అపూర్వం... అపురూపం! | Sakshi
Sakshi News home page

అపూర్వం... అపురూపం!

Published Mon, Jan 6 2014 11:05 PM

Naughty boy’ GSLV makes Isro parents proud with successful blast-off

 ‘నేను వైఫల్యాలను మూటగట్టుకుంటున్నానన్నది నిజం కాదు. ఎన్ని రకాలుగా పొరపాట్లు చేయడానికి ఆస్కారముందో తెలుసుకుంటున్నాన’ంటాడు సుప్రసిద్ధ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. రెండు దశాబ్దాలుగా వైఫల్యాలను ఎదుర్కొన్నా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కృషి చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు చివరకు విజయపతాక ఎగరేశారు. ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-డీ5 మన అంతరిక్ష విజయ ప్రస్థానంలో ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇస్రో కీర్తికిరీటంలో అది మరో కలికితురాయి అయింది. ఇదంత సులభంగా చేజిక్కలేదు. అలవోకగా చేతికి రాలేదు.
 
 జీఎస్‌ఎల్‌వీ (జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్లకు దేశీయంగా అభివృద్ధి చేసుకున్న క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించాలన్నది మన శాస్త్రవేత్తల సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వైఫల్యాలను ఎదుర్కొన్నా అవి సరిదిద్దుకోలేనిగా వారు భావించలేదు. కుంగిపోలేదు. తాము సాధించాల్సిన విజయానికి వాటిని సోపానాలుగా మలుచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో దీన్ని ప్రయోగించాల్సివున్నా చివరి నిమిషంలో ఇంధనం లీక్ కావడాన్ని గమనించి వాయిదా వేశారు. ప్రయోగ వేదికనుంచి రాకెట్‌ను వెనక్కు తెచ్చి లోపాలను చక్కదిద్దారు. డిజైన్‌లో అవసరమైన మార్పులు చేశారు. ఒకటికి పదిసార్లు పరీక్షించుకుని సూక్ష్మ లోపాలను కూడా పరిహరించగలిగారు.
 
 క్రయోజెనిక్ పరిజ్ఞానం విషయంలో మన శాస్త్రవేత్తలు అంత పట్టుదలగా ఉండటానికి కారణాలున్నాయి. ఎన్నడో 1992లో ఆ పరిజ్ఞానంతో కూడిన ఇంజిన్లను, సాంకేతికతను అందజేయడానికి రష్యాతో ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా అది కొన్ని ఇంజిన్లను అందజేసింది కూడా. కానీ ఈలోగా మన అణు పరీక్షల నేపథ్యంలో అమెరికా ఆగ్రహించి తాను ఆంక్షలు విధించడమే కాక...రష్యా కూడా సాయం చేయడానికి వీల్లేదని అడ్డుపుల్లలేసింది. ఫలితంగా రష్యానుంచి క్రయోజెనిక్ ఇంజిన్లు రావడం ఆగిపోయింది. ఇక స్వదేశీ పరిజ్ఞానంపైనే ఆధారపడాలని మన శాస్త్రవేత్తలు సంకల్పించారు. 2010 ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ- డీ3ని ప్రయోగించి విఫలమయ్యారు. దాంతో ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్‌లో ఎస్‌ఎల్‌వీ-ఎఫ్6ను రష్యా ఇంజిన్‌తో ప్రయోగించి చూశారు. కానీ, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. మొత్తానికి డుసార్లు జీఎస్‌ఎల్‌వీని ప్రయోగిస్తే కేవలం రెండుసార్లు మాత్రమే విజయం చేతికందింది. పర్యవసానంగా భారీ ఉపగ్రహాలను కొన్నిసార్లు ఫ్రెంచి గయానానుంచి ప్రయోగించాల్సివచ్చింది.
 
  శాస్త్రవేత్తలకు ఇన్ని పరీక్షలు పెట్టిన క్రయోజెనిక్ పరిజ్ఞానం ఎంతో కీలకమైనది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉండే భూ స్థిర కక్ష్యలోనికి అధిక బరువుతో ఉండే ఉపగ్రహాన్ని పంపాలంటే అది క్రయోజెనిక్ పరిజ్ఞానంతోనే సాధ్యం. అయితే, అది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రాకెట్‌లో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగించాల్సివస్తుంది. మిగిలిన రెండు దశలూ సాధారణమైనవే. కానీ, క్రయోజెనిక్ దశ కొరకరాని కొయ్య. ఇందులో వాడే హైడ్రోజన్‌నూ, దాన్ని మండించడానికి వాడే ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చాలంటే వాటిని నిర్దిష్ట స్థాయికి శీతలీకరించ్సాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం లోపం తలెత్తినా హైడ్రోజన్, ఆక్సిజన్‌లు వాయురూపంలోకి మారిపోతాయి.
 
  హైడ్రోజన్ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వద్దా, ఆక్సిజన్ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్ 183 డిగ్రీలవద్దా ఉండాలి. ఆ ఉష్ణోగ్రతల్లో ఉండే ఇంధనాలను శూన్యంలో మండించడమంటే మాటలు కాదు. భారీ ట్యాంకుల్లో ఉండే ఈ రెండు వాయువులనూ శీతలీక రణ స్థితిలో ఉంచడానికి అనువుగా ఇంజిన్‌లోని పరికరాలనూ, పైపులనూ కూడా శీతల స్థితిలోనే ఉంచాలి. శాస్త్రవేత్తలకు ఇదంతా పెను సవాల్. మనపై ఆంక్షలు విధించిన అమెరికాకు దీటైన జవాబివ్వడంతోపాటు ఒకరిపై ఆధారపడే స్థితిని అధిగమించడానికీ, భారీ వ్యయాన్ని తగ్గించుకోవడానికీ ఈ సవాల్‌ను శాస్త్రవేత్తలు ఛేదించారు. రష్యా క్రయోజెనిక్ ఇంజన్ల వ్యయం దాదాపు రూ.100 కోట్లుకాగా, మన శాస్త్రవేత్తలు అదే ఇంజిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో రూ.40 కోట్లకు రూపొందించగలిగారు.
 
 అంతరిక్ష పరిజ్ఞానంలో గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడానికి, వాణిజ్యపరంగా భారీ మొత్తాలను రాబట్టుకోవడానికి ఇన్నాళ్లూ అగ్ర రాజ్యాలు క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని ఎవరికీ అందనివ్వలేదు. ఉన్నతస్థాయి పరిశోధనలైనా, అందుకవసరమైన తెలివితేటలైనా తమకే సొంతమని అవి భావించాయి. కానీ, మన శాస్త్రవేత్తలు వారి భ్రమలను పటాపంచలు చేశారు. వారి గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. ఇదేమంత సులభంగా సమకూరలేదు. జీఎస్‌ఎల్‌వీ వైఫల్యాలు ఎదురైనప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విజయవంతమైనప్పుడూ జీఎస్‌ఎల్‌వీ వైఫల్యాలను గుర్తుచేసినవారున్నారు. వాటి సంగతేమిటని ప్రశ్నించినవారున్నారు. కానీ, శాస్త్రవేత్తలు నిరాశచెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాకే క్రయోజెనిక్ సాంకేతికతను సొంతం చేసుకోగలిగాయన్న ఎరుకతో పట్టుదలగా పనిచేశారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే ఈరోజు విజయాన్ని చేరువ చేసింది. మరో రెండేళ్లలో ప్రయోగించదలుచుకున్న చంద్రయాన్-2కు, అటు తర్వాత కాలంలో ప్రయోగించదలుచుకున్న మానవసహిత అంతరిక్ష వాహక నౌకకూ జీఎస్‌ఎల్‌వీ, అందులో వాడే క్రయోజెనిక్ పరిజ్ఞానం ముఖ్యమైనవి. ఆదివారంనాటి విజయం ఈ మార్గంలో మరిన్ని ముందడుగులు వేసేందుకు దోహదపడుతుంది. అందువల్లే ఈ విజయం ఎంతో అపురూపమైనది. అపూర్వమైనది. అందుకు మన శాస్త్రవేత్తలను అభినందించాలి.

Advertisement
Advertisement