ప్రజాస్వామ్యానికి ‘అర్హతల’ తూట్లు | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి ‘అర్హతల’ తూట్లు

Published Sat, Dec 12 2015 1:29 AM

ప్రజాస్వామ్యానికి ‘అర్హతల’ తూట్లు - Sakshi

జాతిహితం
 
ఎలాంటి అర్హతల ఆంక్షలూ లేని శాసనసభ్యులు పంచాయతీలకు ఎన్నికయ్యే వారికి అర్హతలను  నిర్ణయిస్తారు. పూర్తి నిరక్షరాస్యులైన హరియాణా పౌరులు ఎవరైనా శాసనసభకు ఎన్నికై, తమలాంటి వారిని పంచాయితీ ఎన్నికలకు అనర్హులను చేస్తూ చట్టాలు చేయొచ్చు. బ్రిటిష్‌వారు ఓటింగ్ హక్కుకు పెట్టిన అర్హతలన్నిటినీ అంబేడ్కర్ రాజ్యాంగం చెత్తబుట్టలో పడేసింది. కాబట్టే మన ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. కాగా ఎన్నుకోదగినవారు ఎవరనే ఉన్నత వర్గవాద వైఖరిని చేపట్టిన పాకిస్తాన్‌కు దానివల్ల ఎంత మంచి జరిగిందో మీరే చూడొచ్చు.
 

నేనే గనుక యువకుడిని, మరింత ధైర్యవంతుడిని, విద్వత్తుగలవాడిని అయితే, స్వయంగా నేనే ఈ మాటలను రాసేవాడిని. వాటిలో ఏదీ కాను కాబట్టి అవన్నీ ఉన్న మరొకరు రాసిన మాటలను నిస్సంకోచంగా అరువు పుచ్చుకుంటాను. గౌరవనీయ భారత అత్యున్నత న్యాయస్థానంతో వాదనకు దిగేటప్పుడు ఆ వ్యక్తి మాటల వెనుక దాక్కోవడానికి వెనుకాడను. ఇది, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత గురువారం వెలువరించిన తీర్పు గురించి.

పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్య, ఆర్థిక, సామాజిక అర్హతా ప్రమాణాలను నిర్దేశిస్తూ హరియాణా ప్రభుత్వం తెచ్చిన చట్టం సమంజసమైనదేనని సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ‘ఓటు హక్కు, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కేగానీ, ప్రభుత్వ పదవుల్లోకి ఎన్నిక కావడం ప్రాథమిక హక్కు కాదు.’ ఇది, కనీసం పట్టణ ఉన్నత వర్గీయుల మన్ననలందుకున్న సంక్లిష్టమైన ఈ చట్టానికి సమర్థనగా గౌరవ న్యాయస్థానంవారు చేసిన కీలక వాదన సారం.

మంచీచెడు విచక్షణ చదువుకున్నోళ్ల సొత్తా?
మరోవంక ఇది, ఎవరు ఎన్నిక కావాలనేదాన్ని నిర్ణయించే విశేషహక్కును (ఈ పదం మాత్రం నేను ఎంచుకున్నది) చట్టసభలకు కట్టబెట్టటం కూడా అవుతుంది. ఈ నిర్దిష్ట సందర్భానికి సంబంధించి అది, ప్రాథమిక విద్య లేదా అక్షరాస్యత, రుణగ్రస్తులు కాకుండటం (కొన్ని పరిమితులతో), ఇంట్లో మరుగు దొడ్డి ఉందా లేక గత్యంతరం లేకనో, స్వచ్ఛందంగానో బిహిరంగ మల మూత్ర విసర్జన చేస్తున్నారా? అనేలాంటి సామాజిక పారిశుద్ధ్యానికి సంబంధించిన కొన్ని నియమాలకు మాత్రమే పరిమితమైంది. భారతీయుల్లో 60% బహిర్భూములనే ఉపయోగిస్తున్నారు.

‘‘విద్యవల్ల మాత్రమే మను షులకు మంచీచెడూ, తప్పూఒప్పూ విచక్షణ చేయగల శక్తి సమకూరుతుంది’’ అని న్యాయమూర్తులు అత్యంత ప్రాధాన్యంగల వాక్యాన్ని ప్రయోగించారు. అది ఆమోదనీయమైన మాటేగానీ, ప్రశ్నింపదగినది?
 ఇపుడింతకూ విద్యకు నిర్వచనం ఏమిటి? పంచ్ లేదా సర్పంచ్ కావాలనుకునే వారికి అర్హత కాలేజీ డిగ్రీనా, ప్రజ్ఞా సూచిక పరీక్షా (ఐక్యూ టెస్ట్), స్థాయిని తగ్గించిన ‘కాట్’ (కామన్ అడ్మిషన్ టెస్ట్)లాంటి దానికి సమానమైనదా? విద్వత్తుకు, పరిపాలనాపరమైన నాణ్యతకు మధ్య లంకె ఉన్నదనడానికి ఉన్న ఆధారాలు క్లిష్టమైనవి.

ఈ తీర్పు, బీజేపీ చేసిన చట్టానికి ఆమోద ముద్రవేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత చరిత్రలోనే అత్యంత అధ్వాన ప్రభుత్వాన్ని నడిపారనీ, నేటి ప్రభుత్వం అత్యుత్తమమైనదనీ విశ్వ సించే ఆ పార్టీ మద్దతుదార్లైన పట్టణ ‘‘విద్యావంతుల’’ నుంచి ఈ చట్టానికి విస్త్రుతమైన మద్దతు లభించింది. సాంప్రదాయక విద్యాపరమైన తెలివితేటల తర్కానికి ఈ అంశం ఎలా నిలుస్తుందని ప్రశ్నించాలనే దుగ్ధ ఇప్పుడు కలుగు తోంది. కానీ ఆ విషయం జోలికి కూడా మనం పోవద్దు.

ఎవరు ‘‘మంచీచెడులను, తప్పుఒప్పులను విచక్షణ చేయగల శక్తి’’ కలిగినంతటి విద్యావంతులు అయ్యారో నిర్ణయించేది ఎవరు? అత్యంత వ్యక్తిగతమైనదైన ఆ నిర్ణయాన్ని పైనుంచి కింది వరకు తీసుకోవాల్సినవారు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. తమకంటూ అలాంటి ఏ అర్హతలు ఏవీ ఇంతవరకూ లేనేలేని వారే పంచాయతీలకు ఎన్నికయ్యే వారికి కనీస అర్హతలను నిర్ణయిస్తారు. మీరే గనుక పూర్తి నిరక్షరాస్యులైన హరియాణా పౌరులైతే, ఇప్పుడు మీరు శాసనసభకు ఎన్నికై, మీలాంటి వారిని పంచాయితీ ఎన్నికలకు అనర్హులను చేస్తూ చట్టాలు చేసేయొచ్చు. నా సొంత రాష్ట్రమైన అక్కడ 25% ప్రజలు పూర్తి నిరక్షరాస్యులే. లోక్‌సభకు కూడా అలాంటి ఆంక్షలు వర్తించవు. నేటి లోక్‌సభలోని 543 మంది సభ్యులలో 16 మంది మెట్రిక్యులేషన్ లోపు చదువుకున్నవారు. ఇది హర్యానా శాసనసభ పంచాయితీలకు నిర్దేశించిన  ప్రమాణాల కంటే తక్కువ.

అన్నా హజారే ఉద్య మం, జన్‌లోక్‌పాల్ ప్యానెల్‌కు నోబెల్, మెగసెసే బహుమతులందుకున్న వారిని నామినేట్ చేయడాన్ని మాలాంటి వాళ్లం ఉన్నత వర్గవాదమని ప్రశ్నించ సాహసించాం. జనతాదళ్-యూకు చెందిన శరద్‌యాదవ్ పార్ల మెంట్ వైఖరికి మద్దతుగా నిలిచి, మన ప్రజాస్వామ్య వ్యవస్థే లేకపోతే పకోరీలాల్ వంటి వాళ్లు ఇక్కడ కూచునేవారేనా? అని ప్రశ్నించారు. పకోరీలాల్ ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్స్‌గంజ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌పీ సభ్యుడు. మెట్రిక్యులేషన్‌లోపు చదువుకున్న ఎంపీలలో ఆయనా ఉన్నారు.

చెత్తబుట్టలోని ‘అర్హతలకు’ పట్టం
ఇది సుప్రీం కోర్టు ఆదేశం కాబట్టి, దాని అంతరార్థాన్ని ఇతర సందర్భాలకు అన్వయించడాన్ని అనుమతించవచ్చునేమో. అయితే దాన్ని పైకి కూడా వర్తింపజేయవచ్చు. అంటే ఇక లోక్‌సభలో పకోరీలాల్‌లు ఉండరా? అత్యు న్నత విద్యావంతులు మనకు ప్రాతినిధ్యం వహించడమనేది అద్భుతమైన ఆలోచన. కానీ ప్రజాస్వామ్యమంటే ముందస్తుగా నిర్వచించిన లోపరహిత మైన స్థితి కాదు. సరికదా, అందుకోసం నిరంతరం పోరాడటం. 1935లో బ్రిటిష్ వారు వయోజన ఓటింగ్‌ను కొంత మేరకు అనుమతించినప్పుడు అలాంటి కనీస అర్హతలను నిర్ణయించారు. అలా కేవలం 3.5 కోట్ల మందికి లేదా జనాభాలో 20 శాతానికి ఓటు హక్కును ఇచ్చారు. మహిళలు వారిలో కేవలం ఆరో వంతు మాత్రమే. అంబేడ్కర్ రచించిన అద్భుత రాజ్యాంగం ఆ అర్హతలన్నిటినీ తీసి చెత్తబుట్టలో పడేసింది.

కలవరపడాల్సిన పలు లోపా లున్నా 65 ఏళ్లుగా మన ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటం దాని ఫలితమే. ఎన్నుకోదగినవారు ఎవరనే ఆ ఉన్నత వర్గవాదవైఖరినే పాకి స్తాన్ కొనసాగించింది. దానివల్ల ఎంత మంచి జరిగిందో మీరే చూడొచ్చు. పాకిస్తానీ ఉన్నత వర్గాలు ఆ అభూత కాల్పనికతకు మళ్లీ మళ్లీ వెళ్లి వచ్చాయి. 2002లో పర్వేజ్ ముషర్రాఫ్, పోటీకి కనీసార్హతగా గ్రాడ్యుయేషన్‌ను నిర్ణయిం చారు. అయితే మతపెద్దల మాటకు తలొగ్గి మదరసాల సనద్‌లను (డిప్లొ మాలు) కూడా వాటితో సమాన అర్హతగానే గుర్తించారు. ఆయన నిష్ర్కమణ తదుపరి సక్రమంగా జరిగిన ఎన్నికల్లో ఆ నిబంధనను రద్దుచేశారు. బ్యాంకు లకు రుణపడి ఉన్నవారు మొదలు, ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావమూ చూపనివారి వరకు అనర్హులను చేస్తూ ఆ దేశం పలు ప్రయోగాలు చేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ద్వారా మద్దతు తెలిపిన హరియాణా చట్టం సహకార సంస్థలకు, విద్యుత్ సంస్థలకు బకాయిలుపడ్డవారిని కూడా అనర్హు లను చేసింది.

ఎన్నికలన్నీ వ్యయంతో కూడుకున్నవేనని అది పేర్కొంది. కాబట్టి, ఎవరైనా, ఏదైనా పదవికి పోటీ పడుతున్నారంటేనే ఆమె లేదా అతడు ముందుగా తమ రుణాలను చెల్లించేయాలి లేదా ప్రజా ప్రతినిధి కావా లనే యోచనే చేయకుండా ఉండాలి. చక్కటి నైతిక వాదన. కానీ మీరు దీన్ని బకాయిదారుల ఛాంపియన్ అయిన రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాతో మొదలు పెట్టి, ఆ తర్వాత అప్పు చేసి గేదెను కొనుక్కోగా, అది కాస్తా ఆంత్రాక్స్ రోగంతో చనిపోయి బాధపడుతున్న దళిత మహిళ అప్పు జోలికి వెళ్లరాదూ? హరియాణా ప్రజలను విఫలం చేసిన రాజకీయ వర్గమే ఈ చట్టం ద్వారా వారిని నేడు పరాభవం పాలు చేసింది. తలసరి ఆదాయాల రీత్యా అది దేశం లోనే అతి సంపన్న రాష్ట్రం, కానీ సామాజిక సూచికల విషయానికొస్తే సిగ్గుప డాల్సిన స్థితి. స్రీ, పురుష నిష్పత్తి నేరంగా పరిగణించాల్సిన 879. కాగా అక్షరాస్యత రేటు, ప్రత్యేకించి మహిళల్లో అధమం. ఎన్నికైన ఏ ఉన్నత స్థాయి నేతా ప్రశ్నించడానికి సాహసించని కప్ పంచాయతీల పాలనసాగే ఆ గడ్డ మీదనే స్త్రీ, శిశుహత్యలు అతి విస్తృతంగా సాగుతున్నాయి.

పాలకుల వైఫల్యాలకు ప్రజలకు శిక్షా?
సుసంపన్నమైన ఒక రాష్ట్రం మీకు అక్షరాస్యత, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించ డంలో విఫలమైంది. అందుకుగానూ అది ఇప్పుడు మీకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును నిరాకరిస్తోంది. నాకైతే ఇది మరోసారి ‘‘సాలా మై తో సాహిబ్ బన్ గయా’’ అనే సజీనా (1974) సినిమాలోని దిలీప్‌కుమార్ పాటను గుర్తుకు తెస్తుంది. ప్రత్యేకించి ‘‘తుమ్ లంగోటీ వాలా న బద్లా హై న బద్లేగా, తుమ్ సబ్ కలా లోగే కిస్మత్ హమ్ సాలా బద్లేంగా ’’ (మీ గోచిపాతలోళ్లు మారలేదు, మారరు, కానీ నేనిప్పుడు ఎలా మీ తలరాత మార్చేస్తానో చూడండి) అనే చరణాలు గుర్తుకొస్తున్నాయి. ఈ ఉద్వేగంలో పడి కొట్టుకుపోవడం వల్ల ముంచుకొచ్చే ప్రమాదాలేమిటనే స్పృహ నాకుంది. కానీ తమరు ఆమోదముద్ర వేసినది ఇలాంటి ఆలోచనా రీతికేనని విన్నవిం చుకోవాల్సి ఉంది. గౌరవనీయులైన తమరు సదుద్దేశాలతోనే ఇది చేశారను కోండి. నాకంటే యువతరానికి చెందిన, ధైర్యవంతులు, పండితులు అయిన ఒక వ్యక్తి మాటలను దొంగిలించి, ఆమె వెనుక దాక్కుంటానని మీకు ముందే చెప్పాను.

ఆమె పేరు అర్పితా ఫుకాన్ బిస్వాస్. అద్భుతమైన సామాజిక శాస్త్రవేత్త, పొవాయ్ ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్. ఈ ఉదయం ఆమె ఈ తీర్పుపై తన వరుస ట్వీట్లతో (@Arpitapb) విద్య మాత్రమే మనకు మంచీ చెడు విచక్ష ణా శక్తిని ఇస్తుందా? ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడానికి పరిపా లనాపరమైన నైపుణ్యం ముందు షరతా? వంటి ప్రశ్నలను ట్వీట్లతో కురిపిం చింది. ఆమె హాష్‌టాగ్‌తో ుట్రంప్‌ఎవే అని ప్రయోగించింది. ఇప్పుడు నేను కూడా అంతే నిర్లక్ష్యంగా, దీని అర్థం సుప్రీంకోర్టు ఆదేశం సమాజం పట్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న నేత డోనాల్డ్ ట్రంప్ దృష్టిని ప్రతిబింబిస్తోందని చెప్పాలా? అంతకంటే నేనామె వెనుక నక్కి, ఆమె అలా అంది అంటాను.
 
 - శేఖర్ గుప్తా

 twitter@shekargupta

Advertisement
Advertisement