శరత్ నాయకుడు | Sakshi
Sakshi News home page

శరత్ నాయకుడు

Published Sat, Feb 1 2014 3:15 AM

శరత్ నాయకుడు - Sakshi

పురాణాలు, ఇతిహాసాల నుంచి కథలు స్వీకరించడం చిటికెలో పని. జానపద కథ అల్లమంటే మనవాళ్లకు తిరుగులేదు. ఎటొచ్చీ సాంఘిక వస్తువును కథగా కల్పించడమంటేనే కాసింత తెల్లముఖం. అందునా సినిమాకు పనికి వచ్చే కథను కల్పించడం అంటే కష్టసాధ్యమే. అందుకే తెలుగువాళ్లు బెంగాలీ జుబ్బా తొడుక్కోవాల్సి వచ్చింది. బెంగాలీ పాత్రలే తెలుగు హీరోలుగా కనిపించాల్సి వచ్చింది. 1949లో ‘విప్రదాసు’ నవల మొదటిసారిగా ‘మన దేశం’ పేరుతో మన దగ్గర సినిమాగా వచ్చింది. ఆ తర్వాత ఆ వరుస అలా కొనసాగి శరత్ రంగప్రవేశంతో ఉధృతమయ్యింది. శరత్ వల్ల అక్కినేని, అక్కినేని వల్ల శరత్ తెలుగు నేల మీద, వెండి తెర మీద ఒకరి చేయి మరొకరు పట్టుకొని దూసుకుపోయారు.
 
 ఆ శరత్ నవలల్లో ఏముంది.. బండెడు పాదధూళీ కుండెడు కన్నీళ్లూ అన్నారట ఎవరో.  మనుగడ కోసం పోరాటం మనకు తెలిసిందే. ప్రతి జీవీ తన ఆకారాన్ని బట్టి శక్తియుక్తులను బట్టి వ్యూహాలు రచించుకొని మనుగడ సాగిస్తుంది. అక్కినేని కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయన కళ్లు, ఒళ్లు, విగ్రహం చిన్నవి. రూపం ఆజానుబాహు కాదు. కాని తన కళ్లలో ఏదో మత్తు, చూపులో వగరు, నడకలో విరుపు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఈ లక్షణాలు మహిళా ప్రేక్షకులనాకర్షిస్తాయనీ తెలుసు. కనుక తన దారి వేరుగా వేసుకున్నారు.
 
 ఇంకో కారణం అప్పటికే ‘పాతాళభైరవి’ (1951) వచ్చి ఎన్.టి.ఆర్‌ను  తిరుగులేని జానపద నాయకుణ్ణి చేసింది. అక్కినేని అంతకుముందు కత్తులు పట్టుకున్నా ఎన్.టి.ఆర్‌కే పేరు. ఆయనదే ఊపు. ఆ గాలి ఎలాంటిదంటే 1952లో 26 సినిమాలు వస్తే మూడు ఎన్.టి.ఆర్‌వి ఒక్కటే అక్కినేనిది. ఆ ఒక్కటి కూడా ఫ్లాప్ అయిన భరణివారి ‘ప్రేమ’. దాంతో అక్కినేని ఆలోచించారు. సాంఘిక చిత్రాలవైపు చలో పోదాం అనుకున్నారు. 1950లో వచ్చిన ‘సంసారం’ అందుకు ఊతం. తర్వాత మూడేళ్లకు వచ్చిన ‘దేవదాసు’ ఆ దారిని ఖాయం చేసి అలాంటి పాత్రలకూ దాంతోపాటు నవలా చిత్రాలకూ నాంది పలికింది.
 
 బెంగాలీ రచయితల్లో శరత్ పెద్ద స్టార్. టాగోర్ సమకాలీనుడు. దేవదాసు రాసి పొందిన ఖ్యాతి అంతా ఇంతా కాదు. నిజానికి శరత్ ఆ నవలను నూనూగు మీసాల వయసులో రాశాడు. ఐతే దీనిని చదివితే కుర్రాళ్లు పాడైపోతారేమోననే భయంతో ప్రచురించకుండా పెట్టె అడుగునెక్కడో పడేశాడు. కాని శరత్ మిత్రుడొకడు చదివి ముగ్థుడై ఆయనకి చెప్పకుండా ఈ నవలను ప్రచురణకిచ్చేశాడు. ఆ తర్వాతిదంతా చరిత్ర. మరి ఇంత ఘనమైన నవలను  తెరకెక్కించాలని డి.ఎల్.
 
 నారాయణ అనుకున్నప్పుడు సహజంగానే విమర్శలు తప్పవు. పరిశ్రమలోని పెద్దలు అక్కినేని పనికిరాడన్నారు. పత్రికలు ఇదేం సెలక్షన్ అని కామెంట్ చేశాయి. అయితే డి.ఎల్. వెనక్కు తగ్గలేదు. నవయుగ  కాట్రగడ్డ శ్రీనివాసరావు వంటివారు అక్కినేనికి తమ మద్దతు మానలేదు. ఎలాగో ఆ పాత్ర ఆయనకు వచ్చింది. వీరుడికి తగిన సమరస్థలి. అక్కినేని కూడా సినీ రంగంలో తాను నిలబడడానికి ఇదే ఆఖరి చాన్సు అనుకున్నారు. ఆ స్పృహతోనే సర్వశక్తులు ఒడ్డి ‘దేవదాసు’ చేశారు. ఫలితం తెలిసిందే. ఇందులో దేవదాసు తన పిరికితనంతో ప్రేమ, పేరు, కులం, కుటుంబం అన్నీ పోగొట్టుకుంటాడు. అయినా సరే ఆ పాత్రంటే మనకు అసహ్యం కలగదు. పైగా జాలి, ప్రేమ కలుగుతాయి. దీనికి కారణం అక్కినేని అభినయం. ఆయన అందులోకి తెచ్చిన జీవం. ముఖ్యంగా- చంద్రముఖి దేవదాసు వీడ్కోలు సన్నివేశం,ై రెల్లో ధర్మన్నను వదిలి దుర్గాపురం వెళ్లే సన్నివేశం, చావుబతుకుల్లో పార్వతి కోసం పరితపించే సన్నివేశం ఈ మూడింట్లో అక్కినేని- దేవదాసును నిజంగా చూస్తున్నామా అన్నంత భ్రాంతి కలిగించారు. కాళుడులోంచి కాళిదాసు వచ్చినట్లు దేవదాసులోంచి అక్కినేనిలోని నటుడు బయటికొచ్చి సాంఘిక నాయకుడిగా దశాబ్దాల పాటు విజయదుందుభి మోగించాడు.
 
 ఆ వరుసలో శరత్ రచించిన ‘నిష్కృతి’ నవల ఆధారంగా వచ్చిన చిత్రం తోడికోడళ్లు. ఆదుర్తి దర్శకుడు. ప్రేక్షకుల కోసమని నవలని బాగా మార్చాల్సి వచ్చింది. దానికి కారణం శరత్తే. ఆయన నవలల పట్ల ఉన్న ఒక అభిప్రాయం. ఆ శరత్ నవలల్లో ఏముంది.. బండెడు పాదధూళీ కుండెడు కన్నీళ్లూ అన్నారట ఎవరో. అలాంటి కథని దుక్కిపాటి, ఆదుర్తి, ఆత్రేయ తీసుకొని తెలుగుదనం జోడించి తోడికోడళ్ల సంగ్రామం సినిమా సక్సెస్ ఫార్ములాల్లో ఒకటని స్థిరపరిచేశారు. ఇందులో అక్కినేని- తాను వేసిన సత్యం పాత్రకు సమగ్ర రూపకల్పన జరగక పోయినా ఆ లోపాలు కనబడకుండా నటించి ఆ పాత్రను చిరస్మరణీయం చేశారు. ‘కారులో షికారుకెళ్లే’ పాట ఇందులోదే కదా. శ్రీశ్రీ రాశారని అనుకున్నారు. ఆత్రేయ మెరుపు అది.
 
 శరత్ రాసిన ‘కాశీనాథ్’ నవల ఆధారంగా తీసిన చిత్రం ఇల్లరికం. ఇందులో ఇల్లరికానికి అంగీకరించిన ఒక స్వాభిమాని అనుభవించే మానసిక క్షోభను అక్కినేని బాగా అభినయించారు. ముఖ్యంగా ఒక సన్నివేశంలో- రాధ(జమున)తో వేణు (అక్కినేని) ‘అన్నం తింటుంటే అవమానిస్తున్నారు. నిన్ను క్షమిస్తున్నాను. కాని ఆ భగవంతుడు క్షమించడు’ అన్నప్పుడు ఆ గొంతులో కాఠిన్యం ధ్వనించదు. ఒక హుందాతనం గోచరిస్తుంది. మరో విశేషం. ఈ సినిమాలోని ‘నిలువవే వాలు కనులదానా’ పాట అక్కినేనికి నచ్చలేదట. అయినా దర్శకుడు తాతినేని ప్రకాశరావు నచ్చచెప్పి తీశారు. తీరా రిలీజయ్యాక ఆ పాట వల్లే ఆ చిత్రం రజతోత్సవాలు జరుపుకుంది.
 
 శరత్ రచించిన ‘బడీ దీదీ’ నవల ఆధారంగా భానుమతీ రామకృష్ణులు నిర్మించిన చిత్రం ‘బాటసారి’ (1961). ఇది అక్కినేని నటజీవితంలో కలికితురాయి. చివరి ఊపిరి వరకూ ఆయన ఈ సినిమా గురించి మాట్లాడేవారు. అక్కినేనికి తన పాత్రల్లో ఎక్కువ నచ్చింది కూడా ‘సురేన్’ పాత్రే. సురేంద్రనాథ్ అమిత మితభాషి. సమాజంలో ఒంటరిగా వదిలేస్తే బతకడం తెలీని, చేతగానిమనిషి. మాటల ద్వారా గాక చూపుల ద్వారా, కదలికల ద్వారా భావాన్ని వ్యక్తం చేసే పాత్ర అది.
 
 చాలా కష్టం. కాని అలాంటి చాలెంజ్‌ను ఎదుర్కొని సఫలం అయిన నటుడు అక్కినేని. ఇక శరత్ రచించిన ‘దత్త’ నవల ఆధారంగా ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వాగ్దానం’ (1961). బ్రహ్మసమాజం నేపధ్యంగా సాగే నవలను తెలుగు వాతావరణానికి అనువుగా మలచడంలో ఆత్రేయ విఫలమైనా ‘సూర్యం’ పాత్రలో అక్కినేని సఫలమయ్యారు. సినిమాలో నాయికే ప్రధానం. నాయకుడు  మబ్బుచాటు చంద్రుని వలే ఉంటాడు. తనకు అన్యాయం, అవమానం జరిగినా పట్టించుకోని సంయమనశీలి. ఈ రకమైన పాత్రలు అక్కినేనికి కొట్టినపిండే అయినా ఆత్రేయ దర్శకత్వపు అత్యుత్సాహంలో అక్కినేని నట వైదుష్యం అడవిలో కూసిన కోయిలే అయింది. అయినా ‘నా కంటిపాపలో నిలిచిపోరా’ (దాశరథికిదే తొలి చిత్రగీతం) అన్న పాట ద్వారా అక్కినేని మరోసారి లవర్‌బాయ్ అని నిరూపించుకున్నాడు. ఇలా ఒక బెంగాలీ రచయితకు ఒక తెలుగు హీరో దొరికి ఆదరణ పొందడం విడ్డూరం. ఆ భోగం శరత్‌కు దక్కింది. ఆ వైభోగం అక్కినేనికే సాధ్యమైంది.
 - కంపల్లె రవిచంద్రన్, 9848720478
 

Advertisement

తప్పక చదవండి

Advertisement