవి. ప్రకృతి వ్యవసాయానికి మారి జీవామృతం తదితరాలు వాడుతున్నందున పెట్టు బడులు గణనీయంగా తగ్గాయి. వరిలో ఎకరానికి తొలుత 37 బస్తాల దిగుబడి రాగా, తర్వాత 48కి పెరిగింది. ఈ ప్రాంతంలో రసాయనిక ఎరువులతో సాగుచేస్తున్న టొమాటొ 2 నెలలు కాపునిస్తుండగా ప్రసాద్ పొలంలో 3 నెలలకుపైగా నాణ్యమైన దిగుబడి వస్తోంది.  
 రెట్టింపైన సుగంధ తైలం దిగుబడి

 లాభసాటిగా ఉండే దవనం, నిమ్మగడ్డి వంటి పంటల వైపు ప్రసాద్ దృష్టి సారించారు. రసాయనిక ఎరువులతో సాగు చేసినప్పుడు టన్ను దవనం నుంచి ఒక కిలో సుగంధ తైలం దిగుబడి వచ్చేది. ప్రకృతి సేద్య విధానానికి మారిన తరువాత దవనం నుంచి టన్నుకు సుమారు 2.2 కిలోల తైలం దిగుబడి వస్తోంది. అత్యధిక విస్తీర్ణంలో దవనం సాగు చేసి సుగంధ తైలాలను ఉత్పత్తి చేసినందుకు 2005లో అప్పటి రాష్ట్రపతి కలామ్ చేతుల మీదుగా సీఎస్‌ఐఆర్ ఉన్నతి అవార్డు అందుకున్నారు. ఆ తరువాత అనేక సంస్థలు ప్రసాద్‌కు అవార్డులతో సత్కరించాయి. మధుమేహ నివారణ ఔషధాలలో వాడే సెలేషియా పంటను టకామా కంపెనీ(జపాన్)తో ఒప్పందం మేరకు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. జన్యుమార్పిడి, హైబ్రిడ్ విత్తనాల అవసరం లేదని నమ్మే ప్రసాద్ దేశవాళీ విత్తనాలనే వాడుతూ ఉంటారు. 8 దేశీ జాతుల ఆవులనూ మక్కువతో పెంచడం విశేషం.    
 - ఎం.చంద్రమోహన్, న్యూస్‌లైన్,
 మదనపల్లె సిటీ, చిత్తూరు జిల్లా
 
 ప్రకృతి వ్యవసాయమే సంక్షోభానికి పరిష్కారం
 వ్యవసాయ రంగంలో సంక్షోభం పరిష్కారమవ్వాలంటే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో సాంద్ర వ్యవసాయం మాని ప్రకృతి వ్యవసాయం చేయడమే మార్గం. ఈ విధానంలో నేలలో సూక్ష్మజీవులు, వానపాములు వృద్ధి చెంది పోషకాలను పుష్కలంగా అభివృద్ధి చేస్తాయి. నేలకు నీటి తేమను పట్టి ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. 700 అడుగుల బోర్ వేస్తేనే తప్ప నీటి చుక్క జాడ దొరకని ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా చేయగలగడంలో ఉన్న రహస్యం ఇదే.
 - ఎంసీవీ ప్రసాద్ (94401 68816), చిన్నతి ప్పసముద్రం, మదనపల్లె, చిత్తూరు జిల్లా

Advertisement
Advertisement