‘పైపులైను’లో రెండు కత్తుల బంధం | Sakshi
Sakshi News home page

‘పైపులైను’లో రెండు కత్తుల బంధం

Published Wed, May 28 2014 11:32 PM

‘పైపులైను’లో రెండు కత్తుల బంధం

ఉక్రెయిన్ సంక్షోభం ఫలితంగా రష్యా, చైనాల మధ్య రెండు దశాబ్దాలుగా నలుగుతున్న భారీ గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కొలిక్కి వచ్చింది. విరుద్ధ ప్రయోజనాలను కలిగిన ప్రత్యర్థి దేశాల మధ్య ఈ ఒప్పందంతో దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక బంధానికి రంగం సిద్ధమైంది.
 
అపనమ్మకం, అవిశ్వాసం అంతర్జాతీయ సంబంధాలకు మారుపేరుగా మారిన కాలంలో... ఒక్క ఒరలో ఇమడని కత్తుల్లాంటి ప్రపంచాధిపత్య శక్తులు రష్యా, చైనాల మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక ‘సమగ్ర వ్యూహాత్మక సమన్వయ భాగస్వామ్య ఒప్పందం’ కుదిరి, సుదీర్ఘ మైత్రికి పునాదులు పడటం విడ్డూరమే. అయితే ఆ ఖ్యాతి మాత్రం... చైనాను ఏకాకిని చేసే ‘ఆసియా వ్యూహాన్నీ’, రష్యా తోక కత్తిరించే ‘యూరోపియన్ వ్యూహాన్నీ’ ఏక కాలంలో అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాదే. ఉక్రెయిన్ కొరివితో తల గోక్కున్నది చాలక ఆయన... ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడే స్థితి నుంచి బయటపడాలని యూరోపియన్  దేశాలకు ఆదేశాలు జారీ చేశారు. వాటికి ఈయూలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అవి అమలవుతాయో లేదో గానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ముందుచూపుతో వ్యవహరించారు. 20 ఏళ్లుగా చైనాతో తెగకుండా, ముడిపడకుండా ఉన్న లక్ష కోట్ల డాలర్ల భారీ గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమయ్యారు. ఈ నెల మే 20న చైనా వెళ్లిన పుతిన్ సంతకాలు చేయడం మినహా ఒప్పందాన్ని దాదాపు ఖరారు చేసుకున్నారు. ఈయూ దేశాలకు సరఫరా చేస్తున్నట్టే గ్యాస్ ధరను చమురు ధరతో ముడిపెట్టే పద్ధతిలో ఎల్‌పీజీని కొనడానికి చైనా ఇంతకాలంగా ససేమిరా అంటోంది. చైనా ప్రధాన షరతులన్నిటికీ అంగీకరించడానికి పుతిన్ నేడు సిద్ధమయ్యారు.

రష్యా ప్రభుత్వ సంస్థ ‘గాజ్‌ప్రోమ్’ సైబీరియాలోని నాలుగు గ్యాస్ క్షేత్రాల నుంచి 2018 నుంచి రోజుకు 375 కోట్ల చదరపు ఘనపు అడుగుల గ్యాస్‌ను చైనాకు కనీసం 30 ఏళ్ల పాటూ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈయూ దేశాలకు వెయ్యి క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సగటున 380 డాలర్ల ధరకు విక్రయిస్తుండగా చైనాకు 350 డాలర్ల ధరకే అందించనున్నట్టు సమాచారం. పైగా ఈ ఒప్పందం ప్రపంచంలో ‘గ్యాసో యువాన ్ల’ శకానికి తెరదీసింది. రష్యాకు చెల్లింపులన్నీ చైనా యువాన్లలోనే జరుగుతాయి. రష్యా ఇక గ్యాసో యువాన్ల దిగుమతులకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. అంటే చైనా, హాంకాంగ్‌ల నుంచి దిగుమతులకు రష్యా దారులు తెరుచుకుంటాయి. హాంకాంగ్‌లోని అంతర్జాతీయ బ్యాంకులన్నీ ఇప్పటికే యువాన్లలో చెల్లింపులు జరుపుతూ దానికి డాలర్, యూరోల సరసన అంతర్జాతీయ మారక ద్రవ్యంగా పీట వేశాయి. చైనా నుంచి వచ్చే రాబడులు ఆర్థిక తిరోగమనంలో ఉన్న రష్యా వృద్ధి బాటపట్టడానికి తోడ్పడతాయి. అంతకు మించి అది సైబీరియాను భారీ అంతర్జాతీయ గ్యాస్ కేంద్రంగా మార్చనుంది. చైనాకు నిర్మిస్తున్న పైపులైను ద్వారానే జపాన్, దక్షిణ కొరియాలకు గ్యాస్ సరఫరా చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. సైబీరియా తూర్పు కొసన ఉన్న సఖాలిన్ గ్యాస్ క్షేత్రం నుంచి ఆ రెండు అమెరికా మిత్ర దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా చేస్తోంది. ఆ పాత పైప్‌లైన్లను నూతన నిర్మాణంతో అనుసంధానించడమే గాక, దక్షిణ కొరియా ద్వారా నైరుతి ఆసియానంత టినీ రష్యా తన గ్యాస్ వలలోకి తేనుంది. ఉక్రేనియన్ సంక్షోభంలో రష్యాను ఏకాకిని చేయడంలో జపాన్ సహా ఏ ఒక్క ఆసియా దేశం అమెరికాకు మద్దతు పలకక పోవడంలో విడ్డూరం లేదు!  
ప్రపంచాధిపత్య శక్తిగా ఎదగాలని తపిస్తున్న చైనా, ఇంకా అగ్రరాజ్యాన్ననే భావిస్తున్న రష్యా విడివిడిగా ఆసియాపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ వచ్చాయి. చైనా, జపాన్ తదితర దేశాలతో కయ్యానికి కాలు దువ్వి దారికి రప్పించుకునే వ్యూహం అనుసరిస్తోంది. ఆ దేశాలతో గ్యాస్ బంధం పటిష్టం చేసుకుని చైనా, అమెరికాలకు వ్యతిరేకంగా రష్యా కూటమిని నిర్మించే దూరదృష్టితో రష్యా  పావులు కదుపుతోంది. అలాగే చైనా అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్థాన్‌లతో నెయ్యం నెరపుతోంది. ఇలా ఉండగా అమెరికా ఆసియాలో చైనాను ఏకాకిని చేసే ఆసియా వ్యూహాన్ని మొదలు పెట్టింది. అది చాలదని ‘ఉక్రెయిన్’ దుస్సాహసానికి పాల్పడింది. దీంతో భావి ప్రత్యర్థులు ఒద్దికగా కలిసి కాపురం చేయడానికి సిద్ధపడక తప్పలేదు. రష్యా, చైనాకు సరఫరా చేయబోయే గ్యాస్ ఆ దేశం మొత్తం గ్యాస్, చమురు దిగుమతుల్లో 30 శాతం. అంటే కనీసం మూడు దశాబ్దాల పాటూ ఒకరి పిలక ఒకరికి చిక్కిందనే అర్థం. కాబట్టే 2018 నాటికి సిద్ధం కానున్న రష్యన్ ‘స్టార్‌వార్’ క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ల కోసం బేరసారాలు మొదలయ్యాయి. ఆలోగా అత్యాధునికమైన సుఖోయ్ సు-35 జెట్‌ఫైటర్ల అమ్మకం తుది దశకు చేరింది. చైనా ఏవియేషన్ పరిశ్రమలో రష్యా భాగస్వామి కాబోతోంది. ఇక  వాణిజ్య ఒప్పందాల గురించి చెప్పనవసరం లేదు. ఒబామా జోడు గుళ్ల తుపాకీ తుస్సుమన్నా ఇష్టంలేని పెళ్లికి రష్యా, చైనాలను ఠక్కున ఒప్పించేసింది  
 పి. గౌతమ్
 

Advertisement
Advertisement