విద్య ప్రైవేటీకరణతో పెనుప్రమాదం | Sakshi
Sakshi News home page

విద్య ప్రైవేటీకరణతో పెనుప్రమాదం

Published Tue, Dec 1 2015 2:58 AM

విద్య ప్రైవేటీకరణతో పెనుప్రమాదం

సందర్భం

 

అనేక దేశాలలో ఆహారం, నీరు వంటి ప్రకృతి సహజమైన అంశాలు కూడా ప్రైవేటుపరమౌతున్నాయి. మన దేశంలోనూ,

 నేటివరకూ దేశ ప్రజలకు చాలా మేరకు ఒక హక్కుగా ఉన్న ఉన్నత విద్యారంగం తలుపులను కూడా నేడు

 ప్రపంచ, దేశీయ ప్రైవేటు పెట్టుబడుల లాభార్జనకు తెరిచేస్తున్నారు.

 

మన దేశంలోని విద్యారంగం గత రెండు దశాబ్దాలుగా మరింతగా పేదలకు దూరం అయిపోయింది. ప్రైవేటు విద్య ప్రాధాన్యత శృతిమించి పెరిగిపోయి, విద్య నేడు సామాన్య జనానికి అందని ద్రాక్షే అయిపోయింది. ఈ నేప థ్యంలోనే నేడు తెలుగు రాష్ట్రా లలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన యత్నాలను మనం చూడాలి. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 2004 నాటికల్లా పలు విశ్వవిద్యాలయాలలో  సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట, ఉన్నత విద్యారంగంలో డబ్బు పాత్ర పెరిగిపోయింది. అయితే, అనంతరం ముందుకు వచ్చిన ‘ఫీజ్ రీయింబర్స్‌మెంట్’ పథకం వలన విద్యా రంగం పేదలూ, సామాన్యులకు అందుబాటులోకి తిరిగి వచ్చింది. తద్వారా, తెలుగు రాష్ట్రాలలోని ఆర్థిక స్థోమత లేని లక్షలాది మందికి విద్యార్జన అవకాశాలు ఏర్పడ్డాయి.

 

కానీ నేడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆలోచనలతో  ప్రభుత్వాలు ముందుకు వస్తోన్న తీరు ముందుముందు ప్రమాదక రంగా పరిణమించగలదు. ప్రపంచంలో మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న అన్నీ దేశాలలోనూ ఆర్థిక అసమానతలు సుదీర్ఘకాలంగా ఉన్నవే. కానీ, ఆ వ్యవస్థల పునాదులను కుదిపివేయకుండా కాపాడింది ఆయా దేశాలలోని విద్యా రంగాలే. అమెరికా, యూరప్ దేశాలు, జపాన్, చైనా, దక్షిణ కొరియాల వంటి అన్నీ మార్కెట్ ఆధారిత దేశాల లోనూ  తొలి నుంచీ విద్యారంగంలో ప్రభుత్వానికి పెద్ద పాత్ర ఉంది. నేడు, దీనిని ‘సబ్సిడీల వ్యవస్థ’ అని కొం దరు విమర్శించవచ్చు.

 

కానీ, ఈ ‘సబ్సిడీల’ వ్యవస్థే, నిజానికి మన దేశంలో కూడా పలు దశాబ్దాలుగా  దేశంలోని మెజారిటీ అట్టడుగు వర్గాలకూ, మధ్యతర గతికీ ఆసరా అయ్యింది. తద్వారా అన్నీ దేశాలలోనూ సామాజిక చలన శీలతకు రక్షణ ఏర్పడింది. అంటే, మెజారిటీ కింది వర్గాల ప్రజలకు వారి పేదరికం, కష్టాలు, అణచివేతలు  శాశ్వత స్థితిగా గాక, విద్య ద్వారానూ, ప్రజాస్వామిక అవకాశాల ద్వారానూ అధిగ మించ వీలయ్యేవిగా ఉన్నాయి. దీనివలన మాత్రమే, ఈ దేశాలు అన్నింటిలోనూ తీవ్ర సామాజిక విస్ఫోటనా లను చాలా మేరకు నివారించగలిగారు.

 

గత కొద్ది దశాబ్దాలుగా పలు ధనిక దేశాలతో సహా, మనవంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలలో కూడా, వివిధ రంగాలలో భారీగా ప్రైవేటీకరణ జరిగిన నేపథ్యం లోనే, 2008లో ప్రపంచ ఫైనాన్స్, ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. ఈ సంక్షోభం నేడు మరింత లోతుగా వ్యవస్థల మూలాలను తొలిచేస్తోంది. ప్రపంచంలోని ధనిక దేశాలతో సహా అన్నిచోట్లా ప్రజలలో, ముఖ్యంగా యువజనులలో ఇది తీవ్ర అసంతృప్తికీ, వ్యవస్థపట్ల వ్యతిరేకతకూ ఇది దారితీస్తోంది. ఈ క్రమంలోనే బ్రిటన్, అమెరికా వంటి దేశాలే కాకుండా దరిదాపు అన్నీ ధనిక దేశాలలోనూ కూడా జనసామాన్యం వామ పక్ష భావాలు ఉన్న నేతలూ, పార్టీల దిశగా మళ్లక తప్పని స్థితి నేడు ఉంది.

 

ఈ పరిణామాలు అన్నింటి వెనుకనా ఉన్నది గత 3-4 దశాబ్దాలుగా పెట్టుబడి దారీ దేశాలు అన్నింటి లోనూ అమలు జరిగిన ప్రైవేటీకరణ, నయా ఉదార వాద విధానాలే. ఈ విధానాలవలన విద్యారంగం వం టివి కూడా ప్రైవేటు పరం అయిపోయి, ఆయా దేశా లలో డబ్బులు చెల్లించి ఉన్నత విద్యను పొందలేనివారు ఇక్కట్ల పాలు అవుతున్నారు. అమెరికా వంటి దేశాలలో నేడు చదువుకునేందుకు తీసుకున్న  విద్యారుణాలను కూడా చెల్లించలేని దుస్థితిలో యువతరం పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే, నేడు ఈ దేశాలలోని ప్రజలూ,  పాలక వర్గాలలో వివిధ విధానాల పట్ల పునరాలోచన జరుగు తోంది. గతంలో ప్రైవేటీకరణ పాలై, నేడు తిరిగి ప్రభు త్వపరం అయ్యే దిశగా సాగుతోన్న బ్రిటన్‌లోని రైల్వే రంగం తీరులోనే, పలు దేశాలలో ప్రాథమిక రంగాలను తిరిగి ప్రభుత్వపరం చేయాలనే డిమాండ్ వినపడుతోం ది. నిజానికి హార్వర్డ్, కేంబ్రిడ్జి వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కొన్నివందల ఏళ్లుగా ఆయా దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.

 

కాగా, మన పాలకుల విధానాలు దీనికి విరుద్ధ దిశలో సాగుతున్నాయి. వివిధ ప్రపంచదేశాలలోని ‘‘పెట్టుబడి’’కి, వివిధ రంగాలలోకి అది విస్తరించిన అనంతరం, నేడు తన లాభాలను ఇనుమడింప చేసు కునేందుకూ, కాపాడుకొనేందుకు  మరిన్ని జీవన రంగా లను కబళించాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఈ క్రమం లోనే  అనేక దేశాలలో  ఆహారం, నీరు వంటి ప్రకృతి సహజమైన అంశాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారుల పరమౌతున్నాయి. దీనిలో భాగంగానే మనదేశంలో కూడా, నిన్నా మొన్నటివరకూ దేశ ప్రజలకు చాలా మేరకు ఒక హక్కుగా ఉన్న ఉన్నత విద్యారంగం తలుపు లను కూడా నేడు ప్రపంచ, దేశీయ ప్రైవేటు పెట్టు బడు ల లాభార్జనకు తెరిచేస్తున్నారు. రానున్న కాలంలో, రెం డు తెలుగు రాష్ట్రాలలో కూడా యువజనులూ, విద్యా ర్థులూ, జనసామాన్యం, రైతాంగ వర్గాలలో మరింతగా పెరిగిపోనున్న సామాజిక అశాంతి, అలజడులకు ఇది ఆరంభం అవుతుంది...! ప్రయాణం ఇదే దిశగా సాగితే అంతిమంగా అది చేరేది అశాంతి, అలజడుల తీరాన్ని మాత్రమే...!

 

 - డి. పాపారావు

 వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు

 మొబైల్: 9866179615

Advertisement

తప్పక చదవండి

Advertisement