Sakshi News home page

చరిత్రకు పాదుకలిచ్చిన చర్మం

Published Thu, Jul 28 2016 1:06 AM

చరిత్రకు పాదుకలిచ్చిన చర్మం - Sakshi

కొత్త కోణం
 దేశంలో దాదాపు 25 లక్షల మంది తోలు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కొందరు ముస్లింలు మినహా మిగిలిన వారంతా అంటరాని కులాలవాళ్లే.  ఈ దేశం తోలు పరిశ్రమల ద్వారా ఎగుమతి చేస్తున్న వస్తువుల వల్ల గత సంవత్సరం రూ.41 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వేల ఏళ్లుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ పరిజ్ఞానం ద్వారా ఎంతో మేలు చేసినా, దళితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తోలు పరిశ్రమలకు అధిపతులు కాలేకపోయారు. ఇదీ దళితులకీ తోలుకీ ఉన్న వ్యథాభరిత చారిత్రక సంబంధం.
 
 ‘‘వేరెవరయ్యా? వారెవరయ్యా? అష్టాదివారలకు నావారు
 నను తక్కువ కులమని తాకనాడితె ఎక్కువ కులమంత ఎంచెన్
 నే అంటముట్టరాని రాజుల వద్ద కళ్యాణికున్నది నావారు
 నే అంట ముట్టరాని కోమట్ల వద్ద నట్టనడింట్ల నావారు
 నే అంటముట్టరాని బ్రాహ్మణీకులంలో జంజానికున్నది నావారు’’
 
 మాదిగ కుల చరిత్రను చిందుకళాకారులు తరతరాలుగా మౌఖికంగా ప్రచారం చేస్తున్నారు. వారు ప్రదర్శించే జాంబపురాణంలోని పంక్తులివి. అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకోక ముందు అంటరాని కులాల పేరు సైతం ప్రస్తావనకు నోచుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి తమ పేరుని ఓ ధిక్కార స్వరంగా వినిపించేంతగా మాదిగలు ఎదగడానికి ఆ కులం పునాదు లపై నిలిచిన సబ్బండ వర్గాల, సకల వృత్తుల, సర్వకులాల, సర్వజాతుల అభివృద్ధికి అదే అంటరాని కులం చేసిన చారిత్రక సేవే కారణం. అటువంటి చరిత్ర నేటికి మౌఖిక చరిత్రే. ఇప్పుడది అప్రస్తుతమనిపించొచ్చు. కానీ ఇప్పుడదే ప్రస్తుతంగా నాకనిపిస్తోంది. ఏ దేశమైనా, ఏ ప్రజలైనా గత చరిత్ర పునాదుల మీదనే వర్తమానాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్‌ను పునర్‌నిర్మించు కోవాలి. గోసంరక్షణ పేరుతో ఇటీవల దేశమంతటా జరుగుతోన్న ఘటనలు మాదిగల, చమార్ల, జాటావుల, మోచిల రక్తసిక్త తోలు చరిత్రను మళ్లీ తెరపైకి తెచ్చాయి. గతంలోగానీ, వర్తమానంలో గానీ దళితులుగా పేర్కొన్న అంట రాని కులాలు పశువులను చంపి తిన్న దాఖలాలు లేవు, చనిపోయింతర్వాత తినడమే తప్ప.

రైతుల ఇళ్లల్లో ఆరుగాలం కష్టపడ్డ ఎద్దులను, బతికినంత కాలం పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలతో శక్తిని ఇచ్చిన ఆవులను చనిపోయిన తర్వాత, వాటిని ఊరిబయట పారవేసే పనిని అంటరాని కులాలే చేశాయి. ఇంకా చేస్తున్నాయి. అప్పటి వరకు వాటి శ్రమతో వ్యవసాయం చేసిన వాళ్లు, పుట్లు, పుట్లు పంటలను పండించిన వాళ్లు, వాటి పెరుగు, పాలు, వెన్న, నెయ్యితో సమృద్ధిగా పాడిని అనుభవించిన వాళ్లు కళేబరాన్ని ముట్టడానికి కూడా సాహసించరు. ఇంతటితో రైతుల, యజమానుల పని అయిపోతుంది. కానీ అప్పుడే అంటరానివాడైన దళితుడి పని మొదలవుతుంది. ఆ పశువుల తోలును తీసి, అందులో లభించిన మాంసాన్ని వారు తీసుకెళతారు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఈ సమాజాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు తన సర్వస్వాన్నీ ధారపోసే దళితుడి ఆకలి బాధ ఒకటైతే, అంతకన్నా ప్రధా నమైనది తాత్కాలిక ప్రయోజనం కన్నా భవిష్యత్ ప్రయోజనాన్ని ఆశించి చేసే తోలు పని మరొకటి. చచ్చిన పశువు మాంసాన్ని తినడం ఈ సమాజంలోని ఆర్థిక అంతరాలను వేలెత్తి చూపుతోంది. నిజానికి ఇక్కడ మాంసం ప్రాధా న్యం తక్కువ. దళితుల దృష్టి  చర్మంపైనే ఉంటుంది. దళితుల చేతుల్లో శుద్ధి అయిన ఆ చర్మమే లేకపోతే ఎన్నో కులాలకు అసలు చరిత్రే ఉండేది కాదు. ప్రస్తుతం చర్మాలను శుభ్రంచేసి, తోలును తయారు చేయడానికి అధునాతన పద్ధతులు వచ్చాయి. వందల ఏళ్లుగా ఆ సాంకేతిక పరిజ్ఞానం వారికే సొంతం. 

 మలినంలో మాణిక్యాలు
 ఒలిచిన చర్మాలను వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో మొదట తోలుని పదిరోజుల పాటు సున్నంలో ఉంచుతారు. సున్నం లేని కాలంలో సుద్దమన్ను వాడేవారు. సున్నం లేదా, సుద్దమన్నుతో చర్మం మీది వెంట్రుకలు ఊడి పోతాయి. ఆ తర్వాత దానిని తంగేడు చెట్టు తొక్కను నానవేసిన లంద (గొయ్యి)లో దాదాపు పదిరోజులు ఉంచుతారు. రెండు రోజులకోసారి బయ టకు తీసి పిండి, మళ్లీ అందులోనే వేస్తారు. అప్పుడు ఎండలో ఆరబెడతారు. పూర్తిగా ఎండిన తోలు వస్తువులు చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ లందలు ఇంటి పక్కనే తవ్వుతారు. భరించలేనంతగా ఉంటుంది వాసన. అయినా వేల ఏళ్లుగా అలాగే జరుగుతోంది. 
 రెండవది- ఈ రోజు గ్రామీణ వ్యవస్థలో ఇంకా మినుకు మినుకుమం టున్న వృత్తులన్నీ ఒకనాడు తోలు ఉత్పత్తుల మీదనే ఆధారపడినాయి. ఇప్ప టికీ మారుమూల పల్లెల్లో ఇది కనిపిస్తుంది. వాటినే నేను ఈ వ్యాసం ప్రారం భంలో ప్రస్తావించాను. ఒక్కమాటలో చెప్పాలంటే, తోలు లేకుండా గ్రామీణ వృత్తుల పుట్టుకను, పెరుగుదలను ఊహించలేం. అందుకే జాంబ పురాణం ద్వారా తమ కృషిని, తోలు గొప్పతనాన్ని తరతరాలుగా మౌఖిక రూపంలో కళాకారులు ప్రచారం చేస్తున్న కథలు మనకు తోలుతో పెనవేసుకొని దళి తుల జీవితాలను సాక్షాత్కరింపచేస్తాయి. ఆ జాంబ పురాణ పంక్తులలో ‘తోలు’ అని కనిపించదు. ‘వారు’ అన్న పదమే తోలుకు బదులుగా ఉపయో గించాడు కవి. ఒక్కొక్క వృత్తిలో తోలు ఎట్లా కీలక భూమిక పోషించిందో తరచి చూడాలంటే చరిత్రను మననం చేసుకోవాలి. రాజులూ, సైనికులూ గుర్రా లను ఉపయోగించేవారు. గుర్రపు కళ్లెం, లేదా జీను తోలుతోనే తయారవు తుంది. వ్యవసాయ కులాలు, రెడ్లు, కాపులు ఎడ్ల మెడలకూ, నాగలికీ నడుమ బిగించే పరికరం తోలుతో చేస్తారు. రేకు, ప్లాస్టిక్ డబ్బాలు లేనప్పుడు వైశ్యులు తోలుతిత్తిలోనే నూనెను తీసుకొచ్చేవారు.
 
అన్ని వృత్తులకూ ఆధారం 
 తాటి, ఈత చెట్లు ఎక్కే గౌండ్ల కులస్తులకు చెట్లెక్కేప్పుడు కత్తులు పెట్టుకునే గౌసన్, నడుముకు బెల్టు కట్టి ఎక్కడానికి ఉపయోగించే తాడు, మొక్తాద్ తోలు వస్తువులే. సాలెలు మగ్గం నేసేటప్పుడు వాడే పికాస్ పరికరం తోలుదే. సారె మీద నుంచి తీసిన పచ్చికుండలను బోర్ల వేయడానికి ఉప యోగించేది తోలు. అల్యూమినియం, ఇత్తడి అందుబాటులో లేనప్పుడు అందరూ కుండల్లో వండుకుని తిన్నారు. కమ్మరి, అవుసుల(కంసాలి) వాడే కొలిమి తిత్తులు కూడా మొదట్లో తోలుతో తయారైనవే. గొల్ల కుర్మలు మేకలు, గొర్రెలు అడ వుల్లో మేపేటప్పుడు దూది, చెకుముకి రాయి పెట్టుకోవడానికి ఉపయోగించే చేతి సంచి, జంతువులను పారదోలడానికి ఉపయోగించే ఒడిశెల తోలువే. చాకలివారు ఉపయోగించే గాడిదల గంతలకు ఉపయోగించేది తోలునే. క్షురకులు కత్తులు పెట్టుకోవడానికి వాడే గౌసన్  తోలు ఉత్పత్తియే. మజ్జిగ చిలికే కవ్వాన్ని కదిపే తాడు, బట్టలు కుట్టే మేర కులస్తులు గుండీలు కుట్టేటప్పుడు సూది గుచ్చుకోకుండా వేలుకు తొడిగేది తోలు వస్తువులే. మద్దెల, మృదంగం, జమిడిక, డప్పు, డమరుకం అన్నీ తోలుతోనే చేసేవారు. ముదిరాజ్, బెస్తకులం వాళ్లు వేటాడే తుపాకీకి గౌసన్ కూడా తోలు నుంచి వచ్చిందే. 
 
 వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులన్నీ తోలు లేకుండా ఆరంభం కాలేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞ్ఞానాన్ని మొత్తం సమాజానికి అర్పించిన దళితులు ఇప్పటికీ ఎటువంటి గౌరవాన్ని పొందలేకపోగా, ఇంకా అణచివేతకు, అవమానాలకు గురవుతూనే ఉండడ మంటే, ఈ సమాజాన్ని నిలబెట్టిన సకల వృత్తుల పునాదులను  మర్చిపోవ డమే. ఆధునిక సమాజం లందలను ధ్వంసం చేసింది. కానీ డబ్బున్న వాళ్లు ఈ సాంకేతిక పరిజ్ఞనం నుంచి యాంత్రీకరణ వైపు మళ్లి వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. మళ్లీ అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నది ఎవరంటే-  అదే దళితులు.
 
వ్యథాభరిత సంబంధం
 దేశంలో దాదాపు 25 లక్షల మంది తోలు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కొందరు ముస్లింలు మినహా మిగిలినవారంతా అంటరాని కులాలవాళ్లే. ఈ ముస్లింలు గతంలో అంటరాని వాళ్లే. హిందూ సమాజంలో ఉన్న అవమా నాలు, అణచివేతలు భరించలేక మతం మారినవారే వీళ్లంతానని చరిత్ర చెబుతుంది. వాళ్లు మాత్రమే ఈరోజు తోలు పరిశ్రమల్లో కార్మికులుగా ఉన్నారు. ఈ దేశం తోలు పరిశ్రమల ద్వారా ఎగుమతి చేస్తున్న వస్తువుల వల్ల గత సంవత్సరం రూ.41 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వేల ఏళ్లుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ పరిజ్ఞానం ద్వారా ఎంతో మేలు చేసినా, దళితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తోలు పరిశ్రమలకు అధిపతులు కాలేకపోయారు. ఇదీ దళితులకీ తోలుకీ ఉన్న వ్యథాభరిత చారిత్రక సంబంధం. 

 
 ఈ నేపథ్యం నుంచే మనం ఆవు మాంసం వివాదాన్ని పరిశీలించాలి. నిజానికి ఏ సమాజమైనా కొంచెం వివేచన కలిగి ఉంటే, సమాజానికి ఉప యుక్తమైన సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన ఆ జాతికి, కులానికి ఎల్లకాలం రుణపడి ఉండాలి. ఇప్పటికీ అటువంటి పరివర్తన భారత సమాజంలో రాకపోవడం విచారకరం. రాకపోగా, ఆ వృత్తినే నీచమైనదిగా, వాళ్లంతా దుర్మార్గులుగా ఈ సమాజానికి కనిపించడం భారతీయత పేరుతో కొన సాగుతోన్న అసమానతలకు, వైరుధ్యాలకూ పరాకాష్ట. వ్యవసాయంలో స్థిర మైన నీటి వసతిని కల్పించి, పంటలకు గ్యారంటీ ఇచ్చిన చెరువుల నిర్మాణం, నిర్వహణలో దళితులదే అగ్రస్థానం. ఈ దేశం సృష్టించిన సంపదలో అంటరాని కులాల భాగస్వామ్యం అమోఘమని పైన పేర్కొన్న విషయాలు రుజువు చేస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో మొదటిగా ఉనికిలోనికి వచ్చిన రైల్వేలు, గనులలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసిన తొలి రైల్వే శ్రామికులు అంటరాని కులాలే. అవి ఆధునీకరణ చెంది, రక్షణ గ్యారంటీ అయిన తర్వాత అన్ని కులాలు చేరాయి. 
 
అయినా అవమానాలే! 
 అంటే ఈ సమాజం గమనాన్ని, అభివృద్ధినీ కొనియాడే ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకోవాల్సింది దళితజాతి ఈ సమాజానికి చేసిన సేవనే. కానీ నేటి పరిణామాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ సమాజానికి దళితజాతి చేసిన సేవలను కొనియాడకపోయినా పరవాలేదు. కానీ అనుక్షణం వేటాడి వెంటాడి జరుపుతున్న దాడులు దళితులను అవమాన భారంతో దహించి వేస్తున్నాయి. ఇది ఈ సమాజ ఐక్యతకు అవరోధం. దేశం దేశం అని జపించే వారంతా గతాన్ని గుర్తు చేసుకొని, వర్తమానాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్త్‌ని నిర్దేశించుకోకపోతే, పరిణామాలు విషమంగానే ఉంటాయి.
 
 
 

 

 

 

(వ్యాసకర్త: మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213)

Advertisement
Advertisement