శాసనాలకు గొంతునిచ్చి.. | Sakshi
Sakshi News home page

శాసనాలకు గొంతునిచ్చి..

Published Thu, Jul 28 2016 1:37 AM

శాసనాలకు గొంతునిచ్చి..

 సందర్భం
 
పురావస్తు శాఖలో చేరిన నాటి నుంచి ఆయనకు శాసనాలే లోకం. చరిత్రతోనే సంభాషణం. ఉంటే ఆఫీసులో. లేదా క్షేత్ర పర్యటనలో. శిలపై చెక్కిన అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ శాస్త్రిగారు వాలేవారు.
 
క చరిత్ర విజ్ఞానశాస్త్ర శకం ముగిసింది. చరిత్ర ఆధారాల సేకరణ, చరిత్ర రచనల జమిలి శక్తి ఆవలి తీరం చేరింది. తెలుగువారి చరి త్రకు సమగ్ర స్వరూపం చేకూర్చిన కొద్దిమందిలో డాక్టర్ పి.వి. పరబ్రహ్మశాస్త్రి ఒకరు. పాతతరం చరిత్రకా రుల అధ్యాయం ముగిసింది. తొంభై ఐదేళ్ల చరిత్ర కన్నుమూసింది. కొన్ని వేల ఎకరా లలో చరిత్ర శకలాలను నిక్షిప్తం చేసుకున్న శాతవాహ నుల కాలంనాటి మహా నగరం కొండాపూర్ (మెదక్ జిల్లా)కు బుధవారం మిత్రులతో కలిసి వెళ్లివస్తున్న సమయంలోనే శాస్త్రిగారు కన్నుమూశారన్న సమాచారం కలచి వేసింది.

1959లో హైదరాబాద్‌లోని  పురావస్తు శాఖలో శాసన పాఠాల సేకరణ విభాగంలో చేరారు. అదే చరిత్ర సముద్రంలో వారి మొదటి అడుగు.  ఒక్కో చరిత్ర మెట్టు ఎక్కి, సహాయ సంచాలకులుగా చేరి డిప్యూటీ డెరైక్టరుగా పదవీవిరమణ చేశారు. కన్నడ ప్రాంతంలోని కర్ణా టక విశ్వ విద్యాలయంలో కాకతీ యుల పరిపాలనా కాలంపై పరి శోధించారు. రాళ్లకు అంటిన మరకల్ని, బురదని తొలగించి, చరిత్ర పొరల నుంచి చారిత్రక సంపదని తవ్విపోశారా యన. తవ్విపోసింది చెక్కిన అక్షరాలను. ఆ అక్షరాల లోనిదే-ఒక జాతికి, రాష్ట్రానికి, ప్రాంతానికి ఆత్మగౌరవ చరిత్ర.  బలవంతుల చేతిలో బందీ చరిత్ర. శాతవాహ నులు మహారాష్ట్రులే అని ఆ ప్రాంతపు పరిశోధకులు కోడై కూసే వేళ శాస్త్రిగారు ఆ వాదంలోని అచారిత్రికతని బట్టబయలు చేసి, శాతవాహనులు తెలుగువారే అని నిరూపించారు. కోటిలింగాల నాణేలను ఆధారం చేసు కుని పూర్వ శాతవాహన రాజులు కూడా కరీంనగర్ ప్రాంతంలోని వారే అని చెప్పారు. రాణి రుద్రమదేవి యుద్ధరంగంలో మరణించారని చందుపట్ల శాసనం ఆధారంగా చెప్పారు.

 ఇతరులు సేకరించిన చారిత్రకాధారాల సహకా రంతో చరిత్రను రాసేవారు కొందరు. తామే కష్టపడి నేల మాళిగల నుంచి శకలాలను తవ్వి తీసి మట్టిచేతు లతో చరిత్రను నిర్మిస్తారు ఇంకొందరు. అలాంటి కోవకు చెందిన పరిశోధకులు శాస్త్రి. పురావస్తు శాఖలో చేరిన నాటి నుంచి ఆయనకు శాసనాలే లోకం. చరిత్రతోనే సంభాషణం. ఉంటే ఆఫీసులో. లేదా క్షేత్ర పర్యటనలో. శిలపై చెక్కిన అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ శాస్త్రిగారు వాలేవారు. రాగి పలక మీద చెక్కుళ్లు ఉన్నాయంటే రెక్కలొచ్చేవి ఆయనకు. చరిత్ర శకలం దొరికితే ఒక కొత్త అధ్యాయం తెరుచుకున్నట్లే. భారతీయ లిపుల చరిత్రను ఔపోసన పట్టారు శాస్త్రిగారు. ఆయన చేసిన గొప్ప కృషి తెలుగు లిపిపై అధ్యయనం. లిపి కేవలం రాతి మీద రాత కాదు. చారిత్రక దశల ప్రతిబింబం.

పద స్వరూపం, అర్థం, అన్వయం వంటి వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసినవారిలో శాస్త్రిగారిని మించిన వారు లేరు. అందుకే ఇప్పుడు చరిత్ర లిపి విజ్ఞానశాస్త్రం శకం ముగిసింది అన్నాను. నాలుగు దశాబ్దాలుగా శాస్త్రిగారి దగ్గర సహాయకునిగా పనిచేసిన కొమురయ్య ఇంటికి ఆరునెలల క్రితం వెళ్లి సన్మానించి వచ్చారు. ఐదువేల రూపాయలు ఇచ్చారు. కొము రయ్య కాలు తొలగించిన విషయం తెలిసి శాస్త్రిగారు వెళ్లారు.  శాస్త్రిగారు ఎన్నో పురస్కారాలు పొందారు. కానీ కొమురయ్యను సన్మానించి ఒక గొప్ప పనిచేశారు. కొమురయ్య శాసనప్రతులు తీయ డంలో సిద్ధహస్తుడు. ఇద్దరు కలసి ఎన్నో శాసనాలకు జీవంపోశారు. ఉద్యోగం చేస్తూనే కొమురయ్యతో బీఏ, ఎం.ఏ చదివించి శాసన పరిశోధక సహాయకునిగా ప్రమోషన్ ఇప్పించారు. ఆకాశమంత గంభీర మైన చరిత్ర నేల పొరలలోనే ఉంటుంది. శాస్త్రిగారి ఔన్నత్యం కొమురయ్య చరిత్ర సేవని గుర్తించ డంలోనే ఉంది.

 తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపా యలతో సన్మానం చేసింది. ఐసీహెచ్‌ఆర్ సంస్థ నేషనల్ ఫెలోగా గుర్తించింది. భారతీయ పురాభిలేఖ పరిశోధన కిగాను ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 1974లో రాగి శాసనం చెక్కించి బహూకరించారు. ఇలాంటి ఎన్నో పురస్కారాలు పొందినా పద్మ అవా ర్డుని మాత్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పించుకోలేక పోవడం అవమానం. ఇదేమాట ఆయనతో అన్నప్పుడు నేను పురస్కా రాల కోసం, గుర్తింపు కోసం చేయలేదు కదా. వారు వారి గుర్తింపు కోసం చేస్తున్నారాయెను అని అన్నారు. ఓ ఏడాదిపాటు శాస్త్రిగారు ఎస్.ఎస్. రామచంద్రమూర్తి గారితో తెలుగులిపి ప్రారంభ వికాసాలు పుస్తకం రాయిస్తున్న సమయంలో తరచుగా కలుసుకునే వాళ్లం. ఈ పుస్తకం వచ్చాక తెలుగు లిపిపై మైసూరులో జరిగిన ఒక సదస్సులో చదివిన ముప్ఫై పత్రాలలో ఈ పుస్తకంలోని సమాచారం తీసుకుని పద్దెనిమిది పత్రాలు చదివారు. శాస్త్రిగారు నిగర్వి. వారిది నిండు జీవితం. సన్నగా, పీలగా, పొట్టిగా కనిపించే శాస్త్రిగారు ఇంత చరిత్రని ఎలా తవ్వి తీశారా అని అనిపించక మానదు. తొంభై ఐదేళ్ల చరిత్రే ఆయన ప్రాణం. ముక్కు పొడుంలా చరిత్రని సునాయాసంగా పీల్చే శాస్త్రిగారి శ్వాస ఆగిపోవడం తెలుగువారి చరిత్ర మొలకెత్తడం కూడా ఆగినట్లేనా?
 
 
 
 
 
 
 
 
(వ్యాసకర్త: జయధీర్ తిరుమల రావు, కవి, రచయిత మొబైల్ : 99519 42242).
 

 

Advertisement
Advertisement