Sakshi News home page

మనోహర్ పారికర్ రాయని డైరీ

Published Sun, Sep 27 2015 12:46 AM

మనోహర్ పారికర్ రాయని డైరీ

కాంటే  సే కాంటా నికల్‌నా. ముల్లును ముల్లుతోనే తీయాలి. డి.ఆర్.డి.ఒ. డైరెక్టర్స్ కాన్ఫరెన్స్‌కు వెళ్లినప్పుడు ఆ కాంపౌండ్‌లో నా కాలికి ముల్లు గుచ్చుకుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న మాట అప్పుడు గుర్తుకు రాలేదు. చేత్తో తీయబోతే లోపలికి వెళ్లిపోయింది! ఇప్పుడు నొప్పెడుతోంది. పాపం అప్పటికీ పరుగెత్తుకొచ్చాడు క్రిస్టఫర్... ‘క్యా హువా మంత్రీజీ’ అంటూ. కాల్లో ముల్లు దిగింది, దాన్ని తీయడానికి మంచి ముల్లు ఏదైనా దొరుకుతుందేమో చూడమన్నాను.

‘ముల్లెందుకు మంత్రీజీ, ల్యాబ్‌లో ఫోర్‌సెప్స్ ఉంటుంది పట్రమ్మంటారా’ అన్నాడు. ‘ముల్లును ముల్లుతోనే తియ్యాలని కదయ్యా నా ఉద్దేశం. అర్థం చేసుకోలేకపోతే ఎలా అంత పెద్ద డి.ఆర్.డి.ఒ. కి హెడ్డుగా ఉండి’ అన్నాను. హర్ట్ అయినట్లున్నాడు! ఈ మనుషులు ఇంత ఫ్రీక్వెంట్‌గా ఎందుకు హర్ట్ అవుతుంటారో అర్థంకాదు. ఒకసారి, రెండుసార్లు! మాటిమాటికీ హర్ట్ అవుతూపోతుంటే ఎలా? హర్ట్ కానివాళ్లను కూడా హర్ట్ చేయగల చిదంబరంలాంటి వాళ్లను ఇక వీళ్లెలా తట్టుకుంటారో మరి.
 
 ఆ మధ్య నన్ను హర్ట్ చెయ్యాలని చూశాడు చిదంబరం. టైస్టుల్ని టైస్టులతోనే ఏరిపారేయాలి అన్నందుకు! టెరిబుల్ స్టేట్‌మెంట్ ఇచ్చానట! దాన్ని వెనక్కి తీసుకోమంటాడు. ఇచ్చేది తీసుకోడానికా! డిఫెన్స్ మినిస్ట్రీని తీసుకెళ్లి డిఫెన్స్‌లో పడేసుకోడానికా? అవతలివాడు టైస్టును పంపుతుంటే వాడి మీద పోరాటానికి నేను నా సైనికుడిని ఎందుకు పంపుతాను? టైస్టునే పంపుతాను. సింపుల్ లాజిక్ కదా! పవర్ పోయాక కాంగ్రెస్ వాళ్లకి విల్ పవర్ కూడా పోయినట్లుంది. ఏదేదో మాట్లాడేస్తున్నారు.
 
 క్రిస్టఫర్, నేను నడుస్తున్నాం. ‘ఇక్కడ ముల్లు దొరకడం కష్టం మంత్రీజీ’ అంటున్నాడు క్రిస్టఫర్! ప్రకృతిలో ముళ్లే లేవా అన్నాన్నేను. మీరు వస్తున్నారని చెప్పి ప్రకృతినంతా నిన్ననే క్లీన్ చేశాం మంత్రీజీ అన్నాడు క్రిస్టఫర్.
 క్లీన్ చేశాకే కదా నాకు ముల్లు గుచ్చుకుంది. గుచ్చుకోడానికి ముల్లు ఉండి, గుచ్చుకున్న ముల్లును తీయడానికి ముల్లు లేకపోవడం ఏమిటి?!
 
 క్రిస్టఫర్ చేతులు నలుపుకుంటున్నాడు. ‘నీకేమైంది? చేతికి ముల్లు గుచ్చుకుందా.. ప్రకృతిని క్లీన్ చేయిస్తుంటే?’ అన్నాను. ‘లేదు మంత్రీజీ’ అన్నాడు. మరి! ‘బడ్జెట్ లేదు మంత్రీజీ’ అన్నాడు. చైనా ట్వంటీ పర్సెంట్ ఖర్చుపెడుతుంటే, మనం ఫైవ్ పర్సెంటే ఖర్చుపెడుతున్నామట. ‘సరే, చూద్దాం. ఉన్న బడ్జెట్‌తోనే కాంపౌండ్‌లో అక్కడక్కడా ముళ్ల చెట్లను పెంచండి’ అని చెప్పి వచ్చేశాను.
 
 ముల్లును తీస్తేనేగానీ నాకీ రాత్రి నిద్రపట్టేలా లేదు. రామ్‌దేవ్‌బాబాకి లైన్ కలపమన్నాను. గోవాలో ఉన్నాట్ట. గోవాలో బాబాకేం పని! నాకు తెలియని బాబానా? నాకు తెలియని గోవానా? లైన్‌లోకి వచ్చాడు. ‘బాబాజీ.. ముల్లుని ముల్లుతో కాకుండా ఇంకెలా తీయొచ్చు’ అని అడిగాను. రుగ్వేదాన్ని తిరగేసి చెప్తానన్నాడు. ‘అందులో ఉంటుందా’ అని అడిగాను. ‘లేకున్నా నష్టం లేదు. నా దగ్గర ఎలాగూ ఆయుర్వేదం ఉంది’ అన్నాడు. గ్రేట్ గురూజీ!
 - మాధవ్ శింగరాజు

Advertisement
Advertisement