ఎన్‌కౌంటర్లకు ముగుదాడు! | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లకు ముగుదాడు!

Published Fri, Sep 26 2014 2:09 AM

ఎన్‌కౌంటర్లకు ముగుదాడు! - Sakshi

చట్టాన్ని రక్షించడానికి ఉద్దేశించిన పోలీసు శాఖ మానవహక్కులను, వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ సంస్థలు ఇదే చెబుతున్నాయి. అనవసర బలప్రయోగం, వ్యక్తుల ఆచూకీ రూపుమాపడం వంటి పనులు సమర్థనీయం కాదని కూడా అంతర్జాతీయ సంస్థలు ఘోషిస్తున్నాయి. వీటన్నిటి ఫలితమే సుప్రీంకోర్టు తాజా తీర్పు.
 
ఎన్‌కౌంటర్ల మీద సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు పౌరహక్కుల సంఘాల వాదన సబబైనదని నిరూపించింది. ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం జీవించే హక్కును కల్పించింది. ఈ ప్రాథమిక హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వ యంత్రాంగానికీ లేదు. చట్టం ముందు అంతా సమానులేనన్న న్యాయసూత్రం పోలీసు యంత్రాంగానికి కూడా వర్తిస్తుంది. ఇతర అసహజ మరణాల కేసుల మాదిరిగానే ఎన్‌కౌంటర్ సంఘటనలలో కూడా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలన్నదే భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పు సారాంశం. ఎన్‌కౌంటర్ జరిగినపుడు క్రిమినల్ కేసు నమోదు చేసి, సీఐడీ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు జరిపించాలని ఈ తీర్పు స్పష్టం చేసింది.

రాష్ట్ర హైకోర్టు తీర్పు బాటలోనే!
రోజురోజుకీ నేరాల సంఖ్య పెరుగుతోంది. నేరాల అదుపు పేరుతో పోలీసులు చేసే ఎన్‌కౌంటర్ల సంఖ్య, అనుమానితులను చిత్రహింసలకు గురిచేస్తున్న ఉదంతాల సంఖ్య కూడా పెరిగి పోతున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ గత ఏడాది వెలువరించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. పోలీసు శాఖలో ‘అవుటాఫ్ టర్న్’ పదోన్నతులకూ భారీ నగదు బహుమానాలకూ ఎన్‌కౌంటర్లు ఒక సాధనంగా మారిపోయాయన్న ఆరోపణలు కూడా తక్కువేమీ కాదు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా, జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు చాలా విషయాలను గురించి ప్రస్తావించింది. పీయూసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఈ నెల 23న ఈ కీలక తీర్పు వెలువడింది. ఎన్‌కౌంటర్ ఘటనలకు సంబంధించి గతంలో రాష్ర్ట హైకోర్టు మధుసూదన్ రాజ్ యాదవ్ కేసులోను, మరో కేసులోను ఇచ్చిన తీర్పు బాటలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శక సూత్రాలను కూడా నిర్దేశించింది.
 
సుప్రీం మార్గదర్శకాలు
ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టుకు పంపించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. నేరగాళ్ల ఉనికి, వారి చర్యలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఆ సమాచారాన్ని తప్పని సరిగా కేసు డైరీలో నమోదు చేసిన తరువాతనే ఘటనా స్థలానికి పోలీసుల బృందం వెళ్లవలసి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. దీనితో బూటకపు ఎన్‌కౌంటర్లకు అడ్డుకట్ట పడుతుంది.  ఇంకా, ఎన్‌కౌంటర్‌లో మరణం సంభవిస్తే  ఆ మృతుడిని గుర్తించేందుకు వీలుగా కలర్ ఫోటో తీయించాలి. సంఘటన స్థలం దగ్గర  ఉన్న సాక్షుల సమాచారాన్ని నమోదు చేసి, వారి ఫోన్ నంబర్లు కూడా నమోదు చేయాలి. ఘటన జరిగిన వెంటనే సాక్షుల ఫోన్ నంబర్లను వాంగ్మూలాలను నమోదు చేసినట్టయితే తరువాత దశలలో విచారణను పక్కదోవ పట్టించడానికి ఆస్కారం ఉండదు.

అలాగే  సంఘటనలో పాల్గొన్న పోలీసుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలి. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులతో శవపరీక్ష చేయించి, ఈ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలి. ఘటనాస్థలంలో లభించిన తుపాకీని, బులెట్లనూ ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలి. మేజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించి, నివేదికను సీఆర్‌పీసీలోని సెక్షన్ 190 ప్రకారం మేజిస్ట్రేట్‌కు పంపించాలి. ఈ చర్య పోలీసుల కల్లబొల్లి కబుర్లకూ, కాకమ్మ కథలకు తావు లేకుండా చేయగలదు. అయితే ప్రతి ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన దర్యాప్తునూ, దాని నివేదికనూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు పంపవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది కొంతమేరకు పోలీసులకు ఊరట కల్పించేదే. ఒకవేళ పోలీసుల చేతిలో ఎవరైనా గాయపడితే వారికి వైద్యం అందించాలి. బాధితుడి వాంగ్మూలాన్ని వైద్యాధికారి చేత నమోదు చేయించాలి. సంఘటన మీద వీలైనంత త్వరగా దర్యాప్తు జరిపించి, సీఆర్‌పీసీ సెక్షన్  173 ప్రకారం తుది నివేదికను లేదా చార్జిషీట్‌ను సంబంధిత కోర్టుకు నివేదించాలి. వీలైనంత త్వరగా ట్రయల్ ముగించాలి.

అమాయకులకు బాసట
ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో పోలీసులకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. అయితే ఎన్‌కౌంటర్‌లో మరణించిన వ్యక్తి సమాచారం వెంటనే సమీప బంధువులకు తెలియపరచాలని కోర్టు నిర్దేశించింది. కాబట్టి ‘కాల్పులలో గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అంటూ ప్రకటించడం ఇకపై సాధ్యం కాదు. ఇంకొక విషయం- ఎన్‌కౌంటర్‌లో వ్యక్తి తుపాకీ కాల్పుల వల్ల మరణించినట్టు దర్యాప్తులో రుజువైతే, అది ఐపీసీ నేరం కిందకు వస్తే ఇందుకు కారకుడైన పోలీసు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మృతుడు పోలీసుల చేతిలోనే హతమైనట్టయితే, అతడి కుటుంబానికి విధిగా పరిహారం చెల్లించాలి. నిజానికి ఇలాంటి ఘటనలలో పరిహారం చెల్లించిన ఉదంతాలు దేశంలో అరుదు. తాజా తీర్పు ప్రకారం పోలీసుల చేతిలో అమాయకులు బలైతే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే. బాధ్యులైన పోలీసు అధికారులు వెంటనే తమ రివాల్వర్‌నూ, బులెట్లనూ ఫోరెన్సిక్, బాలిస్టిక్ నిపుణులకు అప్పగిం చాల్సిందే. అయితే పోలీసు అధికారికి అవసరమైన న్యాయ సహాయం మాత్రం అందించాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది.

శౌర్య పతకాలకు తొందరొద్దు
పోలీసులు నేరం చేయలేదని ఎన్‌కౌంటర్ ఉదంతం మీద జరిపిన  విచారణలో వారు బయటపడాలి. ఈ లోపున ఘటనతో సంబంధం ఉన్న పోలీసు అధికారులకు అవుట్ ఆఫ్ టర్న్ పదోన్నతులు కల్పించడం, నగదు ప్రోత్సాహకాలూ, శౌర్య పతకాల బహూకరణ సరికాదని సుప్రీంకోర్టు నిర్దేశించింది.  సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించలేదని మృతుడి కుటుంబీకులు భావిస్తే వారు జిల్లా సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేయవచ్చు. ఈ అవకాశం కల్పించడం వల్ల బూటకపు ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఫిర్యాదు అందుకున్న జిల్లా సెషన్స్ జడ్జి విచారణ జరిపి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తోంది.

నేరాల అదుపు, హక్కుల రక్షణ
ఎన్‌కౌంటర్ అంటే అవతలి వ్యక్తి దాడి చేసినప్పుడు స్వీయ రక్షణ కోసం పోలీసు బృందం చేసే ఎదురుదాడి. కానీ కాలక్రమేణా ఇది మరో రూపం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌ల పేరుతో అమాయకులు, గిట్టనివారి ఏరివేత మొదలైంది. దీనితో పౌర హక్కుల సంఘాలు, మానవహక్కుల సంఘాలూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. పౌరుల హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు కలగచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చట్టాన్ని రక్షించడానికి ఉద్దేశించిన పోలీసు శాఖ మానవహక్కులను, వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇదే చెబుతున్నాయి. అనవసర బలప్రయోగం, వ్యక్తుల ఆచూకీలు రూపుమాపడం వంటి పనులు సమర్థనీయం కాదని కూడా అంతర్జాతీయ సంస్థలు ఘోషిస్తున్నాయి. వీటన్నిటి ఫలితమే సుప్రీంకోర్టు తాజా తీర్పు. నేరాలను అదుపు చేయవలసిన బాధ్యత పోలీసులదే.

అమాయకుల రక్షణ బాధ్యత కూడా వారిదే. అయితే చట్టాన్ని రక్షించే పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించదలచే అధికారులకు సుప్రీం తీర్పు గుదిబండగా మారక తప్పదు. అదే సమయంలో మానవ హక్కులకు ఈ తీర్పు రక్షణ కవచమవుతుంది. ఎన్‌కౌంటర్ల కేసులను ఇతర కేసుల మాదిరిగా పరిగణించడం సాధ్యం కాదన్న పోలీసుల వాదనలకీ, ఇలాంటి కేసులలోను ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పౌర హక్కుల ఉద్యమ వాదనకీ కూడా ఇక తెరపడుతుంది. ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ తీర్పును శిరసావహించాలి. నేరగాళ్లకే హక్కులు గానీ, మాకు లేవా అని వాదించే పోలీసులు లేకపోలేదు. కానీ నాగరిక సమాజంలో నేరాల అదుపుతో పాటు మానవహక్కుల పరిరక్షణ కూడా కీలకమే. ఈ కోణం నుంచే సుప్రీం కోర్టు తీర్పును చూడాలి.

(వ్యాసకర్త హైకోర్టు న్యాయవాది)

Advertisement

తప్పక చదవండి

Advertisement