పెంగ్విన్ యాన్యువల్ లెక్చర్... | Sakshi
Sakshi News home page

పెంగ్విన్ యాన్యువల్ లెక్చర్...

Published Mon, Nov 25 2013 3:31 AM

పెంగ్విన్ యాన్యువల్ లెక్చర్... - Sakshi

చెప్పుకోదగ్గ సంగతి: రేపు నవంబర్ 29న న్యూ ఢిల్లీలో అమితాబ్ బచ్చన్ సాహిత్యం గురించి మాట్లాడనున్నాడు. పెంగ్విన్ సంస్థ గత నాలుగైదేళ్లుగా ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్మారక ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా అమితాబ్ ఈసారి ఉపన్యాసం ఇవ్వనున్నాడు. అమితాబ్ ప్రఖ్యాత కవి హరివంశ్‌రాయ్ బచ్చన్ కుమారుడని తెలుసు. అలాగే అతడు కవిత్వాన్ని సాహిత్యాన్ని బాగా చదువుతాడని కూడా తెలుసు. అందుకే పిలుపు. గతంలో ఇలా పెంగ్విన్ స్మారక ఉపన్యాసం ఇచ్చినవారిలో అమర్త్య సేన్, దలైలామా, ఏపిజె అబుల్ కలామ్ వంటి మహామహులు ఉన్నారు. గ్లామర్ రంగానికి తనదైన ఉనికి ఉంటుంది. సినిమా- గ్లామర్ రంగమే అయినా పాత రోజుల్లో తెలుగు సినిమా - సాహిత్యం కలిసి జమిలీగా సాగిపోయేవి.
 
 ఎన్టీఆర్ వంటి హీరోలు (స్వయంగా ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణగారి శిష్యుడు) శ్రద్ధ కలిగిన సాహితీ విద్యార్థులకు మల్లే ఎన్నో గ్రంథాలు చదివేవారు. పద్య సాహిత్యం మీద ఎన్టీఆర్‌కు గొప్ప అధార్టీ ఉండేది. అక్కినేని, జగ్గయ్య, కృష్ణంరాజు... వీళ్లంతా సాహిత్యాన్ని విస్తృతంగా చదివినవారే. ఇక సాహిత్యలోకం నుంచి మల్లాది రామకృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి వంటి వారు సినిమాల్లో పని చేయడం వల్ల పరస్పరం వెలుగు సోకి సినిమా- సాహిత్యం ఉజ్వలంగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉండేది. ఇవాళ అలాంటి పరిస్థితికి వీల్లేని ఎడం ఉంది. పరస్పరం తెలియనంత చీకటి ఉంది. మరోవైపు ప్రకాష్ రాజ్ వంటి పరభాషా నటులు చలం గురించి, శ్రీశ్రీ గురించి అనర్గళంగా మాట్లాడేంతగా మన సాహిత్యాన్ని ప్రేమిస్తున్నారు. వచ్చే సంవత్సరం పెంగ్విన్ యాన్యువల్ లెక్చర్ ఇవ్వమని కమలహాసన్‌ను పిలవ్వొచ్చు. ఆ పై సంవత్సరమైనా అందుకు యోగ్యుడైన తెలుగు సూపర్‌స్టార్ ఎవరైనా ఉన్నారా?

  మనవి
 సాక్షి సాహిత్యం పేజీకి  మీ రచనలు పంపండి. సాహిత్యమూర్తుల వ్యక్తిత్వాలు, సాహిత్య ధోరణులు, పాత జ్ఞాపకాలు, అమూల్య గ్రంథాలు, వర్తమాన పోకడలు... విశ్లేషణలు పంపవచ్చు. సమీక్షకు రెండు  ప్రతులు పంపాలి.
 మా చిరునామా:
 ఎడిటర్, సాక్షి
 రోడ్ నం.1, బంజారా హిల్స్,
 హైదరాబాద్ - 34.

Advertisement
Advertisement