ఆరోగ్యమంటే అలుసేనా? | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమంటే అలుసేనా?

Published Thu, Apr 17 2014 12:53 AM

ఆరోగ్యమంటే అలుసేనా? - Sakshi

 మంచి ఆహారం, ఇల్లు, పారిశుద్ధ్యం ఆరోగ్యానికి ప్రధానం. కానీ దేశంలో 20 కోట్ల మందికి చాలినంత ఆహారం లేదు. క్షుధార్తుల సూచిలో మన స్థానం 66. కాంగ్రెస్ ఆహార భద్రత చట్టం తెచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇవి ఆకలి తీర్చగలవా? ఆరోగ్యానికి సహాకరించేవా?
 
 ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, లేదా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు కూడా వైద్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయి. 123 కోట్ల ప్రజల ఆరోగ్యం గురించి మన రాజకీయ పార్టీలలో ఎంత ఉదాసీనత నెలకొని ఉన్నదో దీనితో రుజువయింది. సార్వత్రిక ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తామని 2005 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సులో మనం కూడా సంతకం చేశాం. కానీ మొదటి అడుగు కూడా వేయలేదు. బహుశా భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు సంతకం చేసి, ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేస్తున్నదేమో!
 
 కాంగ్రెస్‌కు ఆరోగ్య ప్రణాళికే లేదు
 
 1970 దశకం నుంచి చూసినా  ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం మేనిఫెస్టోలలో పొందుపరిచిన హామీలేమీ కానరావు. ఇప్పుడు కూడా రెండు పార్టీలు దాదా పు సమాన నిర్లక్ష్యాన్నే ప్రదర్శించాయి. స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) ఆరోగ్యం మీద చేసే వ్యయం గురించి అన్ని దేశాలు సూత్రబద్ధ వైఖరిని కలిగి ఉంటాయి. యూపీఏ తన మేనిఫెస్టోలో నేషనల్ రూరల్ హెల్త్ కమిషన్ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. నేషనల్ రూరల్ కమిషన్ (2005-2012) యూపీఏ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆరోగ్య కార్యక్రమం. ఇంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీడీపీలో దీని వ్యయం 0.9 నుంచి 2 శాతానికీ, తరువాత మూడు శాతానికీ పెంచాలి. ఆ పెంపు 1.2 దగ్గరే ఉంది. ఇప్పుడు దానినే మూడు శాతానికి పెంచుతామని చెప్పడం మోసగించడమే. బీజేపీ ఈ అంశం జోలికే వెళ్లలేదు. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జీడీపీలో ఆరోగ్యం కోసం ఐదు శాతం ఖర్చు చేయాలని నిర్దేశిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో ఆరోగ్య ప్రణాళికను కూడా రూపొందించలేదు. ఇలాంటి ప్రణాళికను గురించి తాజా మేనిఫెస్టో కూడా చెప్పలేదు.
 
 బీజేపీ మేనిఫెస్టోలో ఓఓపీ
 
 దేశంలో రూపొందిన ఆఖరి ఆరోగ్య ప్రణాళిక 2002 నాటిది. అంటే ఎన్డీఏ రూపొందించినది. దీనినే కాంగ్రెస్ అమలు చేసింది. బీజేపీ కొత్త ఆరోగ్య ప్రణాళికను గురించి ప్రస్తావించింది. ఆరో గ్య సమస్యలను అధ్యయనం చేయడానికి ఈ ప్రణాళికను ప్రతిపాదిస్తున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ విడిచిపెట్టినా, బీజేపీ ప్రతిపాదించిన మ రో అంశం- నేషనల్ అసూరెన్స్ మిషన్. దీని ద్వారా స మర్థమైన ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం తన ఆశయంగా ఆ పార్టీ చెప్పుకున్నది. ఈ మిషన్ ద్వారానే ఔటాఫ్ పాకెట్ ఎక్స్పెండీచర్ (ఓఓపీ) తగ్గిస్తామని బీజేపీ ప్రకటించడం ఉదాత్తంగానే ఉంది. ప్రజలే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకోవడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఓఓపీ అని పిలుస్తున్నారు. మన దేశంలో ఓఓపీదే పై చేయి. 70 శాతం కుటుంబాలు ఆదాయమంతా ఆస్పత్రులకే పోస్తున్నాయి. వైద్య ఖర్చుల పు ణ్యమా అని ఏటా 39 మిలియన్‌ల ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు పోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 30 శాతం ప్రజలు ఖర్చులకు భయపడి ఆస్పత్రుల వంకే చూడడం లేదు. దేశంలో జరుగుతున్న వైద్య వ్యయంలో 60 శాతం ప్రజలే భరించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన 2010 నివేదిక ప్రకారం, ఓఓపీ 15 నుంచి 20 శాతానికి మించి ప్రజలు భరించవలసి వస్తే కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. అయినా ఈ అంశం కాంగ్రెస్ దృష్టికి రాలేదు.
 
 గ్రామీణ ఆరోగ్యం
 
 ఈ అంశాన్ని రెండు పార్టీలూ ప్రస్తావించాయి. బీయస్సీ (సామాజిక ఆరోగ్యం) కోర్సును ప్రవేశపెట్టి, అభ్యర్థులను తయారు చేసి గ్రామ ప్రాంతాలలో వైద్యుల కొరత తీర్చడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పేర్కొన్నది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలి పింది కూడా. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలను అందిం చే కృషికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని బీజేపీ కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ చేస్తున్న ఈ యోచనలో గ్రామీణ భారతం పట్ల వివక్ష సుస్పష్టం. 2011 లెక్కల ప్రకారం గ్రామీణ భారతీయుల సంఖ్య 83.3 కోట్లు (68 శాతం). ఆ ఏడాది ఆరోగ్య గణాంకాల ప్రకారం దేశంలో 23,887 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1,48,124 ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికను చూస్తే మరో 7,048 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 35,762 ఉపకేంద్రాలు అవసరం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కావలసిన వైద్యుల సంఖ్య 30,051. అందుబాటులో ఉన్న డాక్టర్లు 26,329 మంది. ఇక దేశంలో ఏటా 45,000 మంది ఎంబీబీఎస్‌లు తయారవుతున్నారు. మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న డాక్టర్ల సంఖ్య ఏడులక్షలు. అంటే ఒక్క ఏడాది బయటకు వచ్చిన డాక్టర్లలో 70 శాతం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చాలు. కానీ అరవయ్యేళ్లు దేశాన్ని ఏలిన కాం గ్రెస్ ఇప్పుడు వైద్యులను గ్రామీణ ప్రాంతాలకు పంపలేక బీయస్సీ (సామాజిక ఆరోగ్యం) అభ్యర్థుల ద్వారా ఆ కొరతను తీర్చాలని చూస్తోంది. వారు డాక్టర్లు కాదు. కాబట్టి ఇది కంటి తుడుపే. వైద్య విద్యను బాగు చేయకుండా వైద్యాన్ని బాగు చేయడం కష్టం. వైద్య విద్యను ప్రక్షాళించే యోచన మన రాజకీయ పార్టీలకు ఉందా?
 
 శిశు మరణాలూ పట్టలేదు
 
 సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అంశాల పట్ల వ్యవస్థకు ఉన్న శ్రద్ధ ఏ పాటిదో శిశు మరణాలు అద్దం పడతాయి. కానీ రెండు జాతీయ పార్టీలు ఈ అంశానికి చోటివ్వనే లేదు. ఒక సంవత్సరంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలోని వేయి జననాలలో ఏడాది లోపు పిల్లల మరణాలను బట్టి వీటి రేటును నిర్ణయిస్తారు. దేశంలో ఈ మరణాల రేటు ప్రస్తుతం 42. ఈ రేటు చైనాలో 15, ఎంతో చిన్న దేశమైన శ్రీలంకలో 9. దేశంలో శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించామని కాంగ్రెస్ మేనిఫెస్టో చాటుకుంది. వాస్తవం ఏమిటి? 2010 సంవత్సరానికల్లా ఈ రేటును 30కి తగ్గించాలని  జాతీయ ఆరోగ్య ప్రణాళిక (2002)లో నిర్దేశించుకున్నాం. నేషనల్ రూరల్ హెల్త్ కమిషన్‌లోనూ  2012 నాటికల్లా 30కే తగ్గిస్తామని కూడా కాంగ్రెస్ ప్రతిన చేసింది. ఏదీ జరగలేదు. ఈ నేపథ్యంలో సహస్రాబ్ది లక్ష్యాలను గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఈ రెండు పార్టీలు గుర్తించవలసిన అంశం- ప్రపంచ దేశాల సరసన మన గౌరవం నిలబడాలంటే, శిశు మరణాల రేటు త గ్గినపుడే సాధ్యం.
 
 ఆకలి తీరిస్తేనే ఆరోగ్యం
 
 మంచి ఆహారం, ఇల్లు, పారిశుధ్యం ఆరోగ్యానికి ప్రధానం. కానీ దేశంలో 20 కోట్ల మందికి చాలినంత ఆహారం లేదు. క్షుధార్తుల సూచిలో మన స్థానం 66. కాంగ్రెస్ ఆహార భద్రత చట్టం తెచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇవి ఆకలి తీర్చగలవా? ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా ఆకలికి దూరం చేయగలమా? కొనుగోలు శక్తి పెరగాలంటే అంతరాలు తగ్గాలి. వీటి ప్రస్తావన మేనిఫెస్టోలలో లేదు. గృహ వసతి, రక్షిత మంచినీరు వంటి అంశాలకు తగినంత ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ పని చేసే మరుగుదొడ్ల గురించి పేర్కొన్నది. బీజేపీ మాత్రం 2019 నాటికి (గాంధీజీ 150వ జయంతి) ‘స్వాచ్ఛ్ భారత్’ ను సాధిస్తామని చెప్పింది. ప్రతి రాష్ట్రంలోను ఎయిమ్స్ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న బీజేపీ యోచన ఆహ్వానించదగినదే. కానీ ప్రతి సూపర్ స్పెషాలిటీ అన్న నినాదం సరికాదు. ఇక స్థానిక సంస్థలకు పారిశుధ్యం, ఆరోగ్యం అప్పగించడానికి ఉద్దేశించిన 73వ రాజ్యాంగ సవరణ గురించి ఎవరికీ పట్టలేదు.
 
 విశ్లేషణ: డాక్టర్ ఆరవీటి రామయోగయ్య
 (వ్యాసకర్త ఏపీ ఆరోగ్యశాఖ మాజీ సంచాలకులు)
 

Advertisement

తప్పక చదవండి

Advertisement