వైవిధ్యాన్ని కాదంటే చిక్కే | Sakshi
Sakshi News home page

వైవిధ్యాన్ని కాదంటే చిక్కే

Published Sat, Oct 24 2015 12:23 AM

వైవిధ్యాన్ని కాదంటే చిక్కే

జాతిహితం
ఆర్‌ఎస్‌ఎస్ పాశ్చాత్యుల వృద్ధికి విస్తుపోతుంది. కానీ దాని సాంస్కృతిక ప్రభావం గురించి భయపడుతుంది. తాత్విక పవనాలు తూర్పు నుంచి పడమటికే వీయాలని నమ్ముతుంది. మోదీ తన విదేశీ పర్యటనల ద్వారా ఆ అవసరాన్ని తీరుస్తున్నారని అది భావిస్తోంది. దేశంలో లోతైన సాంస్కృతిక మార్పులను తేవడానికి కూడా ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని అది వ్యాఖ్యానించినప్పుడే తంటా వస్తోంది. వైవిధ్యంతో సహజీవనాన్ని నేర్చుకుంటూనే, భారత సమాజాన్ని ఏకరూపమైనదిగా ఎలా చేయగలుగుతారు?
 
బీజేపీ గతంలో కూడా దేశాన్ని పాలించింది. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి విజయదశమి సందర్భంగా ఏటా ఇచ్చే సంప్రదాయక సందేశం ఇప్పుడు మాత్రమే జాతినుద్దేశించి చేసిన అధికారిక ప్రసంగంలా ఉంది. వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వానికి భిన్నంగా నేడున్నది నిస్సందేహంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం. బహుశా ఇదేమీ చెడ్డ విషయం కాదు. జనసంఘ్/బీజేపీ, ఒక పెద్ద పార్టీలో భాగంగా లేదా కూటమి నేతగా గతంలో కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి, నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వానికి మధ్య ఉద్రిక్తతలను అది సాకుగా చూపుతుండేది. ఈ పరిణా మం ఆ అవకాశం లేకుండా చేస్తుంది.

వాజ్‌పేయి విధానాలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిఘటించిందనడానికి ఇప్పుడు ఆధారాలేమీ లేవు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలాంటి విభేదాలేవీ ఉన్నట్టు మనకు కనబడలేదు. మోదీ తనకు నష్టం జరుగుతున్నాగానీ హిందుత్వంలో తనకున్న విశ్వాసం విషయంలో నిష్కప టంగా ఉండటమే ప్రాథమికంగా అందుకు కారణం. పైగా ఆయన, తాను గుజరాత్ ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపానని, కేంద్రంలో మాత్రం ఎందుకు సమస్యలు వస్తాయని కూడా విశ్వసిస్తున్నారు.

అందువలన వాజ్‌పేయితో పోలిస్తే ఆర్‌ఆర్‌ఎస్‌తో సంబంధాల్లో ఆయన స్థానం భిన్నమైనది. వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్ నేతల పట్ల గొప్ప వ్యక్తిగత గౌరవాన్ని చూపేవారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతల అభిమానపాత్రులకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు, బ్యాంకు లోన్లు. ఒప్పందాలు మంజూరవ్వడానికి, సులువుగా డబ్బు సమకూరడానికి బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు సహాయపడేలా చూసేవారు.

సంఘ్, బీజేపీల మధ్య కొత్త బంధం
అయితే ఆర్‌ఎస్‌ఎస్‌తో, దాని అధిపతి కేఎస్ సుదర్శన్‌తో ఆయన సంబం ధాలు ధిక్కారం అంచున నిలిచిన అపనమ్మకంతో నిండి ఉండేవి. అయితే వ్యక్తిగత సంభాషణల్లో వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై ఛలోక్తులు విసురు తుండేవారు. తరుచుగా అవి ప్రేమపూర్వకంగా ఉండేవి. అంతేగానీ  ఎన్నడూ నిందాపూర్వకంగా ఉండేవి కావు. వారిని ఆయన సాంస్కృతిక వ్యవహారాల్లో తలదూర్చనిచ్చేవారు. తన మిత్రుడు, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇష్టుడు అయిన మురళీ మనోహర్ జోషికి మానవవనరుల శాఖను అప్పగించారు.

 

అయితే జోషికి భౌతికశాస్త్రంలో నిజమైన డాక్టరేటే ఉంది, అల్హాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా కూడా పనిచేశారు. అయితే, ఆర్థిక వ్యవస్థలోని కీలక అంశా లను, విదేశాంగ విధానాన్ని, చివరికి ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని, అది పాకిస్తాన్‌తో సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోందనేదాన్ని వాజ్‌పేయి పూర్తిగా తన అధికార పరిధిలోనే ఉంచుకునేవారు. కార్గిల్ యుద్ధ కాలంలోను, పార్లమెంటుపై దాడి తదుపరి ఆయన న్యాయాధికారి శైలిలో వ్యూహాత్మక సంయమనాన్ని పాటించారు.

లోతు లేని భావజాల పునాదులు
సర్ సంఘ్ చాలక్ దసరా ఉపన్యాసం అప్పట్లో కూడా పత్రికల్లో మొదటి పేజీలోనే వచ్చేది. అయితే దానికి ఇప్పుడున్నంత ప్రాధాన్యం మాత్రం ఎప్పుడూ ఉండేది కాదు. మారిన నేటి పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది దూర దర్శన్ మోహన్ భాగవత్ దసరా ఉపన్యాసాన్ని లైవ్‌లో ప్రసారం చేయడాన్ని కొందరు తప్పు పట్టారు. వారు వార్తా విలువ అనే ముఖ్యమైన విషయంలో పొరబాటు చేశారు. నూతనమైన ఈ ఏర్పాటు రాజకీయ వాస్తవం.

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలపరమైన పునాదులు సరళమైనవి, లోతులేనివి. కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్, ‘‘గురూజీ’’ ఎమ్‌ఎస్ గోల్వాల్కర్, కొంత వరకు వినాయక్ దామోదర్ సావర్కర్‌లు ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు వ్యవస్థాపక పితా మహులు. వారంతా భారత (హిందూ) సంస్కృతి, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలోనే ప్రపంచంలో ఉత్కృష్టమైనవని విశ్వసించినవారు. పాశ్చాత్య శక్తులు జయించిన వారు ఎలా అణచివేతకు గురవుతూ, ఎంతటి దయనీ యంగా ఉండిపోయారో, మరింత సుదూర ‘‘గతంలో’’ మనతో  ‘‘సంబం ధాలు పెట్టుకున్న’’ ఇతరులు, ప్రత్యేకించి, దక్షిణ ఆసియాలోని వారు అందు వల్ల  ఎలా లబ్ధిపొంది, నేటికీ హిందూ జీవన విధానాన్ని, పేర్లను కొనసాగి స్తున్నారో (ఇండొనేసియాలో లాగా కొందరు తర్వాత ముస్లింలుగా మారినా) గోల్వాల్కర్, హెగ్డేవర్‌లు గొప్పగా చెబుతుండేవారు.

పాశ్చాత్య దేశాలంటే భయం
ఆర్‌ఎస్‌ఎస్‌కున్న ‘పాశ్య్చాత్య భీతి’ (వెస్ట్-ఫోబియా) సంకుచితత్వం ఆసక్తి కరం. అది పాశ్చాత్య విలువలను తిరస్కరిస్తుంది. కానీ వారి ప్రశంసలు అందుకోవాలని పిల్లల్లాగా వెర్రిగా తాపత్రయపడుతుంది. భౌతిక సంపన్ను లైనా ఆధ్యాత్మిక దారిద్య్రంలో మగ్గుతున్న అమెరికన్ శ్రోతలను చికాగో ఉప న్యాసంతో ‘‘కట్టిపడేసిన’’ వివేకానందుడు వారి నిజమైన ఆదర్శ పురుషుడు. వారు చెప్పే ‘హిందూ రాష్ట్ర’ మైనారిటీలనన్నిటినీ దేశం నుంచి బహిష్కరిం చదు.

 

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం హిందుత్వ పునాదులపై జాతీయ వాదాన్ని పునర్నిర్మిస్తుంది. మైనారిటీలు దాన్ని సంతోషంగా అనుసరించవచ్చు, మరే ఇస్లామిక్ లేదా క్రైస్తవ దేశంలో కంటే హిందుస్థాన్ (ఆర్‌ఎస్‌ఎస్ కోరుకు నేదదే) లోనే ఎక్కువ సంతోషంగా ఉన్నామని నమ్మడం ప్రారంభించవచ్చు. భారత ముస్లింల దేశభక్తికి ‘‘కలాం ప్రమాణం’’ మూలాలు ఉన్నది అక్కడే.  

వారి మతాల కంటే పురాతనమైన హిందుత్వ విశాల హృదయం వల్లనే ఇది సాధ్యపడిందని మైనారిటీలంతా దానికి రుణపడి ఉండాలి. అంతేగానీ అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల లభించినదేమీ కాదు. ఈ ఏడాది దసరా ఉపన్యాసంలో అంబేడ్కర్‌కు కూడా దాదాపు భగత్‌సింగ్‌లాగే (కమ్యూ నిస్టు వామపక్షవాది) దైవత్వం ఆపాదించడాన్ని గమనించండి. అంబేడ్కర్ హిందూ మతాన్ని తిరస్కరించి బౌద్ధాన్ని స్వీకరించడాన్ని వారు ఆమోదిం చారు. పైగా  20 ఏళ్లు లోతైన విశ్లేషణ జరిపి ఆయన బౌద్ధాన్ని స్వీకరించడాన్ని కొనియాడారు. కానీ ఆయన రచించిన రాజ్యాంగం గురించి మాత్రం పెద్దగా మాట్లాడలేదు.

 

సారాంశంలో ఆర్‌ఎస్‌ఎస్ పాశ్చాత్యుల వృద్ధిని చూసి నివ్వెర పోతుంది. కానీ దాని సాంస్కృతిక ప్రభావం గురించి భయపడుతుంది. కానీ తాత్విక పవనాలు మాత్రం తూర్పు నుంచి పడమటికే వీయాలని నమ్ము తుంది. మోదీ తన విదేశీ పర్యటనల్లో తరుచుగా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ అవసరాన్ని తీరుస్తున్నారని అది భావిస్తోంది. మోదీని ఆర్‌ఎస్‌ఎస్ పాత తరం నాయకత్వం... భారత ప్రభుత్వాధికార శక్తిని చేత బట్టి హిందుత్వ శుభ సందేశాన్ని ప్రపంచానికి వినిపిస్తున్న ఆధునికమైన, జెట్ సెట్టింగ్ వివేకానందునిగా చూస్తోంది.

‘సాంస్కృతిక మార్పుల’తోనే తంటా
2014 ఎన్నికల ఫలితాలు భారత దేశంలో లోతైన సాంస్కృతిక మార్పులను తీసుకురావడానికి కూడా తమకు అధికారాన్ని కట్టబెట్టాయని ఆర్‌ఎస్‌ఎస్ భావజాల కర్తలు వ్యాఖ్యానించినప్పుడే తంటా వస్తున్నది. ఒక వంక వైవిధ్యంతో సహజీవనాన్ని నేర్చుకుంటూనే, భారత సమాజాన్ని ఏకరూప మైనదిగా కూడా ఎలా చేయగలుగుతారనే అంశంపై నేను సర్‌సంఘ్‌చాలక్‌తో వాదనకు దిగుతాను. అందరికీ సమానంగా వర్తించే ఉమ్మడి చట్టాలు, ఉమ్మడి విధానాలకు ఆయన ఇచ్చిన పిలుపు మెజారిటీవాద ధోరణి, మనగలిగేది కాదు. ఆయన ‘‘జనాభా నియంత్రణ’’ భావన కాలదోషం పట్టినది.  

ఆర్‌ఎస్ ఎస్‌లో చాలా మంది అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడినాగానీ, వారిలో ఒక పెద్ద సెక్షన్ సంజయ్‌గాంధీని ఎందుకు మెచ్చుకునేవారో కూడా అది చెబుతుంది. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు, మురికి వాడల నిర్మూలనకు సంజయ్‌గాంధీ ప్రధానంగా ముస్లింలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన భార్య మనేకా, అతనికి ఇష్టమైన అధికారి జగ్‌మోహన్ (తుర్క్‌మెన్ గేటు కూల్చివేతల ద్వారా సుప్రసిద్ధుడు) తదుపరి కాలంలో బీజేపీ స్టార్‌లు కావడంలో ఆశ్చరపోవాల్సిందేమీ లేదు.


 జనాభా ‘‘నియంత్రణ’’కు భాగవత్ ఇచ్చిన పిలుపు ఆధారపడినది గణాంక సమాచారం మీద కాదు, భ్రమాత్మకమైన భయం మీద. ఏ మతస్తుల లోనైనా జనాభా నియంత్రణకు విద్య, సౌభాగ్యాలను మించిన మార్గం లేదు. ఆశించినదాని కంటే కూడా భారత జనాభా వృద్ధి రేటు నాటకీయమైన రీతిలో పడిపోతోంది (ఇప్పుడు దాదాపు 1.4%), ముస్లింలలో కూడా వృద్ధిరేటు క్షీణి స్తోంది. ఇదంతా పెరిగే ఆదాయాలతో, మరింత ముఖ్యంగా ఆడపిల్లలు పాఠ శాలలకు పోతుండటంతో స్వచ్ఛందంగానూ, సంతోషంగానూ జరుగుతోంది.

వైవిధ్యం నేటి తిరుగులేని నిజం
వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా భారతదేశపు వైవిధ్యం లోతుగా వృద్ధి చెందు తోంది, మరింత విస్తృతమైనదిగా, ప్రబలమైనదిగా మారుతోంది. ఫెడర లిజం పెంపొందుతుండటంతో రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలను రాష్ట్ర నాయకులు మునుపెన్నటికన్నా ఎక్కువగా అనుభవిస్తున్నారు. వాటిని విస్తరింపజేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాలు, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలు, తమ సొంత శ్రామిక, భూ చట్టాల ముసాయిదాలను తయారు చేసుకుంటున్నాయి. కేంద్రం అలాంటి చట్టాలను చేయకపోవడంతో అవే ఆ ప్రయత్నం మొదలెట్టాయి. కశ్మీర్ నుంచి ఈశాన్యం వరకు సరిహద్దు రాష్ట్రాలు తమ సొంత జనాభాపరమైన దృక్కో ణాల నుంచి తమకు సరిపడే చట్టాలను, పరిపాలనా నిబంధనలను చేసుకుం టున్నాయి. ఉదాహరణకు, గోవధ కశ్మీర్ సొంత రణ బీర్ శిక్షాస్మృతి ప్రకారమే నేరం.

ఇవన్నీ భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయే తప్ప, బలహీనపరచడం లేదు. దీన్ని ఇప్పుడు వెనక్కు మరల్చగలమనే భావన ఏదైనా ఏకీకరణ అనే మరో కొత్త కాల్పనికతే అవుతుంది. ఆ అవసరమే లేదు, కాబట్టి ఈ వైవిధ్యంలోనే ఐక్యత కోసం ప్రయత్నించాలి. చరిత్రలో మునుపెన్నటికంటే నేటి భారతదేశం ఎక్కువ ఐక్యంగా, సమగ్రంగా సమైక్యంగా ఉంది. అయినాగానీ వైవిధ్యం మరింత సుస్పష్టంగా పెంపొందు తోంది. అందువలన ఆధునిక భారతంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు సమంజసత్వం కలగాలంటే సర్‌సంఘ్ చాలక్ దానిలోని రెండు అంశాలను సంస్కరించాల్సి ఉందని నా సూచన. ఒకటి, దాని యూనిఫాం ‘‘గణవేష్’’. రెండవది. వైవిధ్యంలో ఐక్యత అనే దాని నినాదాన్ని వైవిధ్యాన్ని కీర్తించడంగా మార్చడం.
 
- శేఖర్ గుప్తా
twitter@shekargupta

Advertisement

తప్పక చదవండి

Advertisement