ప్రజాసాహితిలో గురజాడ | Sakshi
Sakshi News home page

ప్రజాసాహితిలో గురజాడ

Published Sat, May 30 2015 11:31 PM

ప్రజాసాహితిలో గురజాడ

‘తలుపు తలుపు’... ఈ రెండు మాటలతోనే గురజాడ ‘దిద్దుబాటు’కథను ప్రారంభించారు. ఆ మాటలు ఆధునిక తెలుగు సాహిత్య వాకిలిని తెరిపించడానికి మహాకవి అన్న మాటలేననిపిస్తాయి. ఆయన ఇచ్చిన ఆధునిక దృష్టి నుంచి తెలుగు సాహిత్యం సదా స్ఫూర్తిని పొందుతూనే ఉంది. అందుకు నిదర్శనమే కన్యాశుల్కం నాటక ప్రదర్శన నూరేళ్ల సందర్భం, గురజాడ నూరవ వర్ధంతి సందర్భాలకు లభించిన స్పందన. అందులో ఒక స్రవంతి ‘ప్రజాసాహితిలో (1977-2015) మహాకవి గురజాడ’ పుస్తకం.

సాహిత్యాన్ని సమాజోద్ధరణకు వినియోగించుకున్నా, దానికి ఉండవలసిన సౌందర్య దృష్టిని విస్మరించని మహనీయుడు గురజాడ. వీటి వెనుక ఉన్న నేపథ్యాన్నే ఈ వ్యాసాలు చాలా వరకు వివరించాయి. కామ్రేడ్ గురజాడ, కన్యాశుల్కములో మధురవాణి (శ్రీశ్రీ), ‘వాడుక తెనుగు’ (గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ఈ పద్యాలు గురజాడ నిర్యాణం సందర్భంలో 4-12-1915న కృష్ణాపత్రికలో వెలువడినాయి.), మహాకవి (కవిత, దేవులపల్లి కృష్ణశాస్త్రి), గిరీశం-శకారుడూ (వ్యాసం, రాంభట్ల కృష్ణమూర్తి), డామిట్ గురజాడా! (దీర్ఘ కవిత, శివసాగర్), అప్పరాయ కవీ! (వ్యాసం, నార్ల వెంకటేశ్వరరావు), గురజాడ మనస్తత్వంలో విపరీత ధోరణులు (వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి), బంగోరె ‘మొట్టమొదటి కన్యాశుల్కంపై సమీక్షలలోని శకలాలు (మునిమాణిక్యం నరసింహారావు), గురజాడ నిపుణవాణి మధురవాణి (సంజీవ్‌దేవ్) వంటి సాహితీవేత్తల వ్యాసాలు ఇందులో చేర్చారు. సెట్టి ఈశ్వరరావు, కాత్యాయనీ విద్మహే, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య ఎస్.గంగప్ప, బి.సూర్యసాగర్, కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, ఛాయారాజ్, కాకరాల, అంపశయ్య నవీన్ వంటి పరిశోధకులు, విమర్శకులు, సామాజిక విశ్లేషకుల వ్యాసాలు కూడా ఉన్నాయి. యుఎ నరసింహమూర్తి కన్యాశుల్కం నాటకాన్ని 19వ శతాబ్దంలో వచ్చిన భారతీయ నాటకాలతో పోలుస్తూ విలువైన వ్యాసం రాశారు (ఈ వ్యాసమే తరువాత ఉద్గ్రంథంగా విస్తరించారు). ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ అడుగుజాడను రుజువు చేసే వ్యాస సంకలనం ఇది.

  కల్హణ
 ప్రజాసాహితిలో (1977-2015) మహాకవి గురజాడ
 వెల: 400; ప్రతులకు: మైత్రీ బుక్‌హౌస్, జలీల్ వీధి, కారల్‌మార్క్స్ రోడ్, విజయవాడ-520 002. ఫోన్: 9848631604
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement